ఈ చిత్రంలో కనిపిస్తున్న చిరుత దేశంలోనే అత్యంత అరుదైన రకానికి చెందినది. సాధారణ చిరుతలు ముదురు నల్లరంగు మచ్చలతో కనిపిస్తే ఈ చిరుత మాత్రం లేత గోధుమ వర్ణం శరీరంతో లేత గులాబీ మచ్చలతో దర్శనమిచ్చింది. కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో తిరుగుతూ ఇలా ట్రాప్ కెమెరాకు చిక్కింది.
హోలేమట్టి నేచర్ ఫౌండేషన్‌కు చెందిన వన్యప్రాణి శాస్త్రవేత్త సంజయ్ గుబ్బి, ఆయన బృందం ట్రాప్ కెమెరాల చిత్రాల ఆధారంగా దీన్ని అరుదైన చిరుతపులిగా తేల్చింది. ఇది ఆడ చిరుత అని.. దీని వయసు సుమారు ఆరేళ్లు ఉండొచ్చని అంచనా వేసింది. రాజస్తాన్‌లోని రణక్‌పూర్ ప్రాంతంలో 2021లో ఇలాంటి చిరుత కనిపించగా కర్ణాటకలో ఈ తరహా చిరుత కనిపించడం ఇదే తొలిసారని పేర్కొంది. ఎరిథ్రిజం లేదా హైపోమెలనిజం అనే జన్యుపరమైన మార్పుల వల్ల చిరుత శరీర రంగు ఇలా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దక్షిణాఫ్రికా, టాంజానియా తదితర ఆఫ్రికా దేశాల్లో అక్కడక్కడా అరుదుగా కనిపించే ఈ రంగు చిరుతలను స్థానికంగా ‘స్ట్రాబెర్రీ చిరుత’అని పిలుస్తున్నారు. అయితే సంజయ్ గుబ్బి బృందం మాత్రం దీనికి ‘శాండల్‌వుడ్ చిరుత’ అనే పేరును ప్రతిపాదించింది. కర్ణాటక గంధపు చెక్కలకు ప్రసిద్ధి చెందినందున ఈ పేరు ఆ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, ఇది ప్రాంతీయ పరిరక్షణ ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుందని ఈ పేరు పెట్టింది.


