
ఓపెన్ఏఐ తమ ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్ చాట్‌జీపీటీ అట్లాస్(ChatGPT Atlas)ను ఇటీవల విడుదల చేసింది. ఇది గూగుల్ క్రోమ్ (Google Chrome), ఇతర బ్రౌజర్లకు పోటీగా నిలువనుందని కంపెనీ తెలిపింది. చాట్‌జీపీటీ అట్లాస్ ప్రస్తుతం మ్యాక్ ఓఎస్ (యాపిల్ ల్యాప్‌టాప్‌లు) వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలో విండోస్ (Windows), ఐఓఎస్ (iOS - ఐఫోన్), ఆండ్రాయిడ్ (Android) ప్లాట్‌ఫామ్‌ల్లో విడుదల చేయాలని ఓపెన్ ఏఐ యోచిస్తోంది.
ఫీచర్లు, ప్రత్యేకతలు
సాధారణ బ్రౌజర్‌లకు (Google Chrome, Firefox వంటివి) భిన్నంగా అట్లాస్‌ను ఇంటెరాక్షన్ ఏఐ ఆధారంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇది వెబ్‌ను నావిగేట్ చేయడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి చాట్‌జీపీటీని ప్రధాన ఇంటర్‌ఫేస్‌గా ఉపయోగిస్తుంది.
ఇంటిగ్రేటెడ్ చాట్ అసిస్టెంట్
ఈ బ్రౌజర్‌లో వెబ్‌పేజీలోని కంటెంట్‌కు అనుగుణంగా ఎప్పుడైనా చాట్‌జీపీటీని యాక్సెస్ చేసే వీలు కల్పిస్తున్నారు. దీని ద్వారా వినియోగదారులు ఆ పేజీలోని సమాచారాన్ని సారాంశం రూపంలో తెలుసుకోవచ్చు. కొత్త బ్రౌజర్‌లో డేటాను సైతం విశ్లేషించవచ్చని సంస్థ పేర్కొంది.
ఏజెంట్ మోడ్
ఇది అత్యంత విభిన్నమైన ప్రీమియం ఫీచర్. దీని ద్వారా అట్లాస్ వినియోగదారు తరఫున కొన్ని పనులను పూర్తి చేయగలదు. ఉదాహరణకు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం, ఫారమ్‌లను నింపడం, ప్రయాణాల కోసం సెర్చ్ చేయడం లేదా వాటిని ప్లాన్ చేయడం వంటి సంక్లిష్టమైన పనులను ఏఐ ఏజెంట్ నిర్వహిస్తుంది. అయితే ఈ ఫీచర్ చాట్‌జీపీటీప్లస్, ప్రో సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.
బ్రౌజర్ మెమరీ
అట్లాస్ బ్రౌజింగ్ చరిత్ర, గత సంభాషణల వివరాలను గుర్తుంచుకుంటుంది. దీని వల్ల వినియోగదారునికి పనులు మరింత సులభతరం అవుతాయి. ఉదాహరణకు గతవారం చూసిన ఉద్యోగ ప్రకటనలను గుర్తుంచుకొని వాటిని సమ్మరైజ్ చేసి ముందుంచుతుంది. అయితే వినియోగదారు గోప్యతను దృష్టిలో ఉంచుకుని దీన్ని ఆన్/ ఆఫ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
ఏఐ-పవర్డ్ సెర్చ్
ఇది గూగుల్ సెర్చ్ లేదా బింగ్‌కి బదులుగా చాట్‌జీపీసీ సెర్చ్ ద్వారా పనిచేస్తుంది. ఇది సంభాషణాత్మక, సమగ్రమైన, ఏఐ ఆధారిత ఫలితాలను అందిస్తుంది.
ఇదీ చదవండి: వైట్‌హౌస్‌ను కూల్చేస్తున్న ట్రంప్