ఒక మంచు చిరుత (Panthera uncia) చేసిన అరుదైన వేట దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కిబ్బర్ గ్రామంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన ఈ ఘటనను వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆండ్రెస్ నోవాలెస్ తన కెమెరాలో బంధించారు. భారీ హిమపాతం తర్వాత ఆకాశం నిర్మలంగా మారిన సమయంలో కిబ్బర్ లోయ మంచుతో కప్పబడి ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.
ఓ మంచు చిరుత తన రెండు పిల్లలను లోయ కింద వదిలిపెట్టి.. ఒంటరిగా కొండ పైకి వెళ్లి అక్కడ మేత మేస్తున్న ఐబెక్స్(అడవి మేక జాతి) మందపై దాడి చేసింది. ఒక పెద్ద ఐబెక్స్‌ను లక్ష్యంగా చేసుకుని దానిపైకి దూకింది. ఐబెక్స్ తనను తాను రక్షించుకోవడానికి అత్యంత వేగంగా పరుగెత్తింది. ఈ క్రమంలో రెండు జంతువుల మధ్య పెనుగులాట జరిగింది. ఒక దశలో రెండు జంతువులు లోయ అంచున మృత్యువుకు అతి సమీపంలోకి వెళ్లాయి. అయితే, సరిగ్గా ఆ సమయంలో చిరుత పట్టు సడలడంతో.. ఐబెక్స్ చాకచక్యంగా దిశ మార్చుకుని అక్కడి నుండి తప్పించుకుంది.
ఆండ్రెస్ నోవాలెస్ ఈ అనుభవాన్ని పంచుకుంటూ.. తన జీవితంలోనే అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. హిమాలయాల్లో మనుగడ సాగించడం ఎంత కఠినమో, ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిరూపిస్తుందని పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పటికే ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఇది అద్భుతం.. ప్రకృతి అసలైన రూపం ఇది" అంటూ నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


