కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. సాధారణంగానే.. ఈ టైంలో ‘రెజల్యూషన్స్’ తెరపైకి రావాలి. కానీ, ఈసారి ఎందుకనో ఆ హడావిడి లేదు. ఇటు సోషల్ మీడియాలో ఆ పదం ఎక్కడో అరుదుగా కనిపిస్తోంది. ఎవరినైనా మైక్ పెట్టి కదిలిస్తే దాంతోనే కొట్టేలా కనిపిస్తున్నారు. అదే సమయంలో.. నెట్టింట వైరల్ అవుతున్న ఓ పాత వీడియో గురించి చర్చించుకుంటున్నారు.
న్యూఇయర్ అనగానే కొత్తగా ‘రెజల్యూషన్స్’ షురూ అవుతాయి. అప్పుడైతే ఉత్సాహం టన్నులకొద్దీ ఉంటుంది. మంచి అలవాట్లు మొదలుపెట్టి.. పాడు పద్ధతులను పాతరేయాలనుకుంటారు. నాలుగు రోజులు గడిచాయా.. ఉత్సాహం ఉసూరుమంటుంది. నెల తిరిగేసరికల్లా ‘ఇక మనవల్ల కాదులే’ అని చేతులెత్తేస్తారు.. మోటివేషన్ సూత్రాలు ఇక్కడ ఏమాత్రం పని చేయవు. ఒకప్పుడు.. కనిపించిన దృశ్యాలివి.
1997లో శేఖర్ సుమన్ లేట్‌నైట్ టాక్ షో Movers and Shakers కోసం ప్రజల వద్దకు వెళ్లి వారి న్యూఇయర్ రెజల్యూషన్స్ అడిగారు. వారు నిర్మోహమాటంగా చెప్పిన సమాధానాలు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. చాలామంది “స్ట్రిక్ డైట్ పాటిస్తాం” అన్నారు. ఒక యువతి “ఎక్కువ మంది బాయ్‌ఫ్రెండ్స్ సంపాదించుకుంటా” అని చెప్పగా, ఇంకో యువకుడు “నెలకో గర్ల్‌ఫ్రెండ్ మార్చేస్తా” అంటూ సరదాగా స్పందించాడు.
“ఈ ఏడాదిలో అయినా జీన్స్, టీషర్ట్స్ కొనుక్కుంటా” అని ఓ యువకుడు, “ఈ ఏడాదిలోనైనా బడికి బండెడు పుస్తకాలు మోయకూడదనుకుంటున్నా” అంటూ ఓ పిలగాడు ఇచ్చిన సమాధానాలు చిరునవ్వు తెప్పించాయి. ఎలాగైనా ఖర్చులు తగ్గించుకుంటాం అంటూ చెప్పిన సమాధానాలు ఇప్పుడు చాలామందికి కనెక్ట్ అవుతున్నాయి. నిజాయితీతో కూడిన ఆ సమాధానాలు నేటి నెటిజన్లను కూడా ఆకట్టుకుంటున్నాయి.
మరి ఇప్పుడో.. గత కొన్నేళ్లుగా కొత్త ఏడాది తీర్మానాలు (Ne Year Resolutions) విషయంలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. డిజిటల్ ఎరాలో డైరీల్లో రాసుకోవడం, బొమ్మలు గీసుకుని గోడలకు తగిలించుకోవడం నామోషీ అయిపోయింది. మొదలు పెట్టిన జోష్‌ను పాత అలవాట్లు మింగేయడం.. బిజీ లైఫ్‌స్టైల్‌తో కొన్ని వారాలకే మరిచిపోవడం.. సాధ్యం కాని పెద్ద ప్లాన్‌లు పెట్టుకోవడం వాటిని మధ్యలోనే వదిలేసేలా చేస్తున్నాయి. ఆఖరికి.. ఆరోగ్యంగా ఉండాలి అనే ఆర్డినరీ రెజల్యూషన్‌ను కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు మీ న్యూఇయర్ రెజల్యూషన్స్ ఏది? అని అడిగితే.. ఛా అవతలికి పో అనే సమాధానం ఎక్కువగా వినిపించదంటారా?
ఆరోజుల్లో.. సాధారణంగా వినిపించిన రెజల్యూషన్స్
- బరువు తగ్గాలి
- జిమ్‌కి క్రమం తప్పకుండా వెళ్లాలి
- డైట్ పాటించాలి (స్ట్రిక్ డైట్ చాలా పాపులర్)
- పొగ తాగడం మానేయాలి
- చదువు & కెరీర్
- పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలి
- కొత్త స్కిల్ నేర్చుకోవాలి
- ఉద్యోగంలో కష్టపడి ప్రమోషన్ పొందాలి
- మంచి స్నేహితులు సంపాదించుకోవాలి
- సరైన బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్ సంపాదించుకోవాలి
- కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి
- ఖర్చు తగ్గించుకోవాలి
- పొదుపు చేయాలి
- అప్పులు తీర్చేయాలి
- మద్యం తగ్గించుకోవాలి
- కొత్త పుస్తకాలు చదవాలి
- కొత్త ప్రదేశాలు చూడాలి
- కొత్త హాబీ మొదలుపెట్టాలి (ఫోటోగ్రఫీ, మ్యూజిక్ వంటివి)
ఆరోజుల్లో.. రెజల్యూషన్స్ ఎక్కువగా వ్యక్తిగత ఆరోగ్యం, చదువు, సంబంధాలు, డబ్బు చుట్టూ తిరిగేవి. అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం వల్ల ప్రజలు తమ రెజల్యూషన్స్‌ను నేరుగా చెప్పేవారు, టీవీ షోలు, పత్రికలు, డైరీల్లో రాసుకునేవారు. సోషల్ మీడియా వాడకం పెరిగాక.. పోస్టులు కూడా చేసి చాటి చెప్పుకునేవారు. మరి ఇప్పుడో.. ఈ డిజిటల్ యుగంలో ప్రైవేట్‌గా ఉంచుకోవడమో లేదంటే అసలు పెట్టుకోవడమే బెస్ట్‌గా ఫీలవుతున్నారు.


