ఐపీఓలంటే అద్భుతాలు కావు! | Wealth Creation Plan for 2026, sakshi special story | Sakshi
Sakshi News home page

ఐపీఓలంటే అద్భుతాలు కావు!

Jan 12 2026 5:24 AM | Updated on Jan 12 2026 5:24 AM

Wealth Creation Plan for 2026, sakshi special story

2025లో ఏకంగా 373 కంపెనీల లిస్టింగ్‌

తొలిరోజు 40–50 శాతం లాభాలతో కొన్ని అదుర్స్‌

కొన్నిటికి లిస్టింగ్‌నాడే నష్టాలు... సగటు లాభం 8 శాతమే

ఈ ఏడాది 200కు పైగా కంపెనీలు ఐపీఓకు సంసిద్ధం

లిస్టింగ్‌ లాభాలకోసం కాక వ్యాపారం చూశాకే దరఖాస్తు

వ్యాపారం బాగుంటే దీర్ఘకాలంలోనూ మంచి రిటర్నులు

స్టాక్‌ మార్కెట్లలోని కంపెనీలన్నీ ఎప్పుడో ఒకప్పుడు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చినవే. కాకపోతే వాటిలో అగ్రశ్రేణి కంపెనీలుగా (లార్జ్‌క్యాప్‌) మారినవి కొన్నే. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. ఐపీఓల్లో ఇన్వెస్ట్‌ చేయాలో.. వద్దో తెలిసిపోతుంది. ఎందుకంటే ఐపీఓలంటే అద్భుతాలు కావు. 

ఆటోమేటిగ్గా సంపదను సృష్టించే సాధనాలూ కావు. అవి అవకాశాలతో పాటే రిస్కులనూ మన ముందుంచుతాయి. అలాగని ఐపీఓలకు దూరంగా ఉండమని కాదు. ఐపీఓ అంటే... మార్కెట్లు పంపే ఆహ్వాన పత్రికలు. దేన్ని స్వీకరించాలో... దేన్ని తిరస్కరించాలో మనమే నిర్ణయించుకోవాలి. అది ఎలాగో.. 2025లో ఐపీఓకు వచి్చన కంపెనీల పరిస్థితేంటో... 2026లో ఎలా వ్యవహరించాలో సమగ్రంగా వివరించేదే ఈ ‘వెల్త్‌’ స్టోరీ...

ప్రస్తుతం ప్రైమరీ (ఐపీఓ) మార్కెట్‌ మంచి దూకుడు మీదుంది. దాదాపు 200కు పైగా కంపెనీలు లిస్టింగ్‌లకు సన్నద్ధమవుతున్నాయి. వీటిలో ఫిన్‌టెక్‌ యూనికార్న్‌లు, గ్రీన్‌ ఎనర్జీ వెంచర్ల నుంచి కన్జూమర్‌ బ్రాండ్లు, ఇన్‌ఫ్రా రంగ దిగ్గజాల వరకు చాలా ఉన్నాయి. జీడీపీ ఏడు శాతానికి పైగా కొనసాగుతుందనే సానుకూల అంచనాలు, డీమ్యాట్‌ ఖాతాలు 15 కోట్ల స్థాయిని దాటిపోవడం, ప్రతి నెలా సిప్‌ల ద్వారా రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు మార్కెట్లలోకి వస్తుండటం వంటి పరిణామాలు కంపెనీలకు మంచి ఊపునిస్తున్నాయి.

ఐపీవోలు ఎందుకు..
కంపెనీలు వివిధ కారణాలరీత్యా పబ్లిక్‌ ఇష్యూల ద్వారా నిధులను సమీకరిస్తుంటాయి. అవేంటంటే.. 
→ కార్యకలాపాలను విస్తరించడానికి, కొత్త టెక్నాలజీల ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవటానికి 
→ రుణాలుంటే తీర్చెయ్యడానికి... 
→ ప్రారంభ దశలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు, అలాగే ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించుకోవటానికి 
→ బ్రాండ్‌ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకునేందుకు 

