గంటల తరబడి స్క్రీన్లకు అతుక్కుపోతున్న పిల్లలు
ఆరుబయట ఆడుకోవాల్సిన వయసులో వీడియో గేమ్స్
దీంతో శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు
ఆందోళన కలిగిస్తోన్న అంతర్జాతీయ పరిశోధనల ఫలితాలు
బడి ఈడు పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు సర్వ సాధారణమయ్యాయి. ఆరుబయట ఆడుకోవాల్సిన వయసులో వీడియో గేమ్స్, షార్ట్ వీడియోలు, కొరియన్ సిరీస్‌లకు బానిసలవుతున్నారు. వేల గంటలు స్క్రీన్ల ముందు గడిపిన పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఊబకాయం, నిద్రలేమి, దృష్టి సమస్యలు వస్తున్నాయి. మాట్లాడడం, అర్థం చేసుకోవడం, పదాల వాడుక ఆలస్యం కావడం, శ్రద్ధ, ఆందోళన, నిరాశ వంటి ప్రవర్తనతోపాటు నలుగురిలో కలవలేకపోతున్నారు. ఫలితంగా పిల్లల్లో ఎదుగుదల సమస్యలు కూడా వస్తున్నాయి. వివిధ అధ్యయన ఫలితాలు సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
వినోద వేదికలయ్యాయి..
జ్ఞానం, నైపుణ్యం పెంపొందించుకోవడం, అభ్యసన విషయంలో సాయం కోసం బడి పిల్లలు స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ పీసీ, ల్యాప్‌టాప్/పీసీ వాడుతున్నారు. అయితే ఇంతవరకు వాడితే ఏ సమస్యా లేదు. కానీ ఈ ఉపకరణాలు పిల్లల వినోద వేదికలు అయ్యాయి. చదువును పక్కనబెట్టి గంటల తరబడి వీటికి అతుక్కుపోతున్నారు. భారతీయ పిల్లలు నిర్ధేశిత సమయం కంటే చాలా ఎక్కువ గంటలు స్క్రీన్ ముందు గడుపుతున్నారని ఎయిమ్స్ రాయ్‌పూర్ పరిశోధనలో తేలింది.
ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ప్రతిరోజూ సగటున 2.22 గంటలు స్క్రీన్ల ముందు గడుపుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) వంటి సంస్థలు నిర్ణయించిన సురక్షిత పరిమితి కంటే ఇది రెండింతలు. రెండేళ్లలోపు పిల్లలైతే సగటున 1.23 గంటల సమయం వెచి్చస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ, ఐఏపీ ప్రకారం ఈ వయసు పిల్లలు స్క్రీన్లకు పూర్తిగా దూరంగా ఉండాలి.
⇒ జపాన్‌లోని ఫుకూయీ విశ్వవిద్యాలయ పరిశోధకులు అడాలసెంట్ బ్రెయిన్ కాగి్నటివ్ డెవలప్‌మెంట్ అధ్యయన డేటాను విశ్లేషించారు. ఎక్కువ సమయం స్క్రీన్ల ముందు కాలక్షేపం చేసే పిల్లల్లో.. జ్ఞాపకశక్తి, ప్రణాళిక, ప్రేరణను నియంత్రించే పెద్ద మెదడులోని బయటి ప్రాంతం (కారి్టకల్) సన్నబడిందని తేల్చారు. యూఎస్‌లో 9–12 సంవత్సరాల వయసు గల 10,116 మంది పిల్లల ఎంఆర్‌ఐల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. అటెన్షన్–డెఫిసిట్/హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) ఉన్న పిల్లలలో కనిపించే మెదడు లక్షణాలు వీరిలోనూ ఎదురయ్యాయి.
⇒ డిజిటల్ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం వెచి్చంచే పిల్లల్లో గుండె సమస్యల ముప్పు పొంచి ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. స్క్రీన్ వాడకం ప్రతి గంట పెరగడం వల్ల.. ముఖ్యంగా నిద్ర సరిపోనప్పుడు కార్డియోమెటబోలిక్ ప్రమాదం అధికమవుతుందని తెలిపింది.
⇒ పిల్లలు, కౌమార దశలో ఉన్నవారిలో జీవనశైలి, కళ్లు, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఊబకాయం, నిద్ర రుగ్మతలు, కళ్లు పొడిబారడం వంటి అత్యంత సాధారణ సమస్యలు స్వల్ప కాలంలో ఎదురవుతున్నాయి. దీర్ఘకాలంలో రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, మయోపియాతోపాటు ఈ దుష్ఫలితాల ప్రభావం మానసిక ఆరోగ్యానికి కూడా విస్తరిస్తోందని క్యూరియస్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ తెలిపింది. ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపడానికి, ఆందోళన, నిరాశ, ప్రవర్తనా సమస్యల మధ్య స్పష్టమైన సంబంధం ఉందని వెల్లడించింది.
⇒ పిల్లల్లో భావోద్వేగ, ప్రవర్తనా సమస్యలు తలెత్తవచ్చు. ఈ సమస్యలు మరింత సమయం స్క్రీన్ వాడకానికి దారితీయొచ్చని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రచురించిన పరిశోధనలో తెలిపింది. అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిర్వహించిన ఈ అధ్యయనం ప్రపంచ వ్యాప్తంగా 2,92,000 మందికిపైగా పిల్లల నుంచి సేకరించిన సమాచారంతో కూడిన 117 అధ్యయనాలను క్రమపద్ధతిలో సమీక్షించింది. ఈ ఫలితాలు సైకలాజికల్ బులెటిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
శారీరక ఆరోగ్య ప్రభావాలు
ఊబకాయం: ఎక్కువసేపు కూర్చోవడం, స్క్రీన్ చూస్తూ అధికంగా అల్పాహారం తీసుకోవడం వల్ల బాల్యంలో ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువ.
నిద్ర ఆటంకాలు: స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. నిద్రపోవడం కష్టతరం చేస్తుంది. నిద్ర నాణ్యత తగ్గుతుంది.
దృష్టి సమస్యలు: కంటి ఒత్తిడి, తలనొప్పి, కళ్లు పొడిబారడం, దృష్టి మసకబారుతుంది.
కండరాల సమస్యలు: గంటల తరబడి డిజిటల్ తెర చూస్తూ సరైన భంగిమ లేక మెడ, వీపు, భుజం నొప్పికి దారి తీస్తుంది.
మానసిక, అభివృద్ధి ప్రభావాలు
ప్రవర్తనా సమస్యలు: అధిక స్క్రీన్ సమయంతో దూకుడు, మొండితనం, తీవ్ర భావోద్వేగ సమస్యలకు కారణమవుతుంది.
సామాజిక, భావోద్వేగ సవాళ్లు: వ్యక్తులతో ప్రత్యక్షంగా దూరంగా ఉండడం వల్ల సామాజిక నైపుణ్యాలు, భావోద్వేగ అవగాహనకు ఆటంకం కలుగుతుంది.
శ్రద్ధ, అభ్యసన సమస్యలు: పిల్లలు శ్రద్ధ, ఏకాగ్రత విషయంలో ఇబ్బంది పడతారు. చదువును ప్రభావితం చేస్తుంది.
మానసిక ఆరోగ్య సమస్యలు: ఆందోళన, నిరాశ రేటు పెరుగుదలకు దారితీస్తుంది.


