డిజిటల్ హింసపై యునైట్ ఫైట్ | International Day for Elimination of Violence Against Women | Sakshi
Sakshi News home page

డిజిటల్ హింసపై యునైట్ ఫైట్

Nov 29 2025 12:53 AM | Updated on Nov 29 2025 12:53 AM

International Day for Elimination of Violence Against Women

‘బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు’  సరదాగా పాడుకున్న పాట. బుల్లిపెట్టెలో ఆ బూచాడు లేకపోవచ్చు. కాని ఇప్పటి బుల్లిపెట్టెలలో (స్మార్మ్‌ఫోన్స్, ల్యాప్‌టాప్, ట్యాప్‌)లలో ఒక రాక్షసుడు దాగి ఉన్నాడు. మహిళలను లక్ష్యంగా చేసుకొని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ రాక్షడుసుడి పేరు...  ‘డిజిటల్‌ హింసాసురుడు’

‘ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ది ఎలిమినేషన్‌ ఆఫ్‌ వయోలెన్స్‌ అగేనెస్ట్‌ ఉమెన్‌’ సందర్భంగా ఐక్యరాజ్య సమితి డిజిటల్‌ హింసకు వ్యతిరేకంగా పదహారు రోజుల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాలలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది భాగస్వాములు అవుతున్నారు... కాలంతో పాటు మహిళలపై జరిగే హింసా రూపాలు మారుతున్నాయి.‘డిజిటల్‌ వయోలెన్స్‌’ అనేది ఇప్పుడు సరికొత్త సాంకేతిక హింస.

వైరల్‌ అయినా  ప్రమాదమేనా?!
కేవలం రెండు సెకన్‌ల వీడియోతో ఇటీవల ఇంటర్నెట్‌ అబ్సెషన్‌గా మారింది ప్రియంగన. తక్కువ టైమ్‌లోనే ఈ వీడియో క్లిప్‌ 50 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు... ఆమె ఏఐ వీడియోలు ఆల్‌లైన్‌లో వెల్లువెత్తాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఆమె ఏఐ వీడియోలను క్రియేట్‌ చేస్తున్నారు. పరిస్థితి ప్రమాదం వైపు వెళుతుందని గ్రహించిన ప్రియంగన మెల్లగా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లను తొలిగించడం మొదలుపెట్టింది. తన వీడియో క్లిప్‌ వైరల్‌ కావడం వల్ల ఎదురైన సమస్యలను ఏకరువు పెట్టిన ప్రియంగన తన ఏఐ జనరేటెడ్‌ వీడియోలు, ఇమేజ్‌ల వల్ల తాను, తన కుటుంబం ఇబ్బందులు పడినట్టు తెలియజేసింది. ఇది మచ్చుకు చిన్న ఉదాహరణ మాత్రమే!

అవమానాలు...ఆత్మహత్యలు
డిజిటల్‌ హింస భరించలేక మానసిక సమస్యల బారిన పడుతున్నవారూ, ఆత్మహత్యలు చేసుకుంటున్నవారూ దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు. టెక్నాలజీ–ఫెసిలేటెడ్‌ జెండర్‌–బేస్డ్‌ వయోలెన్స్‌(టీఎఫ్‌జీబివి) వల్ల  మన దేశంలోని ఆన్‌లైన్‌ స్పేస్‌లు మహిళల పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయని ఒక నివేదిక హెచ్చరించింది. 

బహిరంగంగా అవమానించడం, అవహేళన చేయడం, బెదిరింపులు... మొదలైన రూపాల్లో మహిళలపై డిజిటల్‌ హింస జరుగుతోంది. ఫొటోల డిజిటల్‌ మాన్యుపులేషన్, ఫేక్‌ ఎకౌంట్స్, సైబర్‌ బుల్లీయింగ్, కోఆర్డినేటెడ్‌ ఎటాక్స్‌.. మొదలైనవి డిజిటల్‌ హింస తాలూకు వివిధ రూపాలు. అశ్లీల సైట్లు, చాట్‌ ప్లాట్‌ఫామ్‌లలో తాము టార్గెట్‌ చేసిన మహిళల చిత్రాలను పోస్ట్‌ చేసి అసభ్య రాతలు రాస్తుంటారు. ‘ఇది నా ఫోన్‌ నంబర్‌ కాల్‌ చేయండి’ అని ఫోన్‌ నెంబర్‌ పెడుతుంటారు.

ఫిర్యాదు చేయాలా, వద్దా?
డిజిటల్‌ వేదికలలో కొందరు నేరస్థులు మంచి మాటలతో అమ్మాయిలను పరిచయం చేసుకొని, స్నేహం చేస్తారు. ఆ తరువాత రకరకాలుగా బ్లాక్‌మెయిల్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంత జరుగుతున్నా చాలామంది బాధితులు పోలిస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.

‘ఫిర్యాదు చేయడం అనేది మరొకరకమైన హింస. నా దురదృష్టం అని బాధపడి ఊరుకున్నాను’ అంటుంది దిల్లీకి చెందిన ఒక బాధిత మహిళ. పదిమందికి తెలిస్తే పరువు పోతుంది అనుకోవడం, కుటుంబ ఒత్తిళ్లు, న్యాయం జరగదు అనే అపోహల వల్ల చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి దూరంగా ఉంటున్నారు. కొందరు బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసినా, ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి ఎంతో కాలం పట్టడం లేదు. భద్రతతో పాటు ఇంకా ఎన్నో అంశాలు ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి కారణం అవుతున్నాయి. ఫిర్యాదులు అందినప్పుడు కొన్ని కేసులకు సంబంధించి ఎలా స్పందించాలో పోలీసులకు తెలియడం లేదు.

