
గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పెరిగిన కిడ్నీ, కేన్సర్ సమస్యలు
నాలుగు జిల్లాల్లో మరీ అధికం.. ఆందోళనలో ఆరోగ్యశాఖ
గత ఐదేళ్లలో 13 వ్యాధులకు సంబంధించి 12.59 లక్షల కేసులు
ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు చెల్లించిన మొత్తం రూ.3 వేల కోట్లు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యాధులకు చికిత్సలు అందించాలని సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ, కేన్సర్, గుండె జబ్బులకు సంబంధించిన కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో జిల్లాలలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఈ వ్యాధులకు సంబంధించిన నమోదైన కేసులు, జరిగిన చికిత్సలు, అయిన ఖర్చు చూసి ఆరోగ్యశాఖ కూడా ఆందోళన చెందుతోంది. 13 వ్యాధులకు సంబంధించి ఐదేళ్లలో ఆరోగ్య శ్రీ కింద నమోదైన కేసులు ఏకంగా 12.59 లక్షలు ఉన్నట్లు తేలింది. ఈ వ్యాధులకు సగటున ప్రభుత్వం నెలకు ఆస్పత్రులకు చెల్లించిన మొత్తం రూ.50 కోట్లు. అంటే ఐదేళ్లలో ఏకంగా రూ.3,000 కోట్లు ఈ వ్యాధుల చికిత్సలకు మాత్రమే ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ కింద చెల్లించినట్లు లెక్క తేల్చారు. ఇందులో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
25 కి.మీ.పరిధిలో ఓ డయాలసిస్ కేంద్రం
రాష్ట్రంలో 2020 నుంచి 2025 ఆర్థిక సంవత్సరం వరకు ఆరోగ్యశ్రీ కింద 12 వ్యాధులకు సంబంధించి 12.59లక్షల కేసులు నమోదు కాగా, అందులో అత్యధికంగా మూత్రపిండాలకు సంబంధించి 3,63,197 కేసులు నమోదయ్యాయి. వీటిలో 80% డయాలసిస్ కేసులే కావడం గమనార్హం. రాష్ట్రంలో 102 ప్రభుత్వ డయాలసిస్ సెంటర్లు ఉండగా, పెరుగుతున్న రోగులకు ఈ కేంద్రాలు సరిపోవడం లేదు. దీంతో జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లోని డయాలసిస్ సెంటర్లను రోగులు ఆశ్రయిస్తున్నారు.
ఈ పరిస్థితిని సమీక్షించిన మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లాల్లో డయాలసిస్ సెంటర్ల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయించారు. ఎక్కడి నుంచైనా 25 కిలోమీటర్ల పరిధిలో ఓ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు ఆస్పత్రులకు రోగుల తాకిడిని నిరోధించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల తరువాత అత్యంత ఆందోళన కలిగించే వ్యాధిగా కేన్సర్‌ను గుర్తించారు. గత ఐదేళ్లలో కేన్సర్ సంబంధ వ్యాధులతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకున్న వారి సంఖ్య 3,06,702గా గుర్తించారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఎంజీఎం ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి ఒక్కటే ఉంది.
ఉస్మానియా, గాం«దీ, ఇతర జిల్లా ఆస్పత్రుల్లో కేన్సర్‌కు మందులు తప్ప పూర్తిస్థాయి చికిత్స అందించే సౌకర్యాలు లేవు. నిమ్స్‌తోపాటు ప్రైవేటు రంగంలో కేన్సర్ చికిత్స అత్యంత ఖరీదైనదిగా మారింది. ఆరోగ్యశ్రీ కింద కేన్సర్ వ్యాధికి చికిత్స లభిస్తుండటంతో జిల్లాల్లోని ఆస్పత్రులలో వైద్యం పొందుతున్నారు. ప్రైవేటు బోధనాస్పత్రులు కేన్సర్‌కు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తూ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. అంకాలజీ విభాగాన్ని ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలపై నివేదిక అందజేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు.
గుండె, ఆర్థోపెడిక్ కూడా
⇒ కిడ్నీ, కేన్సర్ తరువాత అధికంగా నమోదవుతున్న కేసుల్లో ఆర్థోపెడిక్ మూడో స్థానంలో ఉంది. ప్రమాదాలు సంభవించినప్పుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయేవారు కొందరైతే.. కాళ్లు, చేతులు విరిగి అంగ వికలులుగా మారేవారు మరికొందరు. ఈ ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కింద నమోదైన ఆర్థోపెడిక్ కేసులు 1,91,852. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 లోపే ట్రామా కేర్ సెంటర్లు ఉండగా, మరో 74 ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది.
త్వరలోనే వీటిని ఏర్పాటుచేసేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆమోదం తెలిపారు. అలాగే గుండె సంబంధ వ్యాధుల కేసులు కూడా 1,45,814 నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్డియాలజీ విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. 2డీ ఈకో, ఆంజియోగ్రామ్, స్టెంట్స్ వేసే సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవి కాకుండా ఐదేళ్లలో జనరల్ మెడిసిన్‌లో 73,697 కేసులు, ఆప్తల్మాలజీలో 57,639 కేసులు, న్యూరోలో 40,667 కేసులు, జనరల్ సర్జరీలో 31,214 కేసులు, పీడియాట్రిక్స్‌లో 28,924, గైనకాలజీలో 9,517 కేసులు, ఈఎన్‌టీలో 7,251 కేసులు, గ్రాస్ట్రో ఎంటరాలజీ కింద 1,636, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌లో 1,272 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధులకు వైద్య సౌకర్యాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ ‘సాక్షి’కి తెలిపారు.