ఇలాంటి అవసరాలకు సంబంధించి ఐపీవోలనేవి కంపెనీకి సహాయకరంగానే ఉంటాయి. అయితే, షేరు ధర అదే పనిగా పెరుగుతూనే ఉంటుందనే గ్యారంటీ ఏమీ ఉండదు. మార్కెట్లు ర్యాలీ చేస్తున్నప్పుడు కొన్ని కంపెనీలు లిస్టింగ్‌లో మంచి లాభాలే ఇవ్వొచ్చు. మరికొన్ని కంపెనీలు లిస్టింగ్‌ వేళ నిరాశపర్చినా, ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ పుంజుకుని మెరుగైన రాబడులు అందించే అవకాశం ఉంది. అదే సమయంలో చాలా మటుకు కంపెనీలు తీవ్రమైన పోటీ ఎదుర్కొనలేక చతికిలబడి, షేర్లు కనుమరుగైపోతుంటాయి కూడా.

రిటైల్‌ ఇన్వెస్టర్ల తప్పులివీ...
ఆ ఐపీవో బాగా లిస్టయ్యింది.. ఈ ఇష్యూ బాగా లాభాలు తెచ్చిందనే అత్యుత్సాహంతో చాలా మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు తప్పులో కాలేస్తుంటారు. చేతులు కాల్చుకుంటూ ఉంటారు. కొందరు గ్రే మార్కెట్లను ఫాలో అవుతూ అక్కడ ప్రీమియం రేటు పలికే వాటి వెంటబడుతుంటారు. ఇంకొందరు భారీగా ఓవర్‌సబ్‌్రస్కయిబ్‌ అయ్యింది కదా కచి్చతంగా లాభాలొచ్చేస్తాయనుకుని ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. మరికొందరు లిస్టింగ్‌ రోజున భలే ఎగ్జైటింగ్‌గా ఉంటుందని పెట్టుబడులు పెడుతుంటారు. కానీ, ఈ అత్యుత్సాహంలో కొన్ని విషయాలు విస్మరిస్తుంటారు. వ్యాపారం మోడల్‌ నిజంగా బలమైనదేనా? దీర్ఘకాలికంగా నిలబడేదేనా? ప్రమోటర్ల ట్రాక్‌ రికార్డు బాగుందా లేదా? ఐపీవో ద్వారా తీసుకున్న డబ్బును కంపెనీ ఏ అవసరాల కోసం వాడుకుంటోంది? ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు.  

2025లో ఏం జరిగిందంటే... 
గతేడాది ఐపీవోలు తీపి, చేదు జ్ఞాపకాలు రెండింటినీ ఇచ్చాయి. దాదాపు 373 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1.95 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో 103 మెయిన్‌ బోర్డ్‌ ఇష్యూ లు కాగా 270 కంపెనీలు ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై లిస్టయ్యాయి. టాటా క్యాపిటల్‌ (రూ.15,512 కోట్లు), హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ (రూ.12,500 కోట్లు) వంటి దిగ్గజాలు భారీగా నిధులు సమీకరించాయి. కొత్త తరం సంస్థలు మీషో రూ. 5,421 కోట్లు సమీకరించగా, గ్రో క్యాపిటల్‌ రూ.6,632 కోట్లు రాబట్టుకుంది. వీటిలో లిస్టింగ్‌ నాడు ఏకంగా 136 శాతం లాభాన్నిచి్చన స్టాలియన్‌ ఇండియా ఫ్లోరోకెమికల్స్‌ లాంటి కంపెనీలతో పాటు తొలిరోజే 56 శాతం నష్టాన్నిచ్చిన గ్లోటిస్‌ లిమిటెడ్‌ వంటి కంపెనీలూ ఉన్నాయి. 

