నెలకు 65 జీబీకి డేటా వినియోగం
భారత్‌లో 2031 నాటికి ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక అంచనా
న్యూఢిల్లీ: భారత్‌లో 2031 నాటికి 5జీ సబ్‌స్క్రిప్షన్స్ సంఖ్య 100 కోట్లకు చేరవచ్చని ఎరిక్సన్ మొబిలిటీ ఒక నివేదికలో అంచనా వేసింది. స్మార్ట్‌ఫోన్లలో డేటా వినియోగం గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా నెలకు 36 జీబీగా ఉన్న డేటా వినియోగం 2031 నాటికి 65 జీబీకి చేరనుందని నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో 2025 ఆఖరు నాటికి 5జీ సబ్‌స్క్రిప్షన్లు 39.4 కోట్లకు చేరవచ్చని వివరించింది.
మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్స్‌లో వీటి వాటా 32 శాతంగా ఉంటుందని పేర్కొంది. అటు అంతర్జాతీయంగా కూడా 5జీ కనెక్షన్లు 640 కోట్లకు చేరతాయని, మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్లలో వీటి వాటా మూడింట రెండొంతులుగా ఉంటుందని నివేదిక వివరించింది. భారత్‌లో డిజిటలీకరణను వేగవంతం చేసే దిశగా 5జీ ఇప్పటికే కీలక మౌలిక సదుపాయంగా నిలుస్తోందని పేర్కొంది. అందుబాటు ధరలో 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ సీపీఈ (ఫిక్సిడ్ వైర్‌లెస్ యాక్సెస్ కస్టమర్ ప్రిమిసెస్ ఎక్విప్‌మెంట్) లభ్యత, ఎఫ్‌డబ్ల్యూఏ యూజర్లు అత్యధికంగా డేటాను వినియోగిస్తుండటంలాంటి అంశాలు భారత్‌లో డేటా ట్రాఫిక్ వృద్ధికి దోహదపడుతున్నట్లు వివరించింది.
నివేదికలో మరిన్ని విశేషాలు...
→ 2031 నాటికి అంతర్జాతీయంగా 5జీ కనెక్షన్లు 640 కోట్లకు చేరనున్నాయి. ఇందులో 410 కోట్ల కనెక్షన్లు, ప్రస్తుత 4జీ మౌలిక సదుపాయాలతో సంబంధం లేకుండా కేవలం 5జీ నెట్‌వర్క్‌పైనే పని చేస్తాయి.
→ 2024 మూడో త్రైమాసికం నుంచి 2025 మూడో త్రైమాసికం మధ్య కాలంలో మొబైల్ నెట్‌వర్క్ డేటా ట్రాఫిక్ 20 శాతం పెరిగింది. 2031 వరకు ఇది వార్షిక ప్రాతిపదికన సగటున 16 శాతం మేర వృద్ధి చెందుతుంది.
→ 2024 ఆఖరు నాటికి గణాంకాలతో పోలిస్తే మొత్తం మొబైల్ డేటా వినియోగంలో 5జీ నెట్‌వర్క్ వాటా 34 శాతం నుంచి పెరిగి 43 శాతానికి చేరుతుంది. 2031 నాటికి ఇది 83 శాతానికి చేరుతుంది.
→ ఎఫ్‌డబ్ల్యూఏ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగించుకునే వరి సంఖ్య 2031 ఆఖరు నాటికి ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకి చేరుతుంది.
→ అంతర్జాతీయంగా 6జీ సబ్ర్‌స్కిప్షన్లు 2031 ఆఖరు నాటికి 18 కోట్లకు చేరతాయి. ఒకవేళ 6జీ ఆవిష్కరణలను మరింత ముందుగా తీసుకొస్తే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది.


