భూమికి అతి సమీపంగా వెళ్లిన అట్లాస్ తోకచుక్క
అదో అరుదైన అంతరిక్ష అతిథి. ఇంకా చెప్పాలంటే మన సౌర మండలంలోకి దూసుకొచ్చిన చొరబాటుదారు. అదే... 3ఐ/అట్లాస్‌గా పిలుస్తున్న తోకచుక్క! అది అనంత విశ్వంలో సుదీర్ఘయానం చేసి మరీ మన చెంతకు వచ్చింది. ఆ క్రమంలో భూమికి నష్టమేమైనా చేస్తుందేమోనని సైంటిస్టులు కలవరపడ్డా, అలాంటిదేమీ లేకుండానే తన మార్గాన తిరిగి సుదూర విశ్వంలోకి వెళ్లిపోతోంది! దాంతో అంతా హమ్మయ్యా అని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు...!
మతి పోగొడుతున్న ఫొటోలు
3ఐ/అట్లాస్ శుక్రవారం రాత్రి, అంటే డిసెంబర్ 19న భూమికి సైంటిస్టులు ముందుగా వేసిన అంచనా కంటే కూడా అతి సమీపానికి వచ్చింది. 1.8 ఆస్ట్రనామికల్ యూనిట్ల (27 కోట్ల కిలోమీటర్లు) సమీపానికి అని వారు భావించగా, అది ఏకంగా 1.4 ఆస్ట్రనామికల్ యూనిట్ల (20 కోట్ల కి. మీ.) సమీపానికి వచ్చేసింది. ఆ సందర్భంగా ఉటా అబ్జర్వేటరీ తీసిన ఫొటో అందరినీ అలరిస్తోందిప్పుడు. అందులో 3ఐ/అట్లాస్ రెండు తోకలతో వింత హొయలు పోతూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లియో నక్షత్ర మండలంలోని తారలు తళుక్కుమంటూ కనువిందు చేస్తున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్


