శ్రీకాకుళం జిల్లా: గోదారి గట్టంత కాకపోయినా సిక్కోలు తీరంలోనూ అక్కడక్కడా సంక్రాంతికి పందెం కోళ్లు తలపడుతుంటాయి. ఈ కోళ్ల పందాలే కాదు.. ఈ పుంజులను పెంచే తీరు కూడా చాలా ప్రత్యేకం. వేకువ జామున నది, కాలువల్లో ఈత కొట్టించి, ప్రత్యేక వ్యాయామం చేయించి, బాదం పిస్తా పెట్టి పెంచుతారు. సాధారణ దాణాతో పాటు బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం తప్పని సరి. రాగులు, బియ్యం, పాలిష్ తవుడు రెండుసార్లు, దినుసులు, నూకలు, అన్నం బాగా కలిపి గోధుమలతో సిద్ధం చేసి రోజుకు ఐదారుసార్లు తినిపిస్తారు. అలాగే దాణా పెట్టిన ప్రతిసారి బాదం, జీడి పప్పు పెడతారు.
బొబ్బిలి సెంటిమెంట్
పౌరుషానికి ప్రతీకంగా భావించే బొబ్బిలిని ఇక్కడ పందెందార్లు సెంటిమెంట్‌గా భావిస్తారు. అక్కడ గుడ్లను తీసుకువచ్చి ఇక్కడ పొదిగిస్తారు. పండక్కి ఒక పది నెలలు ముందుగా పక్కా ప్రణాళిక ప్రకా రం చేస్తారు. పుట్టిన పుంజులను ఎంతో శ్రద్ధతో పెంచి పందెంకోళ్లుగా తీర్చి దిద్దుతారు. బలిష్టంగా తయారవ్వడాని వాటికి ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరి.
ఈ జాతికే డిమాండ్..
కోడి పందాలను రెండు రకాలుగా పెడతారు. అందులో మొదటిది కాళ్లకు కత్తి కట్టి పందానికి దించితే పందెం ప్రారంభం నుంచి 20 నిమిషాలకు ముగు స్తుంది. రెండోది ‘డెంకీ’ ఈ పందెంలో కాళ్లకు కత్తి లేకుండా నేరుగా పుంజుకు పుంజుకు పోటీకి ఉసిగొల్పుతారు. ఇందులో రూ.లక్షలు పందెం కాసి, గంటలు కొద్దీ పందాలు జరుపుతారు. కాకి, డేగ, కాకి నెమలి, పింగళి, నెమలి, కాకిడేగ, కక్కిరి, పాసి వంటి జాతులకు డిమాండ్ బట్టి రూ.ఐదు వేలు నుంచి లక్ష వరకూ ఇస్తారు. నదీ తీర ప్రాంతాలతోపాటు కొండపక్కల ఉన్న గ్రామాల్లో పందెందార్లు ప్రస్తుత కోళ్లను సిద్ధం చేస్తున్నారు. నరసన్నపేట మండలం లుకులాం, అంబాజీపేట, జలుమూరు మండలం మాకివలస, పర్లాం, చెన్నా యవలస, సారవకోట మండలం బొంతు, పోలాకి మండలం గంగివలస, సరుబుజ్జిలి మండలం యరగాం, పెద్దసవలాపురం, తెలికిపెంట తదితర గ్రామాలలో ఈ కోళ్ల పెంపకం జరుగుతుంది.


