ఓటింగ్‌కు చివరి తేదీ నేడే.
డిసెంబరు ఒకటిన వర్డ్ ఆఫ్ ఇయర్ వెల్లడి
షార్ట్ లిస్ట్ రూ΄÷ందించిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్
ప్రపంచమంతటా పెద్దఎత్తున విస్తరిస్తున్న డిజిటల్ సంస్కృతి కొత్తపదాల పుట్టుకపైనా, వాటి వాడుకపైనా ఎలాంటి ప్రభావం చూపుతోందో చూడండంటూ వాటికేసి చూపుతున్నారు భాషావేత్తలు, భాషానిపుణులు!
ఈ ఏడాది ముగింపునకు వస్తుండగా... ఎప్పటిలాగే కొత్తగా వాడుకలోకి వస్తున్న పదాల తాలూకు లఘుపట్టికను రూపొందించింది ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. అలాగే ఏడాది ‘వర్డ్ ఆఫ్ ద ఇయర్’ను ఎంపిక చేయాలంటూ ఓటింగ్‌నూ నిర్వహిస్తోంది. ఈ నెల (నవంబరు) 27 నాటితో ముగిసే ఈ ఓటింగులో ఈ ఏడాదిలో కీలకంగా, అందరినీ ఆకర్షిస్తూ నిలిచిన పదాన్ని ఎంపిక చేయాలంటూ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ పిలుపునిచ్చింది.
ఇవీ ఈ ఏడాదిలో కొత్తగా ఎంపికైన పదాలు
ఈ ఏడాది షార్ట్ లిస్ట్ చేశాక నిలిచిన కొత్త ఇంగ్లిష్ పదాలేమిటంటే... మొదటిది ‘ఆరా ఫార్మింగ్’, రెండోది ‘బయో హ్యాక్’ మూడోది ‘రేజ్ బెయిట్’. ఇటీవలి డిజిటల్ సంస్కృతి పదాలపై చూపుతున్న ప్రభావానికి ఈ మూడు పదాలూ ఒక ఉదాహరణ అంటున్నారు భాషానిపుణులు. అదెందుకో వీటి అర్థాలు చూస్తే తెలుస్తుందంటూ వారు చెబుతున్నారు.
ఈ మూడు పదాల్లో వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ఏది ఎంపిక అవుతున్నదీ డిసెంబరు మొదటి తేదీన తేలుతుంది. అన్నట్లు గత ఏడాది వర్డ్ ఆఫ్ ఇయర్ ఏమిటో తెలుసా? ‘బ్రెయిన్ రాట్’. దీని అర్థం ఏమిటంటే... డిజిటల్ ప్రపంచంలో అవాంఛితమైన పనులన్నీ చేస్తూ తమ మేధస్సునూ, ఆలోచనా శక్తినీ, వృథా చేసుకోవడమే ఈ బ్రెయిన్ రాట్‌కు అర్థం. అంటే అక్కరలేని రీల్స్ అన్నీ చూస్తూ సమయం, వివేచన, విచక్షణ వీటన్నింటినీ వృథాచేసుకోడాన్ని ‘బ్రెయిన్ రాట్’గా చెప్పవచ్చు.
వర్డ్ ఆఫ్ ద ఇయర్–2025 కోసం కొన్ని పదాల ఎంపిక
ఆరా ఫార్మింగ్ అంటే: సోషల్ మీడియా ప్రపంచంలో తానో స్టైలిష్ వ్యక్తిగా, అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్నవాడిగా (కరిస్మాటిక్‌గా), ఓ ప్రభావపూర్వకమైన వ్యక్తిగా, అలాగే ఓ కూల్ పర్సన్‌గా కనిపించేలా తనను తాను ఆవిష్కరించుకోడాన్ని ‘ఆరా ఫార్మింగ్’ అంటారు. ఇలా తనను తాను ఓ అద్భుతమైన ఆకర్షణీయమైన వ్యక్తిగా ప్రాజెక్టు చేసుకునే వ్యక్తి చేసే ప్రయత్నమే ‘ఆరా ఫార్మింగ్’ అన్నమాట. ఇక ఈ పదబంధంలోని పదాల లిటరల్ మీనింగ్ అందరికీ తెలిసిందే. ‘ఆరా’ అంటే ఓ గొప్ప వ్యక్తి చుట్టూ ఆవరించి ఉండే ప్రకాశం. ‘ఫార్మింగ్’ అంటే పండించడం, దిగుబడి సాధించడం అని అర్థాలు. అంటే ఈ డిజిటల్ ప్రపంచంలో ఓ గొప్ప ప్రకాశవంతమైన ఇమేజ్‌లాంటిది సాధించుకునేందుకు చేసే ప్రయత్నం అని చెప్పుకోవచ్చు.
బయో హ్యాక్ : హ్యాకింగ్ అంటే అందరికీ తెలిసిందే. ఒకరి వ్యక్తిగత అంశాలను తస్కరించడం. మార్పులు చేయడం వంటివి. అయితే దీని అర్థం విచిత్రంగా ఉంది. యోగా వ్యాయామం, జీవనశైలిలో మార్పుల ద్వారా దేహం బరువును అదుపులో పెట్టుకోవడం, తమ సొంత జీవక్రియల్లో ఆరోగ్యవంతమైన మార్పులు తెచ్చుకోడానికి డిజిటల్ ప్రపంచానికి చెందిన ‘హ్యాకింగ్’ అనే పదాన్ని ‘బయో’కు ముందు చేర్చి పుట్టించిన పదం ఇది.
రేజ్ బెయిట్: రేజ్ అంటే కోపం లేదా ఆగ్రహం. బెయిట్ అంటే ఎర. ‘ఆన్‌లైన్’లో ఎవరినైనా రెచ్చగొడుతూ, వాళ్లు రెచ్చిపోయి ఆగ్రహంతో చిందులు తొక్కేలా చేసేలా చేయడాన్ని ‘రేజ్ బెయిట్’ అంటారు. అంటే... ఎదుటివారిని గిల్లడం (టీజింగ్), కవ్వించడం లేదా అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తూ... ఈ ఎర సహాయంతో... ఎదుటివారు రెచ్చిపోయి కోపంతో ఆగ్రహోదగ్రులయ్యేలా చేసే ప్రక్రియే ‘రేజ్ బెయిట్’.
’


