
సాక్షి, కర్నూలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరించే మొదటి కేసు సుగాలి ప్రీతిదే.. జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో చెప్పినమాట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆయన ఈ కేసు ఊసెత్తలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రీతి తల్లి పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి కేసును గాలికి వదిలేశారు. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్, హోం మినిష్టర్ అనితను కలిసిన తమకు న్యాయం జరగలేదు. అందుకే తాను న్యాయం కోసం వీల్ చైర్ యాత్ర ను ప్రారంభించాను. కానీ, యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. అందుకే హైకోర్టును ఆశ్రయించా. ఈనెల 22వ తేదీన కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఆ వెంటనే యాత్ర మొదలుపెడతా అని అన్నారామె.
అదే సమయంలో.. నిందితులకు అధికార పార్టీ నేతలు కొమ్ము కాస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య , అత్యాచారం చేసిన ఆధారాలు స్పష్టంగా ఉన్న ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారామె.
ఇదిలా ఉంటే.. సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోరుతూ ఆమె తల్లి పార్వతి కర్నూల్ నుంచి విజయవాడకు వీల్‌చైర్ యాత్ర ప్రారంభించాలనుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా కేసు ముందుకు కదలడం లేదని.. న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకనే తాను న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయని చెబుతున్నారామె. అయితే.. ఈ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. వీల్ చైర్ యాత్రకు అనుమతి లేదని అంటున్నారు. యాత్రను చేపట్టవద్దంటూ కర్నూలు పోలీసులు బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో పార్వతి హైకోర్టును ఇవాళ ఆశ్రయించారు.
‘‘నా కూతురు అత్యాచారం,హత్యకు గురై 8 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ మాకు న్యాయం జరుగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిష్కరించే మొదటి కేసు సుగాలి ప్రీతిదే అని హామి ఇచ్చారు. కాని కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండి పోయింది. తానే న్యాయపోరాటం చేస్తానని హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అందుకే న్యాయం కోసం పోరాటానికి దిగుతున్నా. అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు’’ అని అంటున్నారామె.
కేసు నేపథ్యం..
కర్నూలు నగర శివార్లలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతీబాయ్ 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్‌కి ఉరేసుకుని చనిపోయినట్లు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు లైంగిక దాడి చేసి చంపేశారని తల్లిదండ్రులు సుగాలి రాజు నాయక్, పార్వతిదేవి ఆరోపించారు.
బాబు హయాంలో ముందుకు సాగని కేసు
అయితే ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరిగింది. అదే రోజు కర్నూలు పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పోక్సో చట్ట నిబంధనల కింద కూడా కేసు పెట్టినా, అప్పటి ప్రభుత్వ పెద్దల తీరుతో తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ స్కూలు కరస్పాండెంట్, ఆయన కుమారులను అరెస్ట్ చేశారు. తరువాత కొద్ది రోజులకే వారు బెయిల్‌పై బయటకు వచ్చేశారు. చంద్రబాబు హయాంలో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.
అయితే.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని తల్లిదండ్రులు కోరగా, ఆమేరకు ఆయన ఉత్తర్వులిచ్చారు. అంతేకాక 2021లో ప్రీతి తల్లిదండ్రులకు రూ. 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల పొలాన్ని అందించారు. ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం కోరుతున్నా.. సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడంతో తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.
ఈ ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ రఘురామ రాజన్ ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రీతి మృతి కేసులో అంతర్రాష్ట్ర పర్యవసానాలు, తాము జోక్యం చేసుకోవాల్సినంత చట్టపరమైన సంక్లిష్టత లేవని అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సీబీఐ ప్రధాన కార్యాలయానికి కూడా తెలిపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన, సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఈ కేసులో అంత సంక్లిష్టత లేదని హైకోర్టుకు తెలిపింది. వనరుల కొరత కారణంగా చూపుతూ తాము దర్యాప్తు చేయలేమని తేల్చి చెప్పింది. ప్రీతి తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును కోరింది. అలా గత బాబు హయాంలో నత్తనడకన సాగిన కేసు.. ఇప్పుడు మళ్లీ ఆయన ప్రభుత్వం రావడంతో పూర్తిగా యూటర్న్ తీసుకుంది. మరోవైపు.. ప్రీతి మృతి కేసును అప్పట్లో రాజకీయంగా వాడుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారే అనే విమర్శలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.