డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు కొత్త సర్వీసు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ తమ యూజర్ల భద్రతకు భరోసా ఇస్తూ, కొత్త సర్వీసు వివరాలు వెల్లడిస్తూ లేఖ రాశారు. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాల నుంచి తమ డబ్బుకు రక్షణ కల్పించేలా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ‘సేఫ్ సెకండ్ అకౌంట్’ అనే కొత్త సర్వీసు ప్రారంభించినట్లు ప్రకటించారు.
నకిలీ పార్శిల్ డెలివరీ కాల్స్, ఫిషింగ్ లింక్‌లు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు వంటి కొత్త తరహా మోసాలు పెరుగుతున్న తరుణంలో విట్టల్ ఈ లేఖ విడుదల చేయడం గమనార్హం. ‘ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అందిస్తున్న సేఫ్ సెకండ్ అకౌంట్ ద్వారా వినియోగదారుల డిజిటల్ చెల్లింపులకు మరింత భద్రత కల్పిస్తున్నాం. నేటి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో చాలా మంది యూపీఐ లేదా ఇతర చెల్లింపుల యాప్‌లకు తమ ప్రధాన సేవింగ్స్ ఖాతాతో అనుసంధానిస్తున్నారు. మోసగాళ్లకు పొరపాటున మీ అకౌంట్ వివరాలు అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉంది. ఎయిర్‌టెల్ సేఫ్ సెకండ్ అకౌంట్ మీ డబ్బు సురక్షితంగా ఉండటానికి సరళమైన, సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది’ అని గోపాల్ విట్టల్ అన్నారు.
ఈ ఖాతా ప్రత్యేకతలు..
ఈ ఖాతా ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల కోసం ఉద్దేశించారు. ఇందులో చాలా తక్కువ బ్యాలెన్స్ మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ కూడా లభిస్తుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రుణాలు అందించదు కాబట్టి, వినియోగదారులు ఇందులో పెద్ద మొత్తాలను ఉంచాల్సిన అవసరం లేదు. ఈ అకౌంట్‌ను ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఓపెన్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది?


