వెనిజువెలాలో ప్రస్తుత పరిస్థితులపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వెనిజువెలాలోని ఇండియా ఎంబసీ అక్కడి భారతీయులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని తెలిపింది.
శుక్రవారం వెనిజువెలాపై అమెరికా ఆకస్మిక దాడులు జరిపింది. ఆ దేశంలోని కరాకస్ నగరంపై మిసైళ్లతో విరుచుకపడింది. సైనికస్థావరాలు, జనావాసాలపై పెద్దఎత్తున దాడులు చేసింది. అనంతరం ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్‌నూ బందీలుగా పట్టుకొని న్యూయార్క్ తరలించింది. అయితే తాజాగా భారత్ ఈ ఘటనపై స్పందించింది. వెనిజువెలాపై దాడి చేయడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై భారత్ స్పందిస్తూ... "ప్రస్తుతం వెనిజువెలాలో జరుగుతున్న పరిస్థితులపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. అక్కడ జరుగుతున్న పరిస్తితులను భారత్ నిశితంగా గమనిస్తుంది. ఇరువర్గాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి" అని భారత్ ప్రకటన విడుదల చేసింది. వెనిజువెలాలో శాంతి, స్థిరత్వం కోసం అక్కడి ప్రజలకు భారత్ పూర్తి మద్ధతు అందిస్తుందని తెలిపింది.
అదేవిధంగా వెనిజువెలా, కారకస్‌లోని ఇండియా ఎంబసీ అక్కడి ప్రజలతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపింది. ఎవైనా సమస్యలుంటే వెంటనే అక్కడి రాయభార కార్యాలయాన్ని సంప్రదించాలని అక్కడి భారత ప్రజలకు సూచించింది.


