అమెరికా 50% సుంకాల విధింపు ప్రభావం
అక్టోబర్‌లో 11.8% క్షీణత
క్రిసిల్ నివేదిక వెల్లడి
కోల్‌కతా: భారతీయ ఉత్పత్తుల (మర్చండైజ్) ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన అక్టోబర్‌లో 11.8% తగ్గి 34.38 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇది 14 నెలల కనిష్ట స్థాయని క్రిసిల్ నివేదిక తెలిపింది. భారతీయ ఎగుమతులపై అమెరికా 50% సుంకాల విధింపు అగస్టు 27 నుంచి అమల్లోకి రావడంతో వరుసగా రెండో నెలా ఎగుమతులు మందగించినట్లు నివేదిక పేర్కొంది. పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలు, రత్నాభరణాలతో పాటు ప్రధాన రంగాల ఎగుమతులు అన్నింటిలోనూ క్షీణత కనిపించింది. నివేదికలో మరిన్ని అంశాలు...
→ వార్షిక ప్రాతిపదికన అక్టోబర్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 10.4% తగ్గాయి. అయితే సెపె్టంబర్‌తో పోలిస్తే 15.1% వృద్ధి నమోదైంది. ప్రధాన ఎగుమతుల్లో వార్షిక ప్రాతిపదికన 10.2% క్షీణత, నెలవారీగా పోలిస్తే 6.1% వృద్ధి నమోదైంది.
→ అమెరికాకు మర్చండైజ్ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 8.6% తగ్గి 6.3 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. అయితే సెపె్టంబర్‌లో మాత్రం 11.9% వృద్ధి నమోదైంది. అమెరికాయేతర మార్కెట్లకు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 12.5% తగ్గాయి. సెపె్టంబర్‌తో పోలిస్తే 10.9% వృద్ధి నమోదైంది.
→ అమెరికాలో ఆహార రేట్లు అధికంగా పెరిగన నేపథ్యంలో దాదాపు 254 ఆహార వస్తువులపై సుంకాలను తగ్గిస్తూ నవంబర్ 16న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేయడంతో రానున్న రోజుల్లో టీ, మసాల వంటి భారతీయ వ్యవసాయ ఎగుమతులకు కలిసొచ్చే అవకాశం ఉంది.
→ సేవల వాణిజ్యం, రెమిటెన్సులు పెరగడం, ముడిచమురు ధరలు తగ్గడంతో కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) అదుపులో ఉంటుందని క్రిసిల్ భావిస్తోంది. భారతీయ ఉత్పత్తుల (మర్చండైస్) దిగుమతులు ఈ అక్టోబర్‌లో 76.06 బిలియన్ డాలర్లతో స్థిరంగా ఉన్నట్లు క్రిసిల్ నివేదిక పేర్కొంది.


