దేశంలో ధరలు తగ్గుతాయ్‌..! | Indian households are anticipating a notable softening in inflation expectations | Sakshi
Sakshi News home page

దేశంలో ధరలు తగ్గుతాయ్‌..!

Dec 7 2025 12:53 AM | Updated on Dec 7 2025 12:53 AM

Indian households are anticipating a notable softening in inflation expectations

ఆర్‌బీఐ ‘హౌస్‌ హోల్డ్‌ ఇన్‌ఫ్లుయేషన్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌’  సర్వే లో వెల్లడి

ఆహార ద్రవ్యోల్బణం సుమారు మైనస్‌ 5 శాతానికి పడిపోయిన స్థితి 

అక్టోబర్‌ నెలలో కనిష్ట స్థాయి 0.25 శాతానికి చేరిన రిటైల్‌ ద్రవ్యోల్బణం 

బ్యాంకు రుణాలపై వడ్డీ రేటు (రెపో రేటు) తగ్గించిన ఆర్‌బీఐ  

ఆహారం, ఆహారేతర వస్తువులు, ఇళ్ల అద్దెలు, గృహోపకరణాలు, సేవల రంగాల్లో ధరలు తగ్గే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో నిత్యావసరాలు, ఇతర వస్తువులు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయట. ఆహారంతో పాటు ఆహారేతర వస్తువులు, గృహోపకరణాలు, సేవల రంగాల్లో ధరలు గణనీయంగా తగ్గుతాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెపుతోంది. గత అక్టోబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం (కన్సూ్యమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌–సీపీఐ) కనిష్టంగా 0.25 శాతానికి పడిపోవడమే అందుకు ప్రధాన కారణం.

  ఆహార ధరల్లో భారీ తగ్గుదల, జీఎస్‌టీ రేట్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలు, ద్రవ్య విధానంలో ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు మొదలైనవి ద్రవ్యోల్బణాన్ని తగ్గించాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా విడుదల చేసిన ‘హౌస్‌హోల్డ్‌ ఇన్‌ఫ్లుయేషన్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ సర్వే’ కూడా ఇదే విషయాన్ని చెపుతోంది. నవంబర్‌ 1–10 వరకు 19 నగరాల్లో 6,061 కుటుంబాలపై చేసిన ఈ సర్వేలో భవిష్యత్తులో వినియోగదారులపై ధరల ఒత్తిడి మరింత తగ్గుతుందని స్పష్టం చేసింది. 

ప్రస్తుత ద్రవ్యోల్బణంపై కుటుంబాల మధ్యస్థ అంచనా సెప్టెంబర్‌తో పోలిస్తే 80 బేసిస్‌ పాయింట్లు తగ్గి 6.6 శాతానికి చేరింది. రాబోయే మూడు నెలలలో ధరలు పెరుగుతాయన్న భావన 7.6 శాతానికి, ఒక సంవత్సర అంచనా 8 శాతానికి పడిపోయింది. సర్వే సందర్భంగా భిన్న వయసు్కలు, వివిధ ఆదాయ స్థాయి, వృత్తులకు సంబంధించిన వర్గాల్లో కూడా ధరలపై ఒత్తిడి తగ్గిన భావన స్పష్టంగా కనిపించిందని ఆర్‌బీఐ పేర్కొంది. ధరల పట్ల ఎక్కువ సున్నితంగా స్పందించే గృహిణులు, పింఛనుదారుల్లోనూ ఇదే ధోరణి కనిపించడం విశేషం. ఇది వినియోగదారుల విశ్వాసం పెరుగుతున్న సంకేతంగా ఆర్‌బీఐ పేర్కొంది. 

