అక్టోబర్‌లో మూడింతలు అధికం
1.47 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్‌కు భారత్ నుంచి అక్టోబర్‌లో భారీగా స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు కొనసాగాయి. 2024 అక్టోబర్‌లో యూఎస్‌కు 0.46 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్లు ఎగుమతి కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో ఏకంగా 1.47 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు (7 నెలలు) 10.78 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది.
సరిగ్గా క్రితం ఆర్థిక సంతవ్సరం మొదటి ఏడు నెలల్లో ఎగుమతులు 3.60 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ఏప్రిల్‌లో 1.65 బిలియన్ డాలర్లు, మే నెలలో 2.29 బిలియన్ డాలర్లు, జూన్‌లో 1.99 బిలియన్ డాలర్లు, జూలైలో 1.52 బిలియన్ డాలర్లు, ఆగస్ట్‌లో 0.96 బిలియన్ డాలర్లు, సెపె్టంబర్‌లో 0.88 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు భారత్ నుంచి అమెరికాకు వెళ్లాయి. డిమాండ్, ధరలపై టారిఫ్ అనిశ్చితులు నెలకొన్నప్పటికీ స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు పెరగడం గమనార్హం.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు 15.95 బిలియన్ డాలర్లకు పెరిగాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి 10.68 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. అంటే 49 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. టారిఫ్‌లకు సంబంధించి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు వృద్ధి చెందడం భారత్‌కు ఉన్న వ్యూహాత్మక అనుకూలతలను తెలియజేస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ల దిగ్గజాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడంతోపాటు, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాలను ప్రస్తావించారు.