చట్టం ఉన్నా సరే...
మన దేశంలో సైబర్‌ నేరాలను నిరోధించే ప్రధాన చట్టం సమాచార సాంకేతిక చట్టం–2000 (ఐటీ చట్టం) అయితే ఇది ప్రధానంగా ఆస్తి, డేటాకు సంబంధించిన నేరాలపై మాత్రమే ప్రధానంగా దృష్టి సారిస్తోంది.

‘మహిళలపై జరిగే డిజిటల్‌ హింసకు సంబంధించి ఈ చట్టం సమర్ధంగా ఉపయోగపడడం లేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొందరు.

‘ఫిర్యాదు అందిన వెంటనే హానికరమైన కంటెంట్‌ను తక్షణమే తొలగించాలి. ఈ విషయంలో కొన్ని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది బెంగళూరుకు చెందిన ఒక బాధితురాలు.

‘డిజిటల్‌ స్పేస్‌లను సురక్షితంగా మార్చడానికి తగిన న్యాయ, విధాన సంస్కరణలు, బలమైన చట్టాలు అవసరం. వేగంగా న్యాయం జరగాలి. టెక్‌ కంపెనీలు తమ వేదికలపై జరిగే హానికి బాధ్యత తీసుకోవాలి’ అంటుంది విద్యావేత్త, రచయిత్రి అమంద. ‘ఆన్‌లైన్‌ కేసుల నుంచి తప్పించుకోవడానికి చట్టంలోని లొసుగులను వాడుకుంటున్నారు. అలాంటివి జరగకుండా చూడాలి’ అంటోంది ముంబైలోని ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న జీవని.

డిజిటల్‌ హింసపై వార్‌
జెండర్‌–ఆధారిత హింసకు వ్యతిరేకంగా యునైటెడ్‌ నేషన్స్‌ విమెన్‌ ఇండియా పదహారు రోజుల ప్రచారకార్యక్రమం నిర్వహిస్తోంది. నవంబర్‌ 25న మొదలైన ఈ ప్రచార కార్యక్రమాలు డిసెంబర్‌ 10 వరకు కొనసాగుతాయి. ఈ జెండర్‌బేస్డ్‌ వయోలెన్స్‌ వ్యతిరేక క్యాంపెయిన్‌లో యునెటైడ్‌ విమెన్‌ ఇండియాతో కలిసి పనిచేస్తోంది సినీ నటి, నిర్మాత సమంత.

‘మహిళలు, పిల్లలపై జరిగే హింసను అంతం చేయడాకి ఐక్యం అవ్వండి’ అనే నినాదంతో ఈ క్యాంపెయిన్‌ కొనసాగుతుంది. పెరుగుతున్న ఆన్‌లైన్‌  వేధింపుల గురించి సమంత అవగాహన పరుస్తుంది.  అప్రమత్తం చేస్తుంది.  డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌పై అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొంటున్న స్టాకింగ్, డాక్సింగ్‌. డీప్‌ఫేక్స్, ఇమేజ్‌ మాన్యుపులైజేషన్‌పై గట్టిగా గొంతు విప్పుతోంది. ‘హింస అనేది ఇప్పుడు శారీరక హింస మాత్రమే కాదు. అది స్క్రీన్‌ రూపంలో కూడా వెంటాడుతుంది. మన గొంతులను నొక్కి మౌనంగా చేస్తుంది.

 మహిళలే లక్ష్యంగా చేసుకునే జరిగే డిజిటల్‌ హింస వారి భద్రత, గుర్తింపు,ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది’ అంటుంది సమంత. సోషల్‌ మీడియాలో లక్షలాది ఫాలోవర్స్‌ ఉన్న సమంత డిజిటల్‌ హింసకు సంబంధించి తన వ్యక్తిగత చేదు అనుభవాలను పంచుకుంటుంది. క్యాంపెయిన్‌లో భాగంగా ‘వీడియో మెసేజ్‌’ను విడుదల చేసింది ‘యూఎన్‌ విమెన్‌ ఇండియాతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లకు జవాబుదారీతనం పెరగాలి. రక్షణ చట్టాలను బలోపేతం చేయాలి’ అంటుంది సమంత.

ఐశ్వర్య... హైకోర్టు వరకు
తన వ్యక్తిగత హక్కులను రక్షించుకోవడానికి కోర్టును ఆశ్రయించింది బాలీవుడ్‌ సెలబ్రిటీ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌. దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజñన్స్‌(ఏఐ), డీప్‌ఫేక్‌ టెక్నాలజీని  ఉపయోగించి తన చిత్రాలను మార్ఫింగ్‌ చేస్తున్నారని, అసభ్యకరమైన వీడియోలు సృష్టిస్తున్నారని తన పిటిషన్‌లో తెలియజేసింది ఐశ్వర్య. తన వ్యక్తిగత గోప్యతా హక్కును పరిరక్షించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ‘ఐశ్వర్య ఫొటోలు దురిన్వియోగం చేయడం అనేది ఆమె గౌరవ, ప్రతిష్ఠలను దెబ్బతియడమే’ అని పేరొన్న న్యాయస్థానం పిటిషన్‌లో ఐశ్వర్య పేర్కొన్న యూఆర్‌ఎల్‌లను బ్లాక్‌ చేయాలని గూగుల్‌తో సహా రకరకాల డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement