
మన సౌరకుటుంబంలోకి తరలివచ్చిన తోకచుక్క
భూమి దిశగా గ్రహశకలాలు దూసుకొస్తూ అతిథుల్లా పలకరిస్తుంటాయి. అయితే ప్రచండ వేగంతో రావడంతో భూవాతావరణంలోకి రాగానే మండిపోయి మసైపోతాయి. కానీ దేదీప్యమానంగా వెలిగిపోయే తోకతో మెరుపువేగంతో దూసుకొచ్చే తోకచుక్క ఇందుకు మినహాయింపు. ఆకాశంలో కనిపించినంతసేపు కనువిందు చేయడం దీని ప్రత్యేకత. అలాంటి తోక చుక్క ఒకటి మన సౌరమండలంలోకి అతిథిగా వచ్చిందని నాసా శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు.
దీనికి 3ఐ/అట్లాస్ అని నామకరణం చేశారు. చరిత్రలో ఇప్పటిదాకా సౌరకుటుంబం ఆవలి నుంచి వచ్చిన మూడో కొత్త తోకచుక్క ఇదేనని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిలీలోని రియో హర్టాడో నగరంలో ఏర్పాటుచేసిన ఆస్ట్రరాయిడ్ టెరిస్ట్రియల్ –ఇంపాక్ట్ లాస్ అరైవల్ సిస్టమ్(అట్లాస్) సర్వే టెలిస్కోప్, అమెరికా శాన్‌డీగో కౌంటీలోని పాలమార్ అబ్జర్వేటరీ జ్వికీ టెలిస్కోప్‌లు ఈ తోకచుక్క రాకను జూలై ఒకటో తేదీన కనిపెట్టాయి. ధనస్సు రాశిగా పిలవబడే నక్షత్ర కూటమి వైపు నుంచి ఈ తోకచుక్క మన సౌరకుటుంబం దిశగా వచ్చిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
భూమికెలాంటి ప్రమాదం లేదన్న సైంటిస్టులు
ప్రస్తుతం ఈ తోకచుక్క భూమికి 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇంతదూరం నుంచి వెళ్తుండటంతో దీని కారణంగా భూమికి ఎలాంటి ప్రమాదం లేదని అధ్యయనకారులు తేల్చిచెప్పారు. ఈ తోకచుక్క తన మార్గంలో పయనిస్తూనే సూర్యుని సమీపంగా వెళ్లనుంది. ప్రస్తుతం ఇది సూర్యునికి 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్ 30వ తేదీన ఆదిత్యునికి అతి దగ్గరగా వెళ్లనుంది. కేవలం 21 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి అది తన పథంలో దూసుకుపోనుంది. అంటే అంగారక గ్రహం కంటే కూడా ఇది సూర్యుని సమీపానికి వెళ్లనుంది. సెప్టెంబర్ నెల వరకు ఖగోళ ఔత్సాహికులు ఈ తోకచుక్కను టెలిస్కోప్ సాయంతో చూడొచ్చు.
తర్వాత అది సూర్యుని ఆవలిదిశ వైపుగా వెళ్లడంతో భూమి మీద నుంచి తోకచుక్క సరిగా కనిపించకపోవచ్చు. మళ్లీ డిసెంబర్ తర్వాత కనువిందు చేయనుంది. గతంలో 2017లో ఒక తోకచుక్క, 2019లో మరో తోకచుక్క ఇలా మన సౌరకుటుంబంలోకి అలా అతిథులుగా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. 1ఐ/ఓమువామూ, 2ఐ/బొరిసోవ్ తోకచుక్కల తరహాలోనే ఇది కూడా తోకచుక్కలకు సంబంధించిన మరింత వాస్తవిక సమాచారాన్ని అందించి వెళ్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త తోకచుక్క కావడంతో దీని తోక పొడవు, వెడల్పుల వివరాలు ఇంకా తెలియలేదు. కొత్త తోకచుక్కను సీ/2025 ఎన్1 అనే పేరుతోనూ పిలుస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్