ఉపాధి హామీ పథకాన్ని బుల్డోజ్ చేశారు
11 ఏళ్లుగా ప్రజా వ్యతిరేక పాలనే
మోదీ ప్రభుత్వంపై సోనియా ఆగ్రహం
న్యూఢిల్లీ: పేద కూలీల ప్రగతి కోసం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుల్డోజ్ చేసిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మండిపడ్డారు. ఈ పథకాన్ని పక్కనపెట్టి కొత్తగా తీసుకొస్తున్న నల్ల చట్టంతో పేదలు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మిస్తామని తేల్చిచెప్పారు.
ఈ మేరకు సోనియా గాంధీ శనివారం వీడియో సందేశం విడుదల చేశారు. ఉద్యమంలోకి అడుగుపెట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని, గ్రామీణ పేదల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలతో రైతులు, కూలీలు, భూమిలేని పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు.
దాదాపు 20 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ చట్టం పార్లమెంట్‌లో ఏకాభిప్రాయంతో ఆమోదం పొందిన సందర్భాన్ని సోనియా గుర్తుచేశారు. ఈ చట్టం ఒక విప్లవాత్మకమైన అడుగుగా అభివరి్ణంచారు. ఉపాధి హామీ పథకంతో నిరుపేదలు, అణగారిన వర్గాల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందారని వివరించారు. గ్రామాల నుంచి వలసలు ఆగిపోయాయని పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడం, గాంధీజీ పేరును తొలగించడం తీవ్ర విచారకరమని సోనియా గాంధీ ఉద్ఘాటించారు. ఎవరినీ సంప్రదించకుండా, ఎలాంటి చర్చ లేకుండా, ప్రతిపక్షాన్ని సైతం విశ్వాసంలోకి తీసుకోకుండా ఉపాధి హామీ పథకంలో ఇష్టారాజ్యంగా మార్పులు చేశారని ధ్వజమెత్తారు. కొత్త చట్టంతో పథకం అసలు లక్ష్యం పూర్తిగా బలహీనపడుతోందని, ఎవరికి, ఎప్పుడు, ఎలా ఉపాధి కల్పించాలన్నది ఇక ఢిల్లీలోని ప్రభుత్వమే నిర్ణయించే పరిస్థితి వస్తుందన్నారు.
నిరుపేద సోదర సోదరీమణులకు ఉపాధి హక్కు కల్పించాలన్న డిమాండ్‌తో 20 ఏళ్ల క్రితం ఉద్యమించానని, మరోసారి అలాంటి ఉద్యమానికి సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు. తనతోపాటు తమ పార్టీ నేతలు, కార్యకర్తలంతా ప్రజలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’బిల్లు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.


