‘డయేరియాతో ప్రజలు చనిపోతే.. అమరావతిలో కబడ్డీ ఆడుతున్నారా?’ | YSRCP Dharmana Prasad Rao Serious Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

‘డయేరియాతో ప్రజలు చనిపోతే.. అమరావతిలో కబడ్డీ ఆడుతున్నారా?’

Feb 25 2026 12:12 PM | Updated on Feb 25 2026 1:30 PM

YSRCP Dharmana Prasad Rao Serious Comments On CBN Govt

సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నేతల బృందం పర్యటించింది. ఈ సందర్బంగా డయేరియా మరణాలను దాచాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రజారోగ్యం కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత కాదా? అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి తాగు నీరు ఇవ్వలేరా? అని మండిపడ్డారు. శ్రీకాకుళంలో డయేరియా ప్రభావిత ప్రాంతం దమ్మల వీధిలో వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు.. బాధితులతో మాట్లాడారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనంతరం, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..‘డయేరియా మరణాలను ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ఈ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. అన్ని రంగాలను వదిలేసి డబ్బులన్నీ రాజధాని పేరుతో అమరావతిలో పెడుతున్నారు. శ్రీకాకుళం ఆసుపత్రిలో ఒక్క ట్యాబ్లెట్ కూడా లేదు. ఏమీ లేకపోయినా ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు.రాష్ట్రంలో వెనకబడిన వర్గాలు ఏడుస్తున్నారు. రైతులను దళారీలు దో చేస్తున్నా అడిగేవాడే లేడు. గార మండలంలో ఇసుక తవ్వేస్తున్నారు. అక్కడ కూడా డయేరియా వచ్చే అవకాశం ఉంది. నీరు ఎర్రగా వస్తుంది.

మున్సిపల్ కార్యాలయాన్ని ప్రైవేటు కార్యాలయంగా మార్చేశారు. మంచి ప్రభుత్వం అని స్టిక్కర్ డోర్‌కు అంటించడం కాదు ప్రజల హృదయాల్లో ఉండాలి. కింది స్థాయి పరిపాలనా వ్యవస్థను గాలికి వదిలేశారు. వెనుకబడిన ప్రాంతాల హక్కులని ఈ ప్రభుత్వం తొక్కేస్తుంది. ప్రజలు వెంటాడి మరీ ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారు. ప్రజల ఆవేదన తీవ్ర రూపం దాల్చబోతుంది. నలుగురు చనిపోతే.. ఒక్కరే చనిపోయారని చెప్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మరణాలను దాస్తున్నారు. ప్రజల ఆగ్రహం చూడబోతున్నారు.. ఆరోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం మేల్కొవాలి’ అని హితవు పలికారు. 

మాజీ మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ..‘శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి కారణం ప్రభుత్వ వైఫల్యమే. నలుగురు చనిపోవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్యం. డయేరియా ప్రబలిందని ఈ నెల 23వ తేదీన మీడియా చెబుతుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు అమరావతిలో కబడ్డీ ఆడుకుంటున్నారు. నలుగురు చనిపోతే అది.. డయేరియా వలన కాదని ప్రభుత్వం తప్పించుకుంటుంది. మున్సిపల్ వాటర్ నీరా? విషమా? అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఓట్లు వేసిన పాపానికి ప్రజలకు మంచి నీళ్లు కూడా ఇవ్వని దుస్థితి ఏర్పడింది. ఇవి డయేరియా మరణాలు కాదు.. ప్రభుత్వం హత్యలుగా గుర్తించాలి. విజయనగరం, విజయవాడలో డయేరియా మరణాలు సంభవించాయి. ఇప్పుడు శ్రీకాకుళంలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి.

మున్సిపాలిటీలో మెడికల్ ఆఫీసర్‌ ఎక్కడ?. అధికారులు అందుబాటులో లేకపోతే ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పడకేసింది. తలుపు, తాళం వేసిన శాఖకు ఒక మంత్రి. ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తామని సీఎం చెబుతున్నారు. ముందు ఇంటింటికి మంచి నీళ్లు ఇవ్వండి. మృతుని కుటుంబ సభ్యులకి 25 లక్షల పరిహారం ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement