శని. అందమైన వలయాలతో సౌరకుటుంబం మొత్తంలోనూ అత్యంత ప్రత్యేకంగా కన్పించే గ్రహం. అది కాస్తా తాజాగా భారీ మార్పుచేర్పులకు లోనవుతోంది. అంటే మరేమీ లేదు. శని గ్రహం చుట్టూ అందంగా చుట్టుకుని కన్పించే వలయాలు దాదాపుగా ‘మటుమాయం’అయిపోతున్నాయి! ఆదివారం రాత్రి వినువీధిలోకి విహంగవీక్షణం చేసిన ఔత్సాహికులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామం కొట్టొచ్చినట్టుగా కన్పించి ఆశ్చర్యపరిచింది.
అయితే అంతమాత్రాన శని గ్రహానికి నిజంగానే ఏదో ‘శని’దాపురించిందని మనమెవరమూ ఆందోళన పడాల్సిన పనేమీ లేదట! ఎందుకంటే దాని వలయాలు నిజానికి ఎటూ మాయం కాలేదని ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ‘‘అది కేవలం మన దృక్ భ్రాంతి మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం శని భూమికి ఏటవాలు కోణంలో ఉంది. దాంతో దాని తాలూకు వలయాలు భూమి నుంచి కన్పించడం తాత్కాలికంగా దాదాపు అసాధ్యంగా మారింది. మరీ ముఖ్యంగా ఔత్సాహికులు ఉపయోగించే చిన్నాచితకా టెలిస్కోపుల సాయంతో వాటిని చూడటం కనాకష్టం’’అని వారు వివరించారు.
‘రింగ్’క్రాసింగ్!
ప్రస్తుతం భూమి నుంచి చూస్తే శని వలయాలు మాయమైనట్టు కన్పించేందుకు రింగ్ ప్లేన్ క్రాసింగ్‌గా పేర్కొనే అరుదైన దృగ్విషయమే కారణమట. ఈ సమయంలో భూమి సరిగ్గా శని గ్రహం తాలూకు వలయాల తలానికి సమాంతరంగా పయనిస్తుందని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. దాంతో ఈ సమయంలో భూమి నుంచి చూస్తే ఆ వలయాలు పైనుంచో, కిందినుంచో కాకుండా సరిగ్గా ఒక పక్కనుంచి మాత్రమే కన్పిస్తాయి. దాంతో అవక్కడ లేవనే అనిపిస్తుంది.
అదీ సంగతి!
ఎంత రింగ్ క్రాసింగ్ ప్రభావమైనా సరే, అంత పెద్ద శని గ్రహాన్ని పాముల మాదిరిగా చుట్ట చుట్టుకుని ఉండే అందాల వలయాలు కన్పించకుండా పోవడం ఏమిటని అనిపించడం సహజమే. కాకపోతే అందుకు సహేతుకమైన కారణం కూడా లేకపోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘శని వలయాలు ఏకంగా 2.8 లక్షల కిలోమీటర్ల వ్యాసంతో కూడుకుని ఉంటాయి. కానీ అంతా చేస్తే వాటి మందం మాత్రం కేవలం కొన్ని పదుల మీటర్లే! పైగా ఈ దశలో వాటినుంచి భూమికేసి వెలువడే సూర్యరశ్మి కూడా అత్యంత స్వల్పం. వెరసి సుదూరంలో ఉన్న మన భూ గ్రహం నుంచి వాటిని సమాంతరంగా, అంటే ఒక పక్కగా చూసినప్పుడు దాదాపుగా కన్పించవు. దాంతో అవసలు లేవనే అన్పిస్తుంది’’అని వివరించారు.
సమాన వంపు కోణం!
శని అక్షం కూడా భూ అక్షం మాదిరిగానే సరిగ్గా 26.7 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉంటుంది. దీనికి తోడు సూర్యుని చుట్టూ పరిభ్రమించేందుకు శనికి ఏకంగా 29.4 ఏళ్లు పడుతుంది. దాంతో రెండు గ్రహాల పరిభ్రమణ క్రమంలో భూమి నుంచి మనం శని వలయాలను చూసే కోణం విపరీతంగా మారుతూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్నేళ్ల పాటు అవి సాధారణ టెలిస్కోపుల నుంచి కూడా మనకు కొట్టొచ్చినట్టుగా కనువిందు చేస్తాయి. కాకపోతే ప్రతి 13 నుంచి 15 ఏళ్లకోసారి మాత్రం కొంతకాలం పాటు ఇలా అసలు కన్పించకుండా పోతాయి. అసలున్నాయా, లేవా అనిపిస్తాయి. ఈ ఏడాది మార్చి 23న తొలిసారి రింగ్‌ప్లేన్ క్రాసింగ్ జరిగింది. కానీ అది ఉదయం పూట కావడంతో భూమి నుంచి దాదాపుగా కన్పించకుండాపోయింది. తాజాగా ఆదివారం మాత్రం ఈ పరిణామం సాయం సమయంలో జరగడంతో అందరికీ కనువిందు చేసిందన్నమాట. మరో ఐదేళ్లకల్లా, అంటే 2030 నాటికి శని వలయాలు భూమి నుంచి ఎప్పట్లా మళ్లీ పూర్తిస్థాయిలో కనువిందు చేయనున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్


