బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్-2026 తమ గ్రూప్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ యూత్ మరియు స్పోర్ట్స్ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ నుంచి వారి స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను (కేకేఆర్) తొలగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
🚨 CONFIRMED - BANGLADESH TEAM WILL NOT TRAVEL TO INDIA FOR T20 WORLD CUP 2026 🚨 pic.twitter.com/aVF29iqMoY
— Tanuj (@ImTanujSingh) January 4, 2026
ముస్తాఫిజుర్ ఉదంతంపై బీసీబీ ఇవాళ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకుంది. ఇందులోనే భారత్‌లో మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించారు. ఈ విషయమై ఐసీసీకి లేఖ రాయాలని తీర్మానం చేశారు. భారత్‌లో తమ ఆటగాళ్లు రక్షణ లేదని, అందుకే తమ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని కోరుతామని బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం బుల్బుల్ తెలిపారు. ఆటగాళ్ల భద్రత, గౌరవం తమ ప్రాధాన్యత అని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా, బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని తెలిపింది. ముస్తాఫిజుర్ ఉదంతానికి ప్రతి చర్యగా భారత్‌లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకుంది. అలాగే దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిలిపివేయాలని తీర్మానించుకుంది.
కాగా, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టు గ్రూప్-సిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లండ్, నేపాల్ మిగిలిన జట్లుగా ఉన్నాయి. భారత్‌లోని కోల్‌కతా, ముంబై నగరాల్లో బంగ్లాదేశ్ తమ వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడనుంది.
గ్రూప్ దశలో బంగ్లాదేశ్ ఆడబోయే మ్యాచ్‌లు
- ఫిబ్రవరి 7: వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
- ఫిబ్రవరి 9: ఇటలీ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
- ఫిబ్రవరి 14: ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
- ఫిబ్రవరి 17: నేపాల్ vs బంగ్లాదేశ్ (ముంబై)
ఇదిలా ఉంటే, ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును కూడా ఇవాళ (జనవరి 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా లిట్టన్ దాస్, వైస్ కెప్టెన్‌గా మొహమ్మద్ సైఫ్ హస్సన్ ఎంపికయ్యారు.ఇటీవల జరిగిన ఐర్లాండ్ సిరీస్‌కు దూరంగా ఉన్న పేసర్ తస్కిన్ అహ్మద్ రీఎంట్రీ ఇచ్చాడు.
వికెట్ కీపింగ్, బ్యాటర్ జాకిర్ అలీ, బ్యాటర్ మహిదుల్ ఇస్లాం అంకోన్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఫామ్‌లో ఉన్నా, స్టార్ బ్యాటర్ నజ్ముల్ హసన్ షాంటోపై వేటు పడింది.

టీ20 ప్రపంచకప్ 2026కు బంగ్లాదేశ్ జట్టు..
- లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్)
- మొహమ్మద్ సైఫ్ హసన్ (వైస్ కెప్టెన్)
- తంజీద్ హసన్
- మొహమ్మద్ పర్వేజ్ హొసైన్ ఎమోన్
- తౌహిద్ హ్రిదోయ్
- షమీమ్ హసన్
- ఖాజీ నూరుల్ హసన్ సోహాన్
- మహెది హసన్
- రిషాద్ హసన్
- నసుమ్ అహ్మద్
- ముస్తాఫిజుర్ రహ్మాన్
- తంజీమ్ హసన్ సకిబ్
- టాస్కిన్ అహ్మద్
- మొహమ్మద్ షైఫుద్దిన్
- షొరీఫుల్ ఇస్లాం


