‘పిల్లలకు ఎలాంటి కష్టాలు ఉంటాయి? వారు రోజంతా ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు’’ అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరైన అభిప్రాయం కాదు. డిప్రెషన్ అనేది పెద్దవారికే కాదు... అది చిన్న పిల్లల్లో కూడా కనిపించే ఓ భావోద్వేగ సమస్య. అనేక పరిశోధనలు క్లినికల్ అనుభవాలు చిన్నపిల్లల్లో కూడా డిప్రెషన్ కనిపిస్తుందని నిర్ధారణ చేస్తున్నాయి. చిన్నపిల్లల్లో డిప్రెషన్ రావడానికి అనేక అంశాలు కారణమవుతాయి. అవి...
పిల్లల్లో డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే...
1. బయోలాజికల్ / శారీరక కారణాలు
కుటుంబంలో డిప్రెషన్ లేదా యాంగై్జటీలతో కూడిన మెడికల్ హిస్టరీ ఉండటం
మెదడులోని రసాయనాల (కెమికల్స్) అసమతుల్యత కారణంగా నిద్ర–ఆహార శైలిలో గందరగోళం
2. సైకాలజికల్ / భావోద్వేగ కారణాలు
పిల్లల సున్నితమైన స్వభావం
భయం, ఆత్మవిశ్వాసం లేకపోవడం
చదువులో ఒత్తిడి
3. సామాజిక కారణాలు
ఇంట్లో కలహాలు
స్కూల్‌లో బుల్లీయింగ్‌కు గురికావడం
స్నేహితుల లేమి, ఒంటరితనం
ఎక్కువ సమయం టీవీ లేదా మొబైల్ స్క్రీన్‌కు అంటిపెట్టుకుని ఉండటం
డిప్రెషన్ పిల్లల్లో ఎలా బయటపడుతుందంటే...
చిరాకు, చిన్న విషయానికే ఏడవడం
ఒంటరిగా ఉండాలనిపించడం
స్కూల్‌కు వెళ్లడంలో నిరాసక్తత
ఆటల్లో ఆసక్తి తగ్గిపోవడం ఆకలి తగ్గడం లేదా ఎక్కువగా తినడం
నిద్రలో మార్పులు (ఎక్కువ నిద్ర / నిద్రలేమి)
అలసట, నీరసం, నిస్సత్తువ
ఆత్మవిశ్వాసం తగ్గుదల ∙తరచూ ‘‘పొత్తికడుపు నొప్పి, తలనొప్పి’’ వంటి ఫిర్యాదులు
ఈ లక్షణాలు 2–3 వారాలు కొనసాగితే నిపుణుడిని సంప్రదించడం మంచిది.
ప్రతి బాధ డిప్రెషన్ కాకపోవచ్చు కానీ పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే చిన్న పిల్లలు తమ భావాలను మాటల్లో చెప్పలేరు. వారు తమ ప్రవర్తన ద్వారానే తమ బాధల్ని వ్యక్తం చేస్తారు. అందుకే పిల్లల్లో ఆకస్మికంగా వచ్చిన మార్పులను తల్లిదండ్రులు, టీచర్లు గమనించాలి.
తల్లిదండ్రులకు కొన్ని ముఖ్యమైన సూచనలు
1. పెద్దలు తీర్పులు ఇవ్వకుండా పిల్లల మాట వినాలి (నాన్ జడ్జిమెంటల్ ఆటిట్యూడ్)
∙‘‘ఇంత చిన్న విషయానికే ఎందుకు బాధపడుతున్నావు?’’ వంటి మాటలను అనకూడదు. ∙పిల్లల అభిప్రాయాలనూ, భావాలనూ తగ్గించే మాటలు అనకుండా, ఠక్కున ఓ అభిప్రాయానికి వచ్చి దాన్ని వెల్లడించకుండా వారు చెప్పే మాటల్ని శ్రద్ధగా వినాలి. ఇది పిల్లల్లో భద్రతా భావాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది.
2. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం (స్పెండింగ్ మోర్ అండ్ క్వాలిటీ టైమ్)
ప్రతిరోజూ కొంత సమయం పూర్తిగా పిల్లలకోసమే కేటాయించాలి.∙
కథలు చెప్పడం, బయట ఆటలు, కలిసి చేసే చిన్న పనులే అయినప్పటికీ ఇవన్నీ పిల్లల్లో వాళ్ల భావోద్వేగ బలాన్ని పెంచుతాయి. ∙నాణ్యమైన సమయం ఇవ్వడమన్నది పిల్లలను డిప్రెషన్‌కు గురికాకుండా చేసే ఒక సహజ రక్షణలాంటిది.
చికిత్స ఇలా...
కౌన్సిలింగ్ / ప్లే థెరపీ
బిహేవియర్ థెరపీ
అవసరమైనప్పుడు మాత్రమే అది కూడా సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలోనే మందులు వాడటం.
ఎంత త్వరగా చికిత్స చేస్తే ఫలితాలు అంతగా బాగుంటాయి.
చివరగా...
డిప్రెషన్ చిన్న పిల్లల్లోనూ కనిపించేందుకు అవకాశమున్న ఒక భావోద్వేగ సమస్య. దీన్ని వైద్య నిపుణుల సహాయంతో నయం చేయవచ్చు. సమయానికి గుర్తించడం, వారి ప్రవర్తనపై తీర్పులు ఇవ్వకుండా ప్రేమ, ఆప్యాయతలతో వారితో పెద్దలు ఎక్కువ సమయం గడపడం ద్వారా, అలాగే నిపుణుల సహాయం తీసుకుంటే వారిని డిప్రెషన్‌ను నుంచి దూరం చేయగలిగితే చిన్నారులు పూర్తిగా ఆరోగ్యంగా కోలుకుని, ఆనందంగా ఎదుగుతారు.
డాక్టర్ గౌతమి నాగభైరవ, సీనియర్ సైకియాట్రిస్ట్
(చదవండి: ఎకాంథోసిస్ నైగ్రికాన్స్! చక్కెర చారలు..!)


