ఆర్నెల్ల సావాసంలో వారు వీరవుతారని అంటారు. బిర్యానీ రుచిమరిగాక ముక్క లేకపోతె ముద్ద దిగనివాళ్లుంటారు. రోజూ పెగ్గు లేకుంటే నిద్రపట్టని బాబులు ఎందరో! చాకోలెట్లకు అలవాటు పడి .. అది ఇస్తే తప్ప బడికి వెళ్ళను అని మొరాయించిన స్కూలు పిల్లలు కోకొల్లలు.. చెరువుగట్టున కుప్పలుగా దొరికే చేపలకు అలవాటు పడి ఇంకోచోటుకు కదలని కొంగలు కూడా కుప్పలు తెప్పలు.. ఇదంతా ఒకెత్తు.
అడవిలో ఠీవీగా నడుస్తూ అమాయకంగా కదిలే జింకలు, లేడి పిల్లలను ఒక్క జంపింగుతో పట్టుకుని తుప్పల్లోకి ఈడ్చుకెళ్లే చిరుతలు ఇప్పుడు బద్ధకిష్టులుగా మారిపోయాయి. ఒళ్ళు విరుచుకుని ‘‘అబ్బా మటన్ వద్దమ్మా.. నాకు నచ్చడం లేదు’’ అని వెక్కి రిస్తున్నాయి. చెరుకు పొలాలే చిరుతల కొత్త అడవులుగా మారాయి. మాంసం వద్దు.. తియ్యని చెరుకు గడలు ముద్దు అంటూ చేరుకుతోటల్లో అల్లరి చేస్తున్నాయి.
ఎలా వచ్చాయో.. ఎక్కణ్ణుంచి వచ్చాయో కానీ అడవుల్లోంచి దారితప్పిన కొన్ని చిరుతలు(డజనుకు పైనే ఉన్నాయి) పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఊళ్లలోకి వచ్చేసాయి. అక్కడి చెరకు తోటల్లో తిష్టవేసి మెల్లగా చెరకు తీపి రుచిమరిగాయి. రోజూ చెరుకుగడలు తింటూ అదే తోటల్లో నివాసం ఉంటూ. ఇక అడవుల్లోకి పోవడం ఎందుకు.. ఇక్కడే ఉందాం.. చెరుకు తిందాం అనే స్థితికి వచ్చేశాయి.
కొన్నాళ్లుగా వేటను సైతం మర్చిపోయిన ఈ చిరుతలు ఇంకా చెంతకు తోటల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో వీటిని మళ్ళీ అడవుల్లోకి పంపడానికి ఫారెస్ట్ అధికారులు తిప్పలు పడుతూ.. ఏదోలా పట్టుకుని ఇక ఇవి అడవికి పనికిరావని నిర్ధారించుకుని జూ పార్కులకు తరలిస్తున్నారు.
చెరుకు పొలాలే చిరుతల కొత్త అడవులు
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, బీజ్నోర్ నుంచి హరిద్వార్ వరకూ ఉన్న చెరుకు పొలాలు చిరుతల శాశ్వత ఆశ్రయాలుగా మారిపోయాయి. గత నాలుగేళ్లలో బీజ్నోర్‌లో పట్టుబడ్డ వాటిల్లో 40 చిరుతలను తిరిగి అడవుల్లోకి పంపలేక అక్కడే వదిలేశారు. ఉత్తరాఖండ్‌లో 2021 తర్వాత 96 చిరుతలను రక్షించారు. వాస్తవానికి ఈ చిరుతలు ఫారెస్ట్ అధికారులు ఏదోలా పట్టుకుని రికార్డు ఉంది. రాజాజీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో విడిచినా, రేడియో కాలర్లు పెట్టిన చిరుతలు మళ్లీ 30 కిలోమీటర్ల ప్రయాణం చేసి అదే చెరుకు పొలాలకు తిరిగి చేరుతున్నాయి.
ఒకప్పుడు అడవుల్లో.. చిత్తడి నేలల్లో కనిపించే చిరుతల పాదముద్రలు ఇప్పుడు పొలాల్లో కనిపిస్తున్నాయి. ఏళ్ళ తరబడి చెరకు తినడం.. వేటను మర్చిపోవడంతో ఇప్పుడు చిరుతలు ఒబేసిటీతో ఉన్నాయని అధికారులు అంటున్నారు. చిరుతల నడుము వెడల్పైపోవడం, వేట చేయకపోవడంతో గోళ్లు పదును కోల్పోవడం, వాటిలో వేట స్వభావం మందగించడాం వంటివి అధికారులు గుర్తించారు.
చిరుతలు తరుముతున్న పులులు
వాస్తవానికి పులి తానూ తిరుగాడే అటవీ ప్రాంతంలో వేరే క్రూరజీవిని ఉండనివ్వదు. ఇక రాజాజీ, అమంగఢ్ వంటి రిజర్వుల్లో పెరుగుతున్న పులుల జనాభా చిరుతలను అడవుల నుంచి బయటకు గెంటేస్తోంది. అమంగఢ్‌లో పులుల సంఖ్య పదేళ్లలోనే 12 నుంచి 34కి పెరిగింది. ఈ పెరుగుదల చిరుతలు అక్కణ్ణుంచి వేరేచోటకు వెళ్లిపోవడానికి కారణమైంది.
చెరుకుతోటలు ఎందుకు మేలంటే?
చిరుతలు తిరుగుతున్నా శబ్దం బయటకు వినిపించదు. అదక్కడ ఉన్నట్లు ఎవరికీ కనిపించదు. జనావాసాలకు దూరంగా పొలాల్లో సురక్షితమైన ఆవాసం దొరికినట్లు చిరుతలు భావించడం.. నిత్యం తినడానికి తియ్యని చెరకు గడలు లభిస్తుండడం వలన చిరుతలు వాటికి అలవాటుపడిపోయి ఇక అక్కణ్ణుంచి కదలడం లేదు.
ఇక 2023 జనవరి నుంచి ఇప్పటివరకు, బీజ్నోర్ జిల్లాలో మాత్రమే 35 మంది చిరుత దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. చాలావరకు ఘటనలు ఊళ్లలో.. చెరకు పొలాల్లో ఈ చిరుత దాడులు జరిగాయి. దీంతో ఈ ప్రాంతంలో దాదాపు 80 గ్రామాలను “అత్యంత ప్రమాదకర ప్రాంతాలు”గా గుర్తించారు. అంతేకాకుండా నిత్యం చెరకు తినడం.. అక్కడే నివాసం ఉండడంతో వాటి బరువు కూడా దాదాపు 85 కిలోలకు చేరుకుందని మాజీ బీజ్నోర్ DFO సలీల్ శుక్లా అన్నారు. .. వాటిని అడవుల్లో వదిలేస్తున్నా.. మళ్ళీ వచ్చేస్తున్నాయని అయన అన్నారు..
:::సిమ్మాదిరప్పన్న


