న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన డెమొక్రాట్ గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ) రేసులో విజయం సాధించారు. ఆమె రిపబ్లికన్ జాన్ రీడ్‌ను ఓడించారు. హష్మీ.. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం మహిళ. అలాగే మొదటి దక్షిణాసియా అమెరికన్‌గా గుర్తింపు పొందారు. గజాలా హష్మీ 15వ సెనేటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె రిపబ్లికన్ ఆధీనంలో ఉన్న రాష్ట్ర సెనేట్ స్థానంపై ఆధిపత్యం సంపాదించి, వర్జీనియా జనరల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
హష్మీ సొంత వెబ్‌సైట్‌లో.. ‘ఇతరుల జీవితాలను మెరుగు పరిచే దిశగా తన ప్రయత్నాలు కొనసాగుతాయని’ పేర్కొన్నారు. ఆమె గృహనిర్మాణం, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ న్యాయం తదితర సమస్యలపై దృష్టి సారించారు. 1964లో హైదరాబాద్‌లో జియా హష్మీ, తన్వీర్ హష్మీ దంపతులకు జన్మించిన గజాలా తన బాల్యాన్ని మలక్‌పేటలోని తన తాత ఇంట్లో గడిపారు. హష్మీ తన నాలుగేళ్ల వయస్సులో తన తల్లి, అన్నయ్యతో కలిసి భారతదేశం నుండి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ వారంతా జార్జియాలో తండ్రితో పాటు ఉన్నారు.
గజాలా తండ్రి ప్రొఫెసర్ జియా హష్మి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి. అక్కడ అతను ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. తరువాత సౌత్ కరోలినా విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ సంబంధాలలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అనంతరం బోధనా వృత్తిని స్వీకరించారు. అతను స్వయంగా స్థాపించిన సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశాడు. హష్మి తల్లి తన్వీర్ హష్మి హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ, బీఈడీ చేశారు.
హష్మి తన విద్యాభ్యాసం సమయంలో పలు స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లను అందుకున్నారు. జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుండి బీఏ, అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి అమెరికన్ సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. 1991లో హష్మి, ఆమె భర్త అజార్ రఫీక్‌తో పాటు రిచ్‌మండ్ ప్రాంతానికి తరలి వెళ్లారు. ఈ దంపతులకు యాస్మిన్, నూర్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ చెస్టర్‌ఫీల్డ్ వర్జీనియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. హష్మీ దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రొఫెసర్ గా పనిచేశారు. మొదట రిచ్మండ్ విశ్వవిద్యాలయంలో, తరువాత రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో పనిచేశారు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ వ్యవస్థాపక డైరెక్టర్ గానూ హష్మీ పనిచేశారు.


