
దేవుబాయిని కాలినడకన తీసుకెళ్తున్న గ్రామస్తులు
ఆస్పత్రికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేక ఇద్దరు గర్భిణుల నరకయాతన
వాంకిడి(ఆసిఫాబాద్)/దహెగాం(సిర్పూర్): గ్రామీణ ప్రాంతాల్లో సరైన రవాణా సదుపాయాలు, దారులు లేక అత్యవసర సమయాల్లో గిరిజనులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. తాజాగా ఓ గర్భిణి నడుం నొప్పితో ఆస్పత్రికి వెళ్లడానికి ఇబ్బంది పడితే, ప్రసవం కోసం మరో నిండు గర్భిణి నరకయాతన పడిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. సరైన దారిలేక అంబులెన్స్ రాకపోవడంతో వాంకిడి మండలం గోందాపూర్‌కు చెందిన గిరిజన మహిళ పురుటినొప్పులతో విలవిలలాడింది.
డొంగర్‌గాం గ్రామానికి చెందిన ఆత్రం రాజు, కన్నుబాయి దంపతుల కుమార్తె దేవుబాయిని చౌపన్‌గూడ పంచాయతీ పరిధిలోని గోందాపూర్‌కు చెందిన మడావి మెంగుకు ఇచ్చి వివాహం చేశారు. గర్భిణిగా ఉన్న దేవుబాయి ఇటీవల తన తల్లి గ్రామమైన డొంగర్‌గాంకు వెళ్లింది. బుధవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో గ్రామస్తులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే ఈ గ్రామం గుట్టపై ఉండడంతో సుమారు నాలుగు కిలోమీటర్లు వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
అంబులెన్స్‌ను గుట్ట కింద ఉన్న దొడ్డగూడ సమీపంలోనే నిలిపివేశారు. దీంతో దిక్కుతోచనిస్థితిలో నిండు గర్భిణి గ్రామస్తులు, కుటుంబ సభ్యుల సాయంతో వర్షంలో తడుస్తూ కొంతదూరం నడిచింది. ఆ తర్వాత బైక్‌పై అంబులెన్స్ వరకు తీసుకువచ్చారు. అనంతరం ఆమె వాంకిడి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వైద్యుల సూచనల మేరకు దేవుబాయికి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మరో మహిళకూ దారి కష్టాలే..
కుమురంభీం జిల్లాలోనే దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన నైతం సమ్మక్క అనే తొమ్మిది నెలల నిండు గర్భిణికి గురువారం సాయంత్రం నడుం నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. అయితే దారి సరిగ్గా లేదని అంబులెన్సు డ్రైవర్ గ్రామంలోకి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు సమ్మక్కను ఆటో ఎక్కించారు. ఇటీవల భారీ వర్షాలకు రోడ్డు అక్కడక్కడా కోతకు గురికావడం వల్ల ఆటో వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సమ్మక్కను నడిపించుకుంటూ కర్జి గ్రామం ప్లాంటేషన్ వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో దహెగాంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.