సొంత శిబిరంలో విభేదాలూ, అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థ, కానరాని ఉపాధి కల్పన, మధ్యంతర ఎన్నికల్లో ఓటర్ల తిరస్కరణ వగైరాలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఊపిరాడనీయటం లేదని వైట్‌హౌస్ వేదికగా ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగం తేటతెల్లం చేసింది. పాత సంవత్సరానికి వీడ్కోలుగా, అధికారంలోకొచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా ఆయన చేసిన ఈ ప్రసంగం ఒకపక్క స్వోత్కర్షలతో, మరోపక్క సంజాయిషీలతో నిండిపోయింది. అసత్యాలు, అర్ధ సత్యాలు సరేసరి. తరచు వైట్‌హౌస్ వేదికగా జరిగే మీడియా సమావేశాల్లో ఆయన చేసే వ్యాఖ్యలకూ, ఈ ప్రసంగానికీ కాస్తయినా తేడా లేదు.
స్వీయ వైఫల్యాలను నిష్క్రమించిన అధ్యక్షుడు జో బైడెన్ ఖాతాకు మళ్లించి... జరగని యుద్ధాలనూ, జరిగినా తన ప్రమేయం లేకుండా ముగిసిన యుద్ధాలనూ, ఆపినా మళ్లీ మొదలైన యుద్ధాలనూ సైతం తన విజయంగా ప్రకటించుకున్నారు. అందులో భారత్–పాక్ సంఘర్షణ ఒకటి. వలసదారులను దేశం విడిచి వెళ్లేలా చేసి అలా ఆదా చేసిన సొమ్మంతా అమెరికన్ పన్ను చెల్లింపుదారులకు ఉచితంగా వైద్యం, విద్య రూపంలో అందిస్తున్నామని ట్రంప్ చెప్పుకొన్నారు. ఇళ్ల అద్దెలు తగ్గాయనీ, ఉద్యోగాలు వచ్చిపడ్డాయనీ, పెట్టుబడులు రప్పించాననీ ప్రకటించుకున్నారు.
నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి వలసదారుల తోడ్పాటు ఎంతో ఉంది. దేశంలో అగ్ర సంస్థలుగా పేరొందిన వాటిలో 46 శాతం... అంటే 230 కంపెనీలు వలసదారులూ, వారి పిల్లలూ స్థాపించినవే. ఈ ఏడాది న్యూ అమెరికన్ ఫార్చ్యూన్–500లో చేరిన పది కంపెనీల్లో సగం వలసదారులవే. 2023 గణాంకాల ప్రకారమైతే ఆ ఏడాది వలసదారులు సృష్టించిన సంపద లక్షా 70 వేల కోట్ల డాలర్లు. వారు పన్ను రూపంలో చెల్లించిన మొత్తం 65,200 కోట్ల డాలర్లు.
వాస్తవాలు ఇవి కాగా, చట్టవిరుద్ధంగా వచ్చినవారితోపాటు అమెరికా పౌరసత్వం పొందినవారిని సైతం ట్రంప్ ప్రభుత్వం రాచి రంపాన పెడుతోంది. వారిలో అనవసర భయాందోళనలను సృష్టిస్తూ, ప్రజల్లో అనైక్యత తీసుకురావటానికి అబద్ధాలను ప్రచారంలో పెడుతోంది. ఆయన వచ్చాక వలస వ్యవహారాల న్యాయమూర్తులుగా వున్న 100 మందిని తొలగించారు. టానియా నెమెర్ అనే మహిళా న్యాయమూర్తిని ఒక కేసు విచారిస్తుండగానే కారణం చెప్పకుండా బెంచ్ నుంచి, ఆ తర్వాత సర్వీసు నుంచి తొలగించారు.
ప్రస్తుత వైఫల్యాలకు కారణం గతంలోని అస్తవ్యస్తతే కారణమని చెప్పడం ఇటీవల అన్ని దేశాల్లోనూ పాలకులకు అలవాటైన విద్య. ట్రంప్ సైతం ఆ పాటే పాడారు. నిజానికి జో బైడెన్ హయాంలో ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. వలసదారులను తరిమేయటం ద్వారా దాన్ని మరింత గొప్పగా మారుస్తానని అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో ట్రంప్ పదే పదే చెప్పారు. కానీ జరిగిందంతా వేరు. ఇష్టానుసారం ప్రపంచ దేశాలపై సుంకాలు పెంచటం వల్ల దేశీయ వినియోగదారులు సగటున 16.8 శాతం అదనంగా పన్నులు చెల్లించాల్సి వస్తున్నదనీ, 1935 నుంచి చూస్తే ఇదే అత్యధికమనీ యేల్ బడ్జెట్ ల్యాబ్ అంచనా వేసింది.
దిగుమతైన సరుకులపై ప్రభుత్వం విధించే అదనపు సుంకాలను అంతిమంగా భరించేది అమెరికా వినియోగదారులే. ట్రంప్ అనుకూల ఫాక్స్ న్యూస్ సర్వేలో 72 శాతం మంది గడ్డు ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటు న్నామని చెప్పగా, 58 శాతం మంది ఆయన అనుచిత విషయాలపై శ్రద్ధ పెడుతున్నారని అన్నారు. ఇక అక్టోబర్, నవంబర్ నెలల్లో 41,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగిత 4.6 శాతానికి ఎగబాకింది. 2021 తర్వాత ఈ స్థాయికి పోవటం ఇదే ప్రథమం. గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయటానికి ప్రయత్నిస్తూ మాదక ద్రవ్యాలపై పోరాడుతున్నానని చెప్పుకోవటం ట్రంప్‌కే చెల్లింది.
దేశం ఎదుర్కొంటున్న సమస్యలను చిత్తశుద్ధితో చర్చించి, వాటి పరిష్కారానికి తాను అనుసరిస్తున్న విధానాలేమిటో చెప్పి భవిష్యత్తు బాగుంటుందని చెప్పివుంటే కనీసం కొందరైనా నమ్మేవారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఒప్పుకొంటే, దానికి జవసత్వా లిచ్చేందుకు ఆయన ఏదో ఒకటి చేస్తారన్న ఆశయినా మిగిలేది. దానికి బదులు అంతా సవ్యంగా ఉందని చెప్పడం వల్ల ట్రంప్‌పై కొద్దో గొప్పో ఉన్న విశ్వాసం కూడా దెబ్బతింది. ఆయన రేటింగ్ పడిపోవటంలో ఆశ్చర్యమేముంది?