ఇక పెద్ద పెద్ద ఇష్యూల్లో మీషోనే తీసుకుంటే ఇష్యూ ధర రూ.111 అయితే దాదాపు 46 శాతం అధికంగా రూ.162.50 వద్ద లిస్టయ్యింది. అలాగని అన్నీ ఇదే రీతిలో లిస్టింగ్‌ లాభాలిచ్చాయనుకోవడానికి లేదు. గతేడాది సగటున లిస్టింగ్‌ లాభాలు చూస్తే 8 శాతం స్థాయికే (అంతకు ముందటి సంవత్సరాలకన్నా తక్కువగా) పరిమితమయ్యాయి. వీటిలో దాదాపు సగ భాగం లిస్టింగ్‌లో ఏడాది చివరి నాటికి లాభాల్లోనే ఉండగా, మిగతావి ఇష్యు రేటు కన్నా కిందికి పడిపోయాయి. ఇక ఎస్‌ఎంఈ ఐపీవోలైతే మరీ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. కొన్ని మలీ్టబ్యాగర్లుగా మారినప్పటికీ మిగతావి భారీగా పడిపోయాయి. హైప్‌ అనేది ఎల్లకాలం ఉండదని, వాస్తవంగా వ్యాపారానికి ఉండే బలమే కీలకమనే పాఠాన్ని 2025 మరోసారి నేరి్పంది.

2026 ప్రత్యేకత ఏంటి.. 
ఈసారి 200 పైగా కంపెనీలు ఐపీవోలకు సిద్ధమవుతున్నాయి. ఇవి రూ. 2.5 లక్షల కోట్లకు మించి సమీకరించవచ్చనే అంచనాలున్నాయి. వీటిలో పలు కంపెనీలు భారీ వేల్యుయేషన్లతో రాబోతున్నాయి. ఉదాహరణకు రూ. 11– 12 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో రిలయన్స్‌ జియో ఐపీవో దేశంలోనే అతి పెద్ద ఇష్యూగా ఉంటుందనేది నిపుణుల అంచనా. ఇది 2026 ప్రథమార్ధంలోనే రావచ్చు. అలాగే ఎన్‌ఎస్‌ఈ, ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్, ఓయో, జెప్టో, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌... ఇలా బోలెడు పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఈ ఇష్యూల ద్వారా పలు కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు తమ వాటాలను విక్రయించుకుని ని్రష్కమించనున్నాయి. డీమ్యాట్‌ ఖాతాలు పెరుగుతుండటం, సిప్‌ పెట్టుబడుల వెల్లువతో వీటికి రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి భారీగానే డిమాండ్‌ ఉంటుందనే అంచనాలున్నాయి. వెరసి ఈసారి కూడా స్టాక్‌ మార్కెట్లు సందడిగానే ఉండనున్నాయి.

ఏం చేయాలంటే... 
ఇదంతా చూసిన తర్వాత ఇంతకీ ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేయాలా వద్దా అంటే... ఇవి మీ పోర్ట్‌ఫోలియోలో స్మార్ట్‌ భాగంగా ఉండొచ్చు. సముచిత రేటులో లభిస్తున్న బలమైన కంపెనీల ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేయండి. కానీ పెట్టుబడులకు సంబంధించి అదొక్కటే వ్యూహంగా మాత్రం పెట్టుకోవద్దు.  
→ మంచి అవకాశాల కోసం కాస్త వేచి చూడండి. ఇలాంటివి ఏడాదిలో 4– 6 వరకు వస్తుంటాయి. 
→ బాగుందనిపించగానే ఇన్వెస్ట్‌ చేసేయొద్దు. వ్యాపార ప్రాథమిక విషయాలను తెలుసుకునేందుకు ప్రాస్పెక్టస్‌ని కూడా కాస్త తిరగేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. 
→ పబ్లిక్‌ ఇష్యూల్లో పెట్టుబడులను మీ దీర్ఘకాలిక మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా బ్లూ–చిప్‌ స్టాక్స్‌కి అనుబంధంగానే ఉంచుకోవడం మంచిది.  
చివరిగా చెప్పేదేమిటంటే పబ్లిక్‌ ఇష్యూలంటే లాటరీలు కావు! యుఫోరియాకి లోను కాకుండా జాగ్రత్త వహించాలి. లిస్టింగ్‌కి వచ్చిన కంపెనీ ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉంటే కేవలం లిస్టింగ్‌ రోజునే కాదు దీర్ఘకాలికంగా కూడా మంచి రాబడులను అందుకోవచ్చని గుర్తుంచుకోవాలి.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement