బ్యాగులు చిరిగిపోవడంతో మార్కెట్‌లో కొనుక్కున్న బ్యాగులతో విద్యార్థులు
చిరిగిపోతున్న ప్రభుత్వం పంపిణీ చేసిన స్కూల్ బ్యాగులు
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
ఇచ్ఛాపురం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు విద్యా సంవత్సరం మధ్యలోనే చిరిగిపోతున్నాయి. బ్యాగుల్లో పుస్తకాలు పెట్టుకోవాలంటే ఎక్కడ జారి పడిపోతాయోనని భయపడాల్సి వస్తోందని విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో పాఠశాలలు పునః ప్రారంభం కాగా, జూలైలో విద్యార్థులకు ఎనిమిది వస్తువులతో కూడిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు పేరుతో బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, బెల్టులు, బూట్లు, రెండు జతల సాక్షులు, యూనిఫాం క్లాత్, డిక్షనరీతో పాటు సంచులు ఇచ్చారు. ఇందులో బూట్లు అందరికీ సరిపడకపోవడంతో ఇచ్చిన బూట్లు ఇంటి వద్దనే విడిచి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన బూట్లు బడికి వేసుకువస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 2,632 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ఒక లక్షా 59వేల 648 మంది విద్యార్థులకు బ్యాగులు ఇచ్చారు. ఇచ్చి న బ్యాగులు పైన పటారం...లోన లొటారం మాదిరిగా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇచ్చిన బ్యాగులు నాసిరకంగా ఉండటంతో జిప్‌లు ఊడిపోవడంతో పాటు పైనా, కిందా, తగిలించుకునే కుచ్చుల వద్ద చిరిగిపోతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు పుస్తకాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వారి బ్యాగులు మూడునాళ్ల ముచ్చటగానే మిగి లిపోతున్నాయి. చిరిగిపోయిన బ్యాగుల్ని సూది దారంతో కుట్టుకుంటూ బడికి వస్తుంటే తోటి విద్యార్థులు హేళన చేస్తున్నారని కొంత మంది విద్యార్థులు వాపోతున్నారు. దీంతో కొత్త బ్యాగులు కొనక తప్పడం లేదు.
నాసిరకం బ్యాగులు
మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు ఇచ్చిన కిట్‌లో బ్యాగులు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయి. విద్యా సంవత్సరం మధ్యలోనే బ్యాగులు చిరిగిపోతున్నాయి. కొంత మంది పేద విద్యార్థులు అవే బ్యాగుల్ని కుట్టుకుంటూ బడికి వెళ్తున్నారు. బ్యాగులు చూసి తోటి విద్యార్థుల హేళనకు గురవుతున్నారు.
– బోర పుష్ప, ఎంపీపీ, ఇచ్ఛాపురం


