సమ్‌థింగ్ స్పెషల్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక పెళ్లి ఊరేగింపు ‘ఆహా’ ‘వోహో’ అనిపించింది. శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. ఈ పెళ్లి ఊరేగింపు ప్రత్యేకత ఏమిటంటే... రివర్స్ ఊరేగింపు!
సంప్రదాయం ప్రకారమైతే వరుడు ఊరేగింపుగా వధువు ఇంటికి వెళతాడు. కాని ఈ పెళ్లిలో మాత్రం వధువు అత్తమామల ఇంటికి ఊరేగింపుగా వెళ్లింది. ఈ రివర్స్ పెళ్లి ఊరేగింపును చూడడానికి ప్రజలు తరలి వచ్చారు.
వధువే వరుడి ఇంటికి ఊరేగింపుగా వెళ్లాలనేది వధువు తండ్రి రాజేష్ జైస్వాల్ కోరిక. అతడికి అయిదుగు అమ్మాయిలు. కొడుకు లాగే కుమార్తె వివాహా ఊరేగింపును జరుపుకోవాలనే అతడి సుదీర్ఘకాల కల ఫలించింది.
ఈ రివర్స్ పెళ్లి ఊరేగింపును హైలెట్ చేస్తూ ‘లడ్కీకి బరాత్’ పేరుతో పెళ్లి పత్రికలు పంచాడు. అప్పటి నుంచే అందరిలో ఆసక్తి మొదలైంది. ఇదిసరేగానీ ఇంతకీ వరుడికి, అతడి తల్లిదండ్రులకీ, బంధువుకు ఈ రివర్స్ బరాత్ కాన్సెప్ట్ నచ్చిందా?
‘బ్రహ్మాండంగా’ అంటున్నాడు రాజేష్ జైస్వాల్.
వరుడి బంధువులు అత్యంత ఉత్సాహంగా పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నారు. రెండు కిలోమీటర్‌ల పాటు సాగిన ఈ ఊరేగింపులో వధువు పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
‘నేను ఈ ఇన్‌స్టాగ్రామ్ వీడియోను సేవ్ చేసుకున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. భవిష్యత్‌లో నా బిడ్డల పెళ్లి విషయంలో ఇదే కాన్సెప్ట్ అనుసరిస్తాను’ అన్నాడు ఒక తండ్రి.
మంచిదే కదా!


