సాక్షి, విజయవాడ: మద్యం ప్రియులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ నుంచి మద్యం ధరలు పెంచేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. బాటిల్ పై ఏకంగా రూ. 10 ధర బాదుడుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల సమయంలో మధ్యం ధరలు తగ్గిస్తానని మద్యం ప్రియులకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు సంపద సృష్టిలో భాగంగా బాదుడుకు సిద్ధమయ్యారు. గతంలోనూ బాటిల్‌పై రూ.10 పెంచి.. ఇప్పుడు మరోసారి అదీ పండుగపూటనే పెంచాలని నిర్ణయించారు. దీంతో ఏడాదికి రూ.1,391 కోట్లు మందు బాబులపై భారం పడనుంది.
ఈ నిర్ణయం ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(IMFL), ఫారిన్ లిక్కర్ (FL)కు వర్తింపజేయాలని భావిస్తోంది. దీంతో.. 70 శాతం మద్యం బాటిళ్లపై ధరలు పెరగనున్నాయి.
లిక్కర్ సిండికేట్‌కి దాసోహం..
లిక్కర్ సిండికేట్‌తో కుమ్మక్కు అయిన చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు సిండికేట్‌కు అనుగుణంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తాజాగా కేబినెట్ భేటీలో బార్లకు అదనపు రిటైల్ ట్యాక్స్ తొలగించేయాలని నిర్ణయించారు. దీంతో.. ఏడాదికి 340 కోట్లు బార్ల సిండికేట్‌కి లబ్ధి చేకూరనుంది. గత చంద్రబాబు పాలనలోనూ.. ప్రివిలైజ్ ట్యాక్స్ రద్దు చేశారు. ఈ దఫా కూటమి ప్రభుత్వంలో ఏఆర్ఈటీని రద్దు చేశారు. ఈ నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
మంత్రులపై మళ్లీ సీరియస్
మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు మళ్లీ సీరియస్ అయ్యారు. మంత్రులెవ్వరూ ఏ పని చేయడం లేదని.. తమ పని తీరు మార్చుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘‘నేనే నెలకు రెండు, మూడుసార్లు పార్టీ ఆఫీస్‌కు రావాల్సి వస్తోంది. వినతులు ఏమాత్రం తగ్గడం లేదు. పార్టీ కోసం ఐదేళ్లు కష్టపడ్డవారి వివరాలు ఇవ్వడం లేదు. పార్లమెంట్ కమిటీలు కూడా నేనే పూర్తి చేశానంటే జిల్లా మంత్రుల పనితీరు ఏంటో అర్థమవుతోంది’’ అంటూ ఎప్పటిలాగే అసంతృప్తిని మంత్రులపై నెట్టేశారాయన.


