అమెరికాలో ఎప్‌స్టీన్ ఫైల్స్ కలకలం కొనసాగుతోంది. డెడ్‌లైన్ గడువు దగ్గర పడుతుండడంతో కీచకుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధం ఉన్న ఫొటోలను, కీలక పత్రాలను బయట పెడుతున్నారు. ఈ క్రమంలో.. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని ఫైల్స్ మాయం కావడం సంచలనంగా మారింది.
జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధిం తాజాగా.. 24 గంటల్లోనే కనీసం 16 ఫైళ్లు అదృశ్యమయ్యాయి. అందులో ఒక ఫోటోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎప్‌స్టీన్‌లతో పాటు ట్రంప్ భార్య మెలానియా, ఎప్‌స్టీన్ క్రైమ్ పార్ట్‌నర్ గిస్లేన్ మ్యాక్స్‌వెల్ ఉన్నట్లు తెలుస్తోంది. మాయమైన ఫైల్స్‌లో ట్రంప్‌కు సంబంధించిన కీలక సమాచారం ఉందనేది హౌజ్ ఓవర్‌సైట్ కమిటీలోని డెమొక్రట్ల ప్రధాన ఆరోపణ. మరోవైపు..

ఆ ఫైల్స్‌ను ఎందుకు తొలగించాల్సి వచ్చిందనేదానిపై అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ఇప్పటిదాకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పొరపాటున జరిగిందా?.. ఏదైనా కారణంతో చేశారా? అనేదానిపై ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే విడుదలైన ఆ డాక్యుమెంట్లలో.. బాధితులను దర్యాప్తు ఏజెన్సీ ఎఫ్‌బీఐ చేసిన ఇంటర్వ్యూలు, అంతర్గత మెమోలు వంటి కీలక పత్రాలు కనిపించకపోవడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్‌స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయ్యి.. కొంత కాలం తర్వాత విడుదలయ్యారు. ఆపై మీటూ ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు.
ఎప్‌స్టీన్ తనకు సంబంధించిన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే రెండు దీవుల్లో(ప్రైవేట్ ఐల్యాండ్)లో.. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్‌స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్‌వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి(ప్రస్తుతం ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు).
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో..
మీటూ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్న టైంలో ఎప్‌స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అయితే.. అలా జరగలేదు.
ఎప్‌స్టీన్ కస్టమర్ల జాబితాలో ట్రంప్ కూడా ఉన్నారని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే.. ఒకప్పుడు అతనితో స్నేహం ఉండేదని, అరెస్ట్ తర్వాత అతన్నొక మానవ మృగంగా భావించి దూరం పెట్టానని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఆ ఫైల్స్‌ను పారదర్శకంగా రిలీజ్ చేయించేందుకు తాను సిద్ధమని అంటూనే.. జాప్యం చేస్తూ వచ్చారాయన. ఈ క్రమంలో.. సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తుండటంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. వాటిని బయట పెట్టాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ కూడా బిల్లును ఆమోదించడంతో ఇటీవలే దానిపై సంతకం పెట్టారు. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాల్సి ఉంది.
లేటెస్ట్ రిలీజ్‌లో..
మొత్తం 3 లక్షలకు పైగా డాక్యుమెంట్లు, 3,500 ఫైల్స్, భారీగా ఫోటోలను ఇప్పటిదాకా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసింది. ఇందులో.. ఆయుర్వేదం, అందులో పేర్కొన్న పలు మసాజ్ పద్ధతుల గురించిన ప్రస్తావన ఉండటం విశేషం. అలాగే.. ట్రంప్ సహా పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఎప్‌స్టీన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోజులు, ఆయన ఐల్యాండ్‌లో సేదతీరిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఐల్యాండ్స్‌లోని విలాసాలు.. అలాగే కొన్ని నగ్న ఫొటోలు కూడా అందులో ఉన్నాయి.


డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు సంబంధించి మాత్రం చాలా ఫొటోలు ఉండటం విశేషం. వాటిలో ఆయన హాట్ టబ్‌లో, పూల్‌లో పలువురు మహిళలతో సేదదీరుతూ కనిపిస్తున్నారు. ఆయనేగాక పాప్ స్టార్ మైకేల్ జాక్సన్, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నాటి పలువురు హాలీవుడ్ హీరోలు ఎప్ స్టీన్ పార్టీలకు హాజరైన ఫొటోలు కూడా విడుదలైన ఫైల్స్‌లో ఉన్నాయి. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఫొటోల్లో.. ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు ఇబ్బంది కలిగించే అంశాలేవీ పెద్దగా లేవు. ఆయనకు సంబంధించి అభ్యంతరకరంగా లేని కొన్ని ఫొటోలు మాత్రమే ఉన్నాయి.


