ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు సక్సెస్ అయిందా?లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి ఇరవై లక్షల ఉద్యోగాల నుంచి ఏకంగా ఐదేళ్లలో ఏభై లక్షల ఉద్యోగాలు టార్గెట్‌గా పెట్టినట్లు ప్రకటించడం ఆసక్తికరమైన అంశమే. అంతేకాదు. పదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని ఆయన తెలిపారు. వినడానికి విడ్డూరంగా ఉంటుంది. అలా మాట్లాడడమే ఆయన సక్సెస్ మంత్ర అనుకోవాలి. భారీగా అంకెలు, గణాంకాలు చెబితే అది అసత్యమైనా నమ్మేవారు కూడా ఉంటారు.
పదిహేనేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇంతవరకు ఎందుకు ఆ స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేకపోయారన్న అనుమానం రావచ్చు. కాని ఎప్పటికప్పుడు కొత్త అంకెలు చెబుతూ ఏదో జరుగుతోంది అని భ్రమ కల్పించడమే ఇందులోని లక్ష్యమన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో కీలకంగా మారిన మంత్రి లోకేష్ వచ్చే మూడేళ్లలో విశాఖలోనే ఐదు లక్షల ఐటి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. తండ్రి బాటలోనే ఆయన కూడా పయనిస్తున్నట్లు అనించడం లేదూ! ఈ సమ్మిట్ లో మొత్తం మీద పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇవన్ని వినడానికి ఎంత బాగుంటాయి. నిజంగానే వాస్తవ రూపం దాల్చితే ఎంత మంచిగా ఉంటుంది అనిపిస్తుంది!
గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పారిశ్రామిక సదస్సు జరిగినా చంద్రబాబు నాయుడి ఏకపాత్రాభినయం అధికంగా కనిపించేది. ఈ సారి సదస్సులో కొంత మార్పు కనిపించింది. అదేమిటంటే చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ఈ సదస్సులో ప్రముఖంగా మారారు. అంటే ఈ విడత వీరిద్దరూ కలిసి షో నిర్వహించారన్న అభిప్రాయం ఆయా వర్గాలలో కలిగింది. దీనిని పెద్దగా తప్పు పట్టనవసరం లేదు. నిజంగానే టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేసినట్లుగా ఈ పెట్టుబడుల సదస్సు సూపర్ హిట్ అయినా, పండగలా జరిగినా సంతోషించవచ్చు. కాని ఎప్పుడు ఇలాంటి సదస్సులు సఫలం అయినట్లు అంటే ఈ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చినప్పుడే అన్న సంగతి గుర్తుంచుకోవాలి.
ఈ ఒప్పందాలన్నిటిని మూడున్నరేళ్లలోనే ఆచరణలోకి తెస్తామని చంద్రబాబు తెలిపారు. ఆయన చెప్పిన రీతిలో జరిగితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అలా చేస్తే ఆయనకు భారీ ఎత్తున సన్మానం చేయవచ్చు. కాని గత అనుభవాల రీత్యా చూసినా, వాస్తవాల ప్రకారం పరిశీలించినా అదంత తేలికైన సంగతి కాదు. ఉదాహరణకు ఒక సంస్థ పెట్టుబడి ప్రతిపాదన చేసిన తర్వాత ఏంతో ప్రాసెస్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా చర్యలు తీసుకున్నా, అదొక్కటే సరిపోదు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పారిశ్రామికవేత్తకు ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయవచ్చని, ఒక పోన్ కాల్ దూరంలోనే ఉంటానని భరోసా ఇచ్చే యత్నం చేసేవారు. ఆయన టైమ్‌లో పలు పరిశ్రమలు కూడా వచ్చాయి.
రెన్యుబుల్ ఎనర్జీలో రికార్డు స్థాయిలో సుమారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో కొన్ని పనులు కూడా ఆరంభించాయి. అయినా చంద్రబాబు మాత్రం గతంలో పరిశ్రమలను తరిమేశారని అంటూ అబద్దాన్ని చెప్పడాన్ని మానుకోవడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని తెలిసినా, అలాంటి వ్యాఖ్యలను పారిశ్రామికవేత్తల ముందు చేయడానికి వెనుకాడకపోవడం దురదృష్టకరం. అంటే వచ్చేసారి వైఎస్సార్‌సీపీ గెలిస్తే ఎలా అని పెట్టుబడిదారులలో ఉన్న సందేహం అంటూ ఇప్పటికే పలుమార్లు ప్రచారం చేశారు. దీనిని పారిశ్రామికవేత్తలు నమ్మితే ఇప్పుడు పెట్టుబడులు ఎందుకు పెడతారు అంతేకాదు.. ప్రముఖ పారిశ్రామికేత్త జిందాలపై తప్పుడుకేసు పెట్టి వేధించే యత్నం కూటమి సర్కార్ చేసిందా?లేదా?
