మహాభారతంలో ధర్మరాజుతో కడదాకా నడుస్తుంది ఓ శునకం. ఆ మధ్య వచ్చిన పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్‌లో హతోడి త్యాగి అనే సుపారీ కిల్లర్ పాత్రకు వీధికుక్కలతో ముడిపెట్టిన సీక్వెన్స్ ప్రేక్షకుల్ని ఒకింత భావోద్వేగానికి గురి చేసింది. అయితే విశ్వాసం, కరుణ మాత్రమే కాదు.. శాంతి కోసమూ నాలుగు కాళ్ల అలోకా అలుపెరగని ప్రయాణంతో అందరి దృష్టికి ఆకర్షిస్తోంది.
ఇంటర్నెట్‌లో రీల్స్ చూసేవాళ్లకు అలోక అనే పేరు తెలియక పోవచ్చు. కానీ స్క్రోలింగ్ చేసే సమయంలో ఎక్కడో ఒక దగ్గర కచ్చితంగా తారసపడుతుంది. అమెరికాలో పర్యటిస్తున్న బౌద్ధభిక్షువులతో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోందీ అలోక. దీనికి దక్కిన ఫేమ్‌తో ఏకంగా ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌నే ఓపెన్ చేశారు. ఒకటి రెండు బిస్కెట్లు వేస్తేనే కృతజ్ఞతలు చూపించే కుక్క మాదిరే.. తనను కాపాడిన వాళ్లను వీడేదే లేదంటూ వెంట తిరుగుతోంది.
స్వర్గాన్ని కాదని..
మహాప్రస్థాన ఘట్టంలో ధర్మారాజు భార్యాసహోదరులు స్వర్గానికి వెళ్తారు. అయితే తనతో వచ్చిన కుక్కను విడిచిపెట్టడానికి నిరాకరించడం వల్ల స్వర్గానికి వెళ్ళలేక కొద్దిసేపు నరకంలో గడపాల్సి వస్తుంది. తనతో పాటు ఉన్న జీవిని విడిచిపెట్టలేనని చెబుతాడాయన. అయితే.. ఆ కుక్క రూపంలో ఉన్నది ధర్మదేవతే అని తెలుసుకున్నాక చివరికి స్వర్గానికి చేరుకున్నాడు. ఈ కథ.. ధర్మరాజు యొక్క నిస్వార్థత, సత్యనిష్ఠ, విశ్వాసపాత్రత, అన్ని జీవుల పట్ల కరుణను తెలియజేస్తుంది.
పాతాళ్ లోక్‌లో..
2020 కరోనా టైంలో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన వెబ్ సిరీస్ పాతాళ్ లోక్. అందులో హతోడి త్యాగి అనే సుపారీ కిల్లర్ పాత్ర ఉంటుంది. సుత్తిని ఉపయోగించి భయంకరంగా చంపే పాత్రలో అభిషేక్ బెనర్జీ ఒదిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. క్రూరమైన పాత్ర అయినప్పటికీ కుక్కల పట్ల జాలి చూపించే వ్యక్తిగా అతనిలోని మానవీయ కోణాన్ని చూపించారు ఇందులో. ఆ కోణమే కథలో ఓ కీలక మలుపునకు కూడా కారణమవుతుంది. అలా ప్రేక్షకులు హతోడి త్యాగిని మరింత గుర్తుంచుకున్నారు.
భూమ్మీద అలోకా..
కొందరు బౌద్ధ భిక్షువులు తమ శాంతి సందేశాన్ని వినిపించేందుకు భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ఓ కుక్క వారి కంటపడింది. కారు ఢీకొనడంతో గాయాలపాలైన ఆ కుక్కను వారు కాపాడారు. దానికి అలోక అని పేరు పెట్టి(పాలి భాషలో వెలుగు అని అర్థం) బాగోగులు చూసుకున్నారు. తనను కాపాడినందుకు వారి పట్ల ఎనలేని కృతజ్ఞత పెంచుకున్న ఆ శునకం నాటి నుంచీ వారి వెంటే సంచరిస్తోంది.
ఇక అలోకా కథ తెలుసుకుని అమెరికాలో అనేక మంది ఆశ్చర్యపోయారు. శునకానికి కావాల్సిన వసతులు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు అనే డైలాగ్ ఉంది కదా.. అలా ఐక్యత, సహృద్భావం, శాంతిసామరస్యాలు వంటివి ప్రోత్సహించేందుకు బౌద్ధబిక్షువులతో పాటు ఈ పర్యటనలో అలోకా కూడా భాగమైందన్నమాట.


