జెరుసలేం: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఇరాన్ తన బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యాన్ని విస్తరించుకుంటోందన్న ఆందోళనలతో అమెరికా, ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చేవారం (డిసెంబర్29) కీలక సమావేశానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరనున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి.
ఇరాన్ గత కొన్నేళ్లుగా తన బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌పై దృష్టిసారించింది. ఇటీవల 10,000 కిలోమీటర్ల పరిధి కలిగిన కొత్త మిసైల్‌ను ఆవిష్కరించింది. ఇది అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరగలదని ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఈ పరిణామంపై ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా స్పందిస్తూ, ఇరాన్ తీరును ప్రపంచ దేశాల ఎదుట తీర్పారబట్టే ప్రయత్నాలు చేస్తోంది.
ఇజ్రాయెల్ ఆందోళన
ఇరాన్ మిసైల్ శ్రేణి ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకునే స్థాయికి చేరుకుందని, ఇది మధ్యప్రాచ్య భద్రతకు తీవ్రమైన ముప్పు అని నెతన్యాహు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అమెరికా తక్షణ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ట్రంప్ ఇరాన్‌పై కఠిన వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో, నెతన్యాహు ఈ సమావేశాన్ని ఒక అవకాశంగా చూస్తున్నారు. ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్‌పై యూరోపియన్ యూనియన్ సహా అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం మరింత కఠిన చర్యలు అవసరమని పట్టుబడుతోంది.
భవిష్యత్ ప్రభావం
ఈ సమావేశం ద్వారా అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు రెండు దేశాలు కలిసి వ్యూహాత్మక చర్యలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ భవిష్యత్తులో మధ్యప్రాచ్య శాంతి, భద్రతకు కీలక సవాలు అవుతుందని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. ఈ తరుణంలో నెతన్యాహు–ట్రంప్ సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకోనుంది.