ఆయన ఏపీకి రాకుండా మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడి పెట్డడానికి ఎందుకు సిద్ధమయ్యారు. లోకేష్ విరచిత రెడ్ బుక్ ప్రబావం గురించి పారిశ్రామికవేత్తలకు తెలియదా! నిజానికి చంద్రబాబు టైమ్‌లో వచ్చిన పరిశ్రమలకన్నా అధికంగా జగన్ టైమ్ లోనే గ్రౌండ్ అయ్యాయి. రెండేళ్ల కరోనా సంక్షోభం వచ్చినా అనేకమంది పారిశ్రామికవేత్తలను ఆయన ఏపీకి రప్పించగలిగారు. జగన్ ప్రభుత్వ టైమ్‌లో జరిగిన సమ్మిట్ లో రిలయన్స్ ముకేష్ అంబానీ వచ్చి భారీ పెట్టుబడిని ప్రతిపాదించారు. జగన్ చెంతనే కూర్చుని సదస్సుకు నిండుదనం తెచ్చారు. మరి ఇప్పుడు అంబానీ ఎందుకు రాలేదో తెలియదు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమ్మిట్‌లో పాల్గొనకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పట్లో ఆదిత్య మిట్టల్, నవీన్ జిందాల్, బివిఆర్ మోహన్ రెడ్డి, భంగర్, కరణ్ అదానీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు టీడీపీ కూటమి హయాంలో జరిగిన సమ్మిట్‌లో కరణ్ అదాని తప్ప మిగిలిన ప్రముఖులు పలువురు ఎందుకు రాలేదో తెలియదు. కరణ్ అదాని తన ప్రసంగంలో ఏమి చెప్పారు?. విశాఖలో వస్తున్నది అదాని డేటా సెంటర్ అని, దానికి గూగుల్ భాగస్వామి అవుతోందని ప్రకటించారా?లేదా? దానిపై చంద్రబాబు, లోకేష్‌లు కిమ్మనలేకపోయారే? ఆదాని డేటా సెంటర్ తో పాటు ఐటి బిజెనెస్ సెంటర్ కు ఆనాడు జగన్ శంకుస్థాపన చేసిన సంగతి విస్మరించి, అంతా గూగుల్ డేటా సెంటర్ అనుకోవాలని ప్రయత్నించి భంగపడడం ప్రభుత్వానికి ఏ పాటి మర్యాద అవుతుంది.
ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లిఖార్జునరావు తదితరులు అప్పుడూ వచ్చారు. ఇప్పుడూ వచ్చారు. 2014-19 టరమ్‌లో కూడా చంద్రబాబు సదస్సులు నిర్వహించారు. ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు, నలభై లక్షల ఉద్యోగాలు వస్తాయని తెగ ప్రచారం చేశారు. ఆ పెట్టుబడుల ప్రగతి గురించి చంద్రబాబు ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించి, తదుపరి మళ్లీ ఏభై లక్షల ఉద్యోగాలు అన్నా, కోటి ఉద్యోగాలు అన్నా జనం నమ్ముతారు. అంతే తప్ప ప్రజలను మభ్య పెట్టడం కోసం ఇలా లక్షల ఉద్యోగాలు అని చెబితే చివరికి కూటమి ప్రభుత్వానికే నష్టం అన్న సంగతి మర్చిపోకూడదు.
కాకపోతే ఎప్పటి ప్రచారం అప్పటికే అన్నట్లుగా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తుంటారు. గతంలో జగన్ టైమ్‌లో రెన్యూ పవర్, హీరో ఫ్యూచర్స్, ఎనర్జీస్, వంటి కొన్ని సంస్థలు సుమారు మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు చేశాయి. మళ్లీ అవే ఒప్పందాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా తిరిగి కుదుర్చుకుందన్న వార్తలు వచ్చాయి. ఈ ఏడాదిన్నర కాలంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు చెప్పడం ఆరంభించారు. చంద్రబాబు స్టైల్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇప్పుడు దానినే లోకేష్ కూడా ఫాలో అవుతున్నారు.
ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు బ్రాండ్ చూసి పరిశ్రమలవారు తరలి వచ్చేస్తారని టీడీపీ నేతలు చెబుతుంటారు. తీరా చూస్తే ఆ బ్రాండ్ విలువ ఎంతో తెలియదు కాని, విశాఖ వంటి కీలకమైన ప్రాంతంలో ఎకరా 99 పైసలకే కంపెనీలకు లీజుకు ఇవ్వవలసి వస్తోంది. వేల కోట్ల రాయితీలు ఇచ్చి పారిశ్రామికవేత్తలను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాలవారు చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబు అని, ఈ పద్దతి వల్ల రాష్ట్రాలు ఆర్థికంగా విధ్వంసం అవుతాయని చెప్పుకుంటున్నారని ఒక వ్యాసకర్త పేర్కొన్నారు. చంద్రబాబులో ఉన్న విశిష్టత ఏమిటంటే తాము చేస్తే అది ప్రజలకు ఉపయోగం, ఎదుటివారు చేస్తే విధ్వంసం అని ప్రచారం చేస్తుంటారు.
ఉదాహరణకు రిషికొండపై జగన్ అద్బుతమైన రీతిలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే పర్యావరణం దెబ్బతిన్నదని విషం చిమ్మారు. రిషికొండను గుండు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు అవే కొండలను ప్రైవేటు కంపెనీలకు ఇస్తామని, సముద్రం ఎదురుగా ఉండే ఈ కొండలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయని చెబుతున్నారు. ఇలా ఉంటుంది ఆయన తీరు. ఏది ఏమైనా ఈ సమ్మిట్ లోకేష్ కు మంచి ఎలివేషన్ ఇచ్చుకోవడానికి బాగానే ఉపయోగపడిందని అనుకోవచ్చు.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


