ప్రపంచవ్యాప్తంగా వేలాది వన్యప్రాణులు ఇటీవలి సంవత్సరాలలో ఇండియాలోని వివిధ జంతు ప్రదర్శనశాలలకు చేరుకున్నాయి. ఆ జాబితాలో పులులు, సింహాల వంటి క్రూరమృగాలే కాకుండా పక్షులు, కోతి జాతుల వంటివీ ఉన్నాయి. 2023, 2024లలో ప్రపంచంలో అత్యధిక వన్యమృగాలు దిగుమతి చేసుకున్న దేశం మనదే. – సాక్షి, స్పెషల్ డెస్క్
2024లో ప్రపంచవ్యాప్తంగా 2,922 వన్యమృగాలు వివిధ దేశాలలోని ‘జూ’లకు చేరుకున్నాయి. వాటిలో 1,640 ఇండియా దిగుమతి చేసుకున్నవే. ఆ ఏడాది, అంతకుముందు ఏడాది కూడా (మొత్తం 4,051 వన్యమృగాలు) ఇండియానే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. 2022లో రెండో స్థానంలో, 2021లో నాలుగో స్థానంలో ఉంది.
వన్యమృగాల దిగుమతుల్లో ప్రముఖ దేశాలుగా ర్యాంకులు పొందిన సింగపూర్, యూఏఈల నుంచి కూడా ఇండియా దిగుమతి చేసుకోవటం విశేషం. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేజర్డ్ స్పీషీస్ (సి.ఐ.టి.ఇ.ఎస్.) నివేదిక ప్రకారం 1978 నుంచి ఇండియాలోని ‘జూ’లకు చేరుకున్న వన్యప్రాణులలో 90 శాతం గత నాలుగేళ్లలో దిగుమతి అయినవే.
దక్షిణాఫ్రికా నుంచే అధికం
1978 నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటున్న వన్యమృగాలలో దాదాపు 30 శాతం దక్షిణాఫ్రికాకు చెందినవే. ఐరోపా దేశాల నుంచీ దిగుమతులు అధికంగానే ఉన్నాయి.
పులులకే డిమాండ్ ఎక్కువ
ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం మనదే. గత 46 ఏళ్లలో మనదేశం 314 పులులను దిగుమతి చేసుకుంది. తర్వాతి స్థానాలలో సింహాలు, చీతాలు ఉన్నాయి.


