ఎనిమిదిమందికి వాంతులు, విరేచనాలు
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులు
ఆహారం విషతుల్యం కావడమే కారణమని అనుమానం
పాములపాడు: నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్–3కు చెందిన ఎనిమిదిమంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈ అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం నాలుగు, ఐదేళ్ల వయసున్న 12 మందికి ఉదయం కోడిగుడ్డు, సాయంత్రం పాలు ఇచ్చారు. ఇంటికి వెళ్లిన తరువాత ఎనిమిదిమందికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వారిని తల్లిదండ్రులు ఆత్మకూరు, నందికొట్కూరు ఆస్పత్రులకు తరలించారు.
పిల్లల్లో చైతన్యకుమార్, అలేఖ్య, సంధ్య, వసుంధర ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలోను, రితిక, నిక్షిత్‌కుమార్, రిషి ప్రైవేట్ ఆస్పత్రిలోను, చార్లెస్ రాజు నందికొట్కూరు ప్రైవేటు ఆస్పత్రిలోను చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన అధికారులు గురువారం ఉదయం గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. అంగన్‌వాడీ టీచర్ అరుణ, సహాయకురాలు మంజుల నుంచి వివరాలు సేకరించారు.
సెంటరులో మొత్తం 16 మంది చిన్నారులకుగాను బుధవారం 13 మంది హాజరయ్యారు. ఒకరు మధ్యలోనే ఇంటికి వెళ్లగా 12 మందికి ఆహారం అందించినట్లు వారు చెప్పారు. ఈ ఆహారం విషతుల్యం కావడం వల్లే వీరు అస్వస్థతకు గురైనట్లు అధికారులు, వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐసీడీఎస్, వైద్యశాఖ అధికారులు చిన్నారులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విచారణ చేపట్టిన అధికారులు అంగన్‌వాడీ కేంద్రంలోని సరుకుల శాంపిళ్లు, విద్యార్థుల రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. అంగన్‌వాడీ చిన్నారులు అస్వస్థతకు గురవడంపై కలెక్టర్ రాజకుమారి ఆరాతీసి, అధికారుల్ని అప్రమత్తం చేశారు.


