నిర్వహణ ఆస్తులు రూ.2.5 లక్షల కోట్లు
ఏడాది కాలంలో 13 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం చూపిస్తుండడంతో అక్టోబర్ చివరికి నాటికి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు (ఏయూఎం) రూ.2.5 లక్షల కోట్లకు చేరాయి. ఏడాది కాలంలో ఏయూఎం విలువ 13 శాతం పెరిగింది. 2024 అక్టోబర్ చివరికి వీటి విలువ రూ.2.21 లక్షల కోట్లుగా ఉంది.
ఈక్విటీ సూచీలు ఏడాదికి పైగా దీర్ఘకాలం పాటు దిద్దుబాటును చవిచూసిన కాలంలో అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఆస్తులు పెరగడం అన్నది.. ఇన్వెస్టర్లు ఈక్విటీ, హైబ్రిడ్‌తో కలయిక ద్వారా పెట్టుబడుల వృద్ధితోపాటు స్థిరత్వానికి ప్రాధాన్యం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ నిర్వహణలోని ఫోలియోలు ఏడాది కాలంలో 4 లక్షలు పెరిగి అక్టోబర్ చివరికి 60.44 లక్షలకు చేరాయి. 2024 అక్టోబర్ చివరికి ఇవి 56.41 లక్షలుగా ఉన్నాయి. ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే సంఖ్యను ఫోలియోగా చెబుతారు. ఇలా ఒకే ఇన్వెస్టర్‌కు ఒకటికి మించిన పథకాల్లో ఫోలియోలు ఉండొచ్చు.
మెరుగైన రాబడులు
అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ బలమైన రాబడులు ఇస్తుండడం కూడా ఇన్వెస్టర్లు వీటిల్లో మరింత పెట్టుబడులకు ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విభాగం గత ఏడాది కాలంలో 7 శాతం చొప్పున సగటు రాబడినివ్వగా, రెండేళ్లలో 16.5 శాతం (వార్షిక) చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టాయి. ఐదేళ్ల కాలంలోనూ 17 శాతం రాబడినిచ్చాయి. రెండు, ఐదేళ్ల కాలాల్లో నిఫ్టీ 50 హైబ్రిడ్ కాంపోజిట్ డెట్ 65:35 ఇండెక్స్‌ను అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ పనితీరు పరంగా అధిగమించినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఈ విభాగంలో పనితీరు పరంగా ముందుంది.
రెండేళ్లలో ఏటా 19.6 శాతం చొప్పున కాంపౌండెడ్ రాబడిని ఇచ్చింది. ఐదేళ్లో అయితే ఏటా 24.7 శాతం రాబడి తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మహీంద్రా మాన్యులైఫ్ అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ రెండేళ్ల కాలంలో ఏటా 19.3 శాతం, ఐదేళ్లలో ఏటా 20.4 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడిని అందించింది. బంధన్, ఎడెల్‌వీజ్, ఇన్వెస్కో ఇండియా అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ సైతం రెండేళ్ల కాలంలో ఏటా 18–19% మధ్య, ఐదేళ్లలో ఏటా 16.5–19.9% మధ్య ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్, మహీంద్రా మాన్యులైఫ్ అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ ఇక మీదటా దీర్ఘకాలంలో మెరుగైన పనితీరు చూపించగలవని విశ్లేషకుల అంచనా.
భవిష్యత్తులో మరింత డిమాండ్..
‘‘ఈక్విటీ–డెట్ కలయికతో ఉంటాయి కనుక రెండు విభాగాల నుంచి ఈ ఫండ్స్ ప్రయోజనం పొందుతాయి. బలమైన విభాగంగా బ్యాలన్స్‌డ్ ఫండ్స్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈక్విటీ విభాగంలో హెచ్చుతగ్గులు ఉన్న కాలంలో డెట్ పెట్టుబడులు రాబడులకు రక్షణ కల్పిస్తాయి. ఈక్విటీ పెట్టుబడులు వృద్ధిని చూస్తున్న తరుణంలో మంచి రాబడులను సొంతం చేసుకుంటాయి. మధ్యస్థ లేదా తక్కువ రిస్క్ తో కూడిన ఇన్వెస్టర్లకు ఇవి ఎంతో అనుకూలం’’అని మావెనార్క్ వెల్త్ సీఈవో శంతను అవస్థి తెలిపారు. సెబీ నిబంధనల ప్రకారం అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో 65–80 శాతం మధ్య ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.


