
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు చార్లీ కిర్క్‌పై జరిగిన కాల్పుల ఘటనలో మరో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితుడు కాలేజీ భవనం పైకప్పు నుంచి దూకి పరారైన దృశ్యాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తాజాగా విడుదల చేసింది. కిర్క్‌ను చంపడానికి దుండగుడు ఉపయోగించిన బోల్డ్–యాక్షన్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌బీఐ ప్రకటించింది.
దానిపై వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం ల్యాబ్‌లో పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. దుండగుడి ఆచూకీ ఇంకా లభించలేదని, గాలింపు కొనసాగుతోందని వెల్లడించింది. అమెరికాలో యూటా రాష్ట్రంలోని ఉటా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో బుధవారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా 150 మీటర్ల దూరంలో ఓ భవనం పైభాగంలో మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తి తుపాకీ గురిపెట్టాడు. ఒకే ఒక్క తూటాకు చార్లీ కిర్క్ అక్కడికక్కడే నేలకొరిగాడు. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల తరహాలోనే ఈ కాల్పులు జరగడం గమనార్హం.
యూనివర్సిటీ ప్రాంగణంలో తెల్లరంగు టెంట్ మధ్యలో కూర్చొని విద్యార్థుల ప్రశ్నలకు మైక్రోఫోన్‌లో సమాధానం చెబుతుండగా హఠాత్తుగా బుల్లెట్ దూసుకొచ్చింది. రాజకీయ యువజన సంఘం ‘టరి్నంగ్ పాయింట్ యూఎస్‌ఏ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చర్చా కార్యక్రమంలో గత పదేళ్లలో అమెరికాలో తుపాకీ హింసాకాండలో ట్రాన్స్‌జెండర్ల పాత్ర ఎంతవరకు ఉందన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వెంటనే బుల్లెట్ ఆయన మెడను చీలుస్తూ దూసుకెళ్లింది. మెడ ఎడమభాగం నుంచి రక్తం బయటకు చిమ్మింది. తీవ్రంగా గాయపడిన కిర్క్ అక్కడే ప్రాణాలు వదిలాడు.
చార్లీ కిర్క్ అలియాస్ చార్లెస్ జేమ్స్ కిర్క్ 1993 అక్టోబర్ 14న ఇల్లినాయిస్‌లో జన్మించాడు. రాజకీయాల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 2012లో 18 ఏళ్ల వయసులో షికాగోలో టరి్నంగ్ పాయింట్ యూఎస్‌ఏ అనే సంస్థను మరో వ్యక్తితో కలిసి స్థాపించాడు. ఆయనకు భార్య ఎరికా లేన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రంప్ పెద్ద కుమారుడైన డొనాల్ట్ ట్రంప్ జూనియర్‌కు కిర్క్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అంతేకాదు రచయితగా, రేడియో వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందాడు. మీడియా రంగంలోనూ అడుగుపెట్టాడు. టర్నింగ్ పాయింట్ యూఎస్‌ఏ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ అండగా నిలుస్తున్నారు. భారతీయులకు అమెరికా వీసాలు ఇవ్వడాన్ని కిర్క్ పలు సందర్భాల్లో వ్యతిరేకించాడు. అమెరికన్ కార్మికుల స్థానాన్ని భారతీయులు ఆక్రమించుకున్నారని, వారికి ఇక వీసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాడు.