
అమెరికాలోని వైట్‌హౌస్‌లో 250 మిలియన్ల (సుమారు రూ.2,000 కోట్లు) భారీ వ్యయంతో కొత్త బాల్‌రూమ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా వైట్‌హౌస్ తూర్పు విభాగం (ఈస్ట్ వింగ్)ను పాక్షికంగా కూల్చివేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో తన కలల ప్రాజెక్టుగా భావించే ఈ బాల్‌రూమ్ నిర్మాణం కోసమే ఈస్ట్ వింగ్‌లో కొంత భాగాన్ని కూల్చివేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం వైట్‌హౌస్‌లో అతిపెద్ద హాల్ ‘ఈస్ట్ రూమ్’. దీనిలో సుమారు 200 మంది మాత్రమే కూర్చునే సామర్థ్యం ఉంది. స్టేట్ డిన్నర్‌లు, ఇతర పెద్ద ఈవెంట్లకు ఇది సరిపోవడం లేదని ట్రంప్ చాలాకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అతిథులను, ప్రపంచ నాయకులను వైట్‌హౌస్‌లోనే సౌకర్యవంతంగా ఆహ్వానించడానికి ప్రత్యేకంగా బాల్‌రూమ్ అవసరమని ఆయన తెలిపారు.
తాత్కాలికంగా టెంట్లలో..
స్టేట్ డిన్నర్‌లు వంటి అతిపెద్ద కార్యక్రమాలను గత అధ్యక్షులు తరచుగా వైట్‌హౌస్ దక్షిణ ప్రాంగణంలో (సౌత్ లాన్‌లో) తాత్కాలికంగా వేసిన టెంట్లలో నిర్వహించేవారు. దీనిపై ట్రంప్ అయిష్టంగా ఉన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన కొత్త, సువిశాలమైన 90,000 చదరపు అడుగుల (సుమారు 8,300 చ.మీ.) బాల్‌రూమ్ 1000 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంటుందని, అవసరమైతే భవిష్యత్తులో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం వంటి కార్యక్రమాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించడం లేదని దీన్ని ప్రైవేట్ వ్యక్తుల నుంచి సమకూర్చిన ఫండింగ్ ద్వారా పూర్తి చేస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
ఈస్ట్ వింగ్ కూల్చివేత
ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించిన సమయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొత్త బాల్‌రూమ్ వైట్‌హౌస్‌కు సమీపంలో ఉంటుందని, ఏమీ కూల్చివేతలు ఉండవని తెలిపారు. అయితే నిర్మాణ పనులు ప్రారంభమవగానే ఈస్ట్ వింగ్ ముఖభాగంలో కొంత భాగం కూల్చివేశారు. వైట్‌హౌస్ ఇచ్చిన వివరణ ప్రకారం కొత్త బాల్‌రూమ్ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశ ప్రథమ మహిళ కార్యాలయం వంటి ఆఫీసులు ఉండే ఈస్ట్ వింగ్‌ను కూడా ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని తెలిసింది. ఈస్ట్ వింగ్ సంప్రదాయబద్ధంగా ప్రథమ మహిళ కార్యాలయాలకు, సందర్శకుల ప్రవేశానికి కేంద్రంగా ఉండేది. 1942లో ప్రపంచ యుద్ధం సమయంలో దీనికి రెండో అంతస్తు, బంకర్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట.. H-1B వీసా ఫీజు రద్దు