స్ఫూర్తి
చుట్టూ చీకటిగా ఉందని తిట్టుకునే వారు కొందరు. ఎవరో ఒకరు ఆ చీకటిలో వెలుగులు నింపకపోతారా.. అని ఎదురు చూసే వారు కొందరు. ఆ చీకటిలోనే చిరుదివ్వెను వెలిగించే వారు మరికొందరు. అజిత్ సింగ్ ఈ మూడోకోవకు చెందినవాడు. రాజస్థాన్ లోని షెఖావతీ ప్రాంతంలో నీటి చుక్క లేక కరువు విలయ తాండవం చేస్తోందన్న వార్త విని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన అజిత్ సింగ్ చలించిపోయారు. చుట్టుపక్కల ఎక్కడా చెట్లు లేకపోవడమే ఆ కరువుకు కారణం అని అతని భావన. అందుకే అక్కడ పచ్చని చెట్లను నాటడమే కాదు, వాటి సంరక్షణ బాధ్యత కూడా వహించి ‘ఆక్సిజన్ పార్కులు’ నెలకొల్పాడు. వాటి ద్వారా అక్కడి కరువు రక్కసి కోరలు విరిచే ప్రయత్నం చేశాడు.
రాజస్థాన్ లోని సికార్, బికనీర్, ఝుంఝును, జైపూర్, చురు, భిల్వారా, టోంక్‌లలో 51,000 చెట్లను నాటేవరకు కాళ్లకు చెప్పులు ధరించేది లేదని ఒట్టు పెట్టుకున్న అజిత్, తన కల సాకారం కావడంతో ఐదు సంవత్సరాల తర్వాత ఇటీవలే చెప్పులు ధరించాడు.
రాజస్థాన్ లోని సికార్‌లోని చిన్ చాస్ గ్రామంలో పెరిగిన 36 సంవత్సరాల అజిత్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చేశాడు. తరువాత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశాడు. అయితే అతనికి మంచి జీతాన్నిచ్చే ఆ ఉద్యోగం ద్వారా కలగని సంతృప్తి కరువు పీడిత ప్రాంతాలలో చెట్లను నాటి అవి చల్లటి గాలికి పరవశించి తలలు ఊపుతూ ఉన్నప్పుడు కలిగింది.
మొదటినుంచి పేదల పక్షపాతిగానే ఉన్న అజిత్ జీవితం 2019లో ఒక వాట్సాప్ ఫార్వార్డ్ వల్ల ఒక మలుపు తిరిగింది.
రాజస్థాన్ అంతటా ‘ఆక్సిజన్ పార్కుల’ సృష్టి
రాజస్థాన్ రాష్ట్రం సికార్‌లోని చిన్ చాస్, టోంక్‌లోని బాగ్రి , బికనీర్‌లోని బద్రాసర్ గ్రామం, షరా నాథనియా గ్రామాలు, భిల్వారాలోని ఖోహ్రా కలాన్, జైపూర్‌లోని సంజారియా గ్రామాలలో చెట్లను నాటడం ద్వారా ఆక్సిజన్ పార్కులను సృష్టించాడు.
‘‘మేము మొదట పాఠశాలలు, శ్మశానవాటికలు, ఆశ్రమాలలో చెట్లను నాటేందుకు అధికారుల నుండి అనుమతి ΄÷ందుతాం. ఆ తర్వాత ఆ ప్రాంతానికి నాలుగు వైపులా కంచె వేస్తాం. మేము చెట్లను నాటిన తర్వాత కొన్ని సంవత్సరాలపాటు వాటి నిర్వహణను చూసుకుంటాం. చెట్లు వాటి పూర్తి ఎత్తుకు పెరిగిన తర్వాత, మేము కంచెను తొలగిస్తాం. కాలక్రమేణా, అవే ఆక్సిజన్ పార్కులుగా... ప్రకృతి కేంద్రాలుగా మారతాయి. ఉదాహరణకు, చిన్చాస్ గ్రామంలోని ఐదు ఆక్సిజన్ పార్కులలో పిచ్చుకలు, చిలుకలు, కోకిలలు, సారస్ కొంగలు, నెమళ్ళు గుంపులుగా ఉంటాయి. వీటిలో ఒకదానిలో, నేను, నా స్నేహితుల బృందం కలిసి ఐదు కృత్రిమ చెరువులను తవ్వాం. వాటి ఒడ్డున అర్జున, వేప, తులసి, గిలోయి నాటాము.
అజిత్ ఇచ్చిన పిలుపుతో... చూపిన చొరవతో ‘ధర్తి మా హరిత్ శృంగార్ యాత్ర’ కింద విద్యార్థులు కూడా చెట్లను నాటి, వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టడం ప్రాంరంభించారు. దాంతో చూస్తుండగానే అవన్నీ ఆక్సిజన్ పార్క్‌లుగా మారిపోయాయి. అయితే ఇదంతా అంత సులువుగా ఏం జరగలేదని చెబుతూ మొక్కలు నాటేందుకు ‘‘నా దగ్గర డబ్బు మొత్తం అయిపోయింది. డీలా పడిపోయిన నన్ను చూసి నా భార్య మొక్కలు, నీటిపారుదల పరికరాలను కొనుగోలు చేయడానికి తన నగలను తాకట్టు పెట్టింది’’ అని అజిత్ గుర్తు చేసుకున్నాడు. అజిత్ సృష్టించిన అడవులను పరిశీలించడానికి అధికారులు సైట్ సందర్శించారు. ఈ ప్రాంతంలో నీటి లభ్యత ఏమాత్రం లేకపోయినప్పటికీ, అజిత్, అతని బృందం తమ చెమట చుక్కలతో అక్కడ అడవులను సృష్టిం^è గలిగారు.
‘చెట్లు మీకు సహన కళను నేర్పుతాయి. అవి వేచి ఉండటం, నిశ్శబ్దంగా పనిచేయడం, అవసరమైనప్పుడు ఫలాలను ఇవ్వడం అనే కళను మీకు నేర్పుతాయి’ అంటాడు అజిత్.


