రికార్డు సృష్టించిన జర్మన్ ఏరోస్పేస్ ఇంజనీర్ మైఖేలా బెంథాస్
హూస్టన్: జర్మన్ ఏరోస్పేస్, మెకాట్రానిక్స్ ఇంజనీర్ మైఖేలా మిచీ బెంథాస్ చరిత్ర సృష్టించింది. ప్రమాదంలో గాయపడిన ఆమె చక్రాల కుర్చీలోనే అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తిచేసింది. అమెరికా కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఒరిజిన్ సంస్థ శనివారం ఉదయం న్యూ షెఫర్డ్ ఎన్‌ఎస్–37 సబ్ అర్బిటాల్ మిషన్‌ను నిర్వహించింది. అమెరికాలోని టెక్సాస్ నుంచి వ్యోమనౌకలో బెంథాస్‌తోపాటు మొత్తం ఆరుగురు అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు.
భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో కాసేపు విహరించి, భూమికిపైకి క్షేమంగా తిరిగివచ్చారు. వీల్‌చైర్‌లో కూర్చొని అంతరిక్ష యాత్రలో పాల్గొనడం ఇదే మొదటిసారి. దివ్యాంగులు సైతం ఇలాంటి యాత్రలు చేయొచ్చని బెంథాస్ నిరూపించారు. ఆమె గతంలో మౌంటెన్ బైకింగ్ చేస్తుండగా గాయపడ్డారు. వెన్నుపూస దెబ్బతినడంతో చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఆయినప్పటికీ అంతరిక్షం పట్ల జిజ్ఞాస తగ్గలేదు. ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నారు.


