ప్రధాని నరేంద్ర మోదీ ధీమా
జాతీయ సీనియర్ వాలీబాల్ షురూ
వారణాసి: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2036లో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించే సత్తా భారత్‌కు ఉందన్నారు. ఇప్పటికే 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణ హక్కులు లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆదివారం వారణాసిలో సీనియర్ జాతీయ వాలీబాల్ చాంపియన్‌షిప్ మొదలు కాగా...వర్చువల్‌గా ప్రధాని దీనిని ప్రారంభించారు.
ప్రధాన వేదికపై జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అనంతరం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వర్ధమాన అథ్లెట్లు ఒలింపిక్స్‌లో రాణించేందుకు తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ‘ఖేలో ఇండియా’లాంటి క్రీడలు, పథకాలు ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఒక గేమ్ చేంజర్ అని మోదీ పేర్కొన్నారు.
‘2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యమిస్తోంది. అలాగే 2036 విశ్వక్రీడల ఆతిథ్యం కోసం గట్టిగానే కృషి చేస్తున్నాం. దీనివల్ల మన భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్లలో సత్తా చాటుకునే అవకాశం లభిస్తుంది. మేం ఇదివరకే ప్రారంభించిన ఖేలో ఇండియా సత్ఫలితాలను ఇస్తోంది. ప్రతిభ గల క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేలా విస్తృత అవకాశాల్ని కల్పించింది’ అని ప్రధాని వివరించారు.
టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) ఎంతోమంది అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు తెచ్చేందుకు తోడ్పడిందన్నారు. గత దశాబ్ద కాలంగా భారత్‌లో 20కి పైగానే మేజర్ క్రీడా ఈవెంట్లు జరిగాయని గుర్తుచేశారు. ‘పదేళ్లుగా వివిధ నగరాల్లో చెప్పుకోదగిన స్థాయిలో అంతర్జాతీయ ఈవెంట్లు ఎన్నో జరిగాయి. ఫిఫా అండర్–17 ప్రపంచకప్, హాకీ ప్రపంచకప్, అంతర్జాతీయ చెస్ టోర్నీలు, ప్రపంచకప్ చెస్ ఈవెంట్లు జరిగాయి. కేంద్రం కూడా ప్రతీ ఏటా క్రీడల బడ్జెట్‌ను పెంచుతూ పోతోంది. క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల ప్రదర్శన మెరుగుపరిచేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచాం.
ఎక్స్‌ప్రెస్ వేగంతో సంస్కరణల్ని అమలు చేస్తున్నాం’ అని ప్రధాని మోదీ వివరించారు. సీనియర్ జాతీయ వాలీబాల్ పోటీలు ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు జరుగుతాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సరీ్వసెస్‌కు చెందిన 58 పురుషులు, మహిళల జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. సుమారు వేయికి పైగా ఆటగాళ్లు ఈ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఇరు విభాగాల్లో లీగ్ దశ పోటీలు జరుగుతాయి. గ్రూప్ దశ అనంతరం నాకౌట్ దశ మొదలవుతుంది. 11న జరిగే ఫైనల్స్‌తో ఈవెంట్ ముగుస్తుంది.