ఆహార ధరలే సీపీఐ తగ్గుదలకి కారణం 
అక్టోబర్‌ నెలలో ఆహార ద్రవ్యోల్బణం సుమారు –5% వరకు పడిపోవడం సీపీఐ తగ్గుదలకి ప్రధాన కారకంగా నిలిచింది. కూరగాయలు, ఉల్లిపాయలు, పప్పులు, ధాన్యాలు, నిత్యావసర పదార్థాల ధరలు మార్కెట్‌లో గణనీయంగా తగ్గాయి. సరఫరా మెరుగుదల, రవాణా ఖర్చుల తగ్గుదల, వరుసగా మంచి పంటలు రావడం వంటి అంశాలు ఈ తగ్గుదలకి దోహదపడ్డాయి. 

అలాగే సెపె్టంబర్‌ చివరి వారం నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ రేట్ల సవరణలు వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనాన్ని అందించాయి. ప్యాకేజ్డ్‌ ఫుడ్స్, దినసరి వినియోగ వస్తువులు, గృహోపకరణాలపై పన్ను రేట్లు తగ్గించడంతో మార్కెట్లో ధరలు తగ్గాయి. జీఎస్‌టీ స్లాబ్‌ సులభతరం చేయడం వల్ల వ్యాపారులపై ఉండే పన్ను భారం తక్కువై, దాని ప్రభావం రిటైల్‌ ధరలపై పడింది.

ఆర్‌బీఐ–ఎంపీసీ చర్యలతో వృద్ధికి ఊపిరి
ద్రవ్యోల్బణం కనిష్టానికి తగ్గడంతో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఇటీవల రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తీసుకువచి్చంది. రెపో రేటు తగ్గడంతో బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తక్కువ వడ్డీకి నిధులు పొందగలుగుతాయి. ఫలితంగా, గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యాపార రుణాలు కూడా తక్కువ వడ్డీకి లభించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 వడ్డీ రేట్ల స్థాయిలు తగ్గడం ఆర్థిక వృద్ధికి అవసరమైన వినియోగ వ్యయాలను పెంచుతుందని ఆర్‌బీఐ అభిప్రాయపడుతోంది. 2 శాతం నుంచి 3 శాతం మధ్యలో ద్రవ్యోల్బణం ఉండడం, 8 శాతం వృద్ధి సాధ్యమవుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు అరుదైన బంగారు దశగా చెపుతోంది. కనిష్ట ద్రవ్యోల్బణం మరిన్ని విధాన సడలింపులకు వీలు కల్పిస్తుందని పేర్కొంది.

పట్టణ, గ్రామీణ వినియోగదారుల్లో ఆశావాదం .. 
ఆర్‌బీఐ నిర్వహించిన ‘కన్సూ్యమర్‌ కాని్ఫడెన్స్‌ సర్వే’ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ‘ప్రస్తుత పరిస్థితి సూచీ’ కూడా  96.9 నుంచి 98.4కి మెరుగుపడినట్లు ఆర్‌బీఐ తెలిపింది. భవిష్యత్తులో ధరలు పెద్దగా పెరగవని భావించే కుటుంబాల సంఖ్య పెరగడంతో ‘ఫ్యూచర్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఇండెక్స్‌’ కూడా స్వల్పంగా పైకి రాగా,  గ్రామీణ ప్రాంతాల్లోనూ భవిష్యత్తుపై వినియోగదారుల నమ్మకం పెరిగిందని తెలిపింది. 

ప్రస్తుత ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో తగ్గడం, జీఎస్‌టీ ప్రభావం, సరఫరా పరిస్థితుల మెరుగుదల, ఆర్‌బీఐ విధానాలు... ఇలా అన్నీ కలిసి రాబోయే నెలల్లో ధరలు మరింత తగ్గుతాయన్న సంకేతాలనిస్తున్నాయి. దేశంలోని సగటు కుటుంబాలు కూడా ఇదే అంచనాతో ముందుకు సాగుతున్నట్లు ఆర్‌బీఐ చెపుతోంది. ఆహార వస్తువుల సరఫరా స్థిరంగా కొనసాగితే, నిత్యావసరాల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement