మరిన్ని ఫైల్స్ విడుదల
వైరల్‌గా మాజీ అధ్యక్షుడు క్లింటన్ బాత్ టబ్ ఫొటోలు
జాక్సన్ తదితరులవి కూడా
ట్రంప్‌కు సంబంధించి కొన్ని మామూలు ఫొటోలు మాత్రమే
వాషింగ్టన్: అమెరికన్లు కొద్ది రోజులుగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జెఫ్రీ సెక్స్ కుంభకోణం తాలూకు మరిన్ని ఫైల్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. మొత్తం 3 లక్షలకు పైగా డాక్యుమెంట్లు, 3,500 ఫైల్స్, భారీగా ఫోటోలను న్యాయ శాఖ శుక్రవారం విడుదల చేసింది. రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖుల లైంగికానందం కోసం ఎప్ స్టీన్ మహిళలను, ముఖ్యంగా బాలికలను సరఫరా చేసిన వైనం 20 ఏళ్ల కింద అమెరికాలో సంచలనం రేపడం తెలిసిందే.
దాని తాలూకు ప్రకంపనాలు ఇప్పటికీ సద్దుమణగలేదు. అయితే తాజా ఫైల్స్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇబ్బంది కలిగించే అంశాలేవీ పెద్దగా లేవు. ఆయనకు సంబంధించి అభ్యంతరకరంగా లేని కొన్ని ఫొటోలు మాత్రమే ఉన్నాయి. విపక్ష డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు సంబంధించి మాత్రం చాలా ఫొటోలు ఉండటం విశేషం. వాటిలో ఆయన హాట్ టబ్‌లో, పూల్‌లో పలువురు మహిళలతో సేదదీరుతూ కనిపిస్తున్నారు. ఆయనేగాక పాప్ స్టార్ మైకేల్ జాక్సన్, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నాటి పలువురు హాలీవుడ్ హీరోలు ఎప్ స్టీన్ పార్టీలకు హాజరైన ఫొటోలు కూడా విడుదలైన ఫైల్స్‌లో ఉన్నాయి.
20 ఏళ్ల కేసు: 2005 మార్చిలో ఒక బాలిక కుటుంబం ఫిర్యాదుతో ఎప్ స్టీన్ లీలలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామ్ బీచ్ కౌంటీలోని తన నివాసంలో పలువురు రాజకీయ తదితర ప్రముఖుల లైంగికానందం కోసం ఎప్ స్టీన్ పలువురు బాలికను వాడుకున్నాడని వారు ఆరోపించారు. జనాగ్రహం నేపథ్యంలో అరెస్టైన అతడు 2019లో జైల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎప్ స్టీన్ కస్టమర్ల జాబితాలో ట్రంప్ కూడా ఉన్నారని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తుండటంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. వాటిని బయట పెట్టాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ కూడా బిల్లును ఆమోదించడంతో ఇటీవలే దానిపై సంతకం పెట్టారు.
ఆయుర్వేదం ప్రస్తావన!
ఎప్ స్టీన్ ఫైల్స్‌లో ఆయుర్వేదం, అందులో పేర్కొన్న పలు మసాజ్ పద్ధతుల గురించిన ప్రస్తావన ఉండటం విశేషం. ’5 వేల ఏళ్ల పురాతనమైన భారత సహజ చికిత్సా ప్రక్రియను ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా చాలామంది అనుసరిస్తున్నారు’ అని వాటిలో పలుచోట్ల చెప్పుకొచ్చారు. అంతేగాక ’మసాజ్ చేసే కళ’ పేరిట పలు వ్యాసాలు కూడా వాటిలో ఉన్నాయి!


