కొంతమంది నుదుటి మీద, మరికొందరి మెడ మీద చర్మం కాస్తంత ఉబ్బినట్టుగా, దళసరిగా మారినట్టుగా కనిపించడం మామూలే. ఆ నల్లబారిన ఉబ్బు మధ్య మధ్యన ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా కొద్దిగా ముడుతలు ముడుతలుగా కనిపిస్తుండటమూ సాధారణమే. పైకి కనిపించే ప్రదేశాల్లో మాత్రమే కాదు... కొందరికి దుస్తులు కప్పి ఉంచే ప్రదేశాలైన బాహుమూలాల్లో కూడా ఇలా కనిపిస్తుంది.
ఇలా చర్మం నల్లగా, ఉబ్బుగా, దళసరిగా ఓ పొరలాగా కనిపించే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘ఎకాంథోసిస్ నైగ్రికాన్స్’ అంటారు. సాధారణంగా ఇలా రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ దీన్ని ప్రీ– డయాబెటిస్‌కు సూచనగా భావించి ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, కొన్ని సూచనలు పాటిస్తూ చాలాకాలం పాటు డయాబెటిస్ దరిచేరకుండా చూసుకోవాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై అవగాహన కోసమే ఈ కథనం.
ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ ఎందుకు వస్తుందన్నది ఇంకా తెలియదు. అది రావడానికి నిర్దిష్టంగా ఫలానా అంశమే కారణం అని చెప్పడానికి లేదు. అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవాళ్లకు అది వస్తుందన్నది పరిశోధకుల మాట. ఇన్సులిన్ అనే హార్మోన్ చక్కెరను కణంలోకి సాఫీగా వెళ్లేలా చేయడం ద్వారా రక్తంలో చక్కెరను రెగ్యులేట్ చేస్తుంది. అంటే కణం తాలూకు జీవక్రియలకు అవసరమయ్యేలా చక్కెరను కణంలోకి ప్రవేశించేలా చేయడం వల్ల రక్తంలో తగినంత చక్కెర కనిపించదు. ఏదైనా కారణాల వల్ల కణంలోకి చక్కెర ప్రవేశించకపోతే అది రక్తంలోనే ఉండిపోతుంది.
అంటే కణం ఇన్సులిన్‌ను రెసిస్ట్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి ఇలా జరిగే కండిషన్‌ను ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దాంతో రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ప్రాంక్రియాస్ ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రాంక్రియాస్‌పై ఎక్కువ భారం పడటంతో తొలుత ప్రీ–డయాబెటిస్‌కీ, తర్వాత డయాబెటిస్‌కూ దారితీయవచ్చు. ప్రీ–డయాబెటిక్ కండిషన్ అనేది చక్కెర వ్యాధికి (డయాబెటిస్‌కి) తొలి దశ లేదా తొలి సూచనగా భావిస్తారు.
లక్షణాలు...
నుదుటి మీద, మెడ వెనక భాగంలో అలాగే చంకల్లో చర్మం దళసరిగా మారడంతో పాటు చర్మం ముడతలు పడుతూ ఉండే భాగాల్లో అంటే ప్రైవేటుపార్ట్స్ దగ్గర, మోకాళ్ల వెనక కూడా చర్మం దళసరిగా మారడం;
మందంగా మారిన చోట కాస్తంత దురదగా అనిపించడం
కొందరిలో అక్కడ పులిపిరులు (స్కిన్ ట్యాగ్స్) రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఎకాంథోసిస్ నైగ్రికాన్స్‌కు కారణాలు...
ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో పాటు ఎకాంథోసిస్ నైగ్రికాన్స్‌కు మరికొన్ని అంశాలూ కారణమవుతాయని నిపుణులు చెబుతుంటారు. అవి...
కొందరిలో టైప్–2 డయాబెటిస్‌కు ముందర (సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఇలా నల్లబారి, దళసరిగా మారడం కాస్తంత ఎక్కువ)
చాలా అరుదుగా వచ్చే ఈ కండిషన్స్ ఉన్నవారిలో...
చాలా అరుదుగా చర్మ క్యాన్సర్ ఉన్నవారిలో. (దీన్ని మెలిగ్నెంట్ ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటారుగానీ ఇది చాలా చాలా అరుదు).
కొందరిలో కొన్ని మందులు వాడటం వల్ల.
కొందరిలో లూపస్ (ఎస్‌ఎల్‌ఈ) అనే ఆటోఇమ్యూన్ వ్యాధి కారణంగా.
కొందరిలో జోగ్రెన్స్ సిండ్రోమ్, స్కీ›్లరోడెర్మా, హషిమోటో థైరాయిడైటిస్ అనే కారణాల వల్ల.
ఇతరత్రా పరిణామాలు
చూడటానికి ఇబ్బందిగా ఉండి అంత బాగా కనిపించకపోవడం.
ఈ నలుపు కారణంగా నలుగురిలోకి రాలేక మానసికంగా ఇబ్బందిపడటం.
నిర్ధారణ...
బయటకు చూడటానికి నల్లగా, దళసరిగా కనిపించే చర్మంతో దీన్ని క్లినికల్‌గా గుర్తించవచ్చు. అవసరాన్ని బట్టి కొందరిలో బయాప్సీ చేయాల్సి రావచ్చు. అవసరాన్ని బట్టి (లేదా కారణాలను తెలుసుకునేందుకు) రక్తంలో చక్కెర మోతాదులూ, ఇన్సులిన్ స్థాయులు, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలూ చేయించే అవకాశాలుంటాయి.
చికిత్స...
ఎకాంథోసిస్ నైగ్రికాన్స్‌లో చర్మం నలుపునూ, దళసరిగా/మందంగా మారడాన్ని తగ్గించడానికి డాక్టర్లు కొన్ని రకాల క్రీములు, జెంటిల్ క్లెన్సర్స్, యాంటీబ్యాక్టీరియల్ సబ్బులు సూచించవచ్చు. దాంతో΄ాటు కొన్ని సందర్భాల్లో లేజర్ థెరపీ వంటి చికిత్సలు అవసరం కావచ్చు. కొందరికి కెమికల్ పీల్స్ చికిత్సలు కూడా బాగానే ఉపయోగపడతాయి.
అయితే మరీ ముఖ్యంగా చెప్పాల్సిందేమిటంటే... ఇలా చర్మం దళసరిగా మారి, నలుపు రంగులోకి తిరుగుతుంటే... ఎకాంథోసిస్ నైగ్రికాన్స్‌కు కాకుండా లోపల మరేదైనా ఆరోగ్య సమస్య (అండర్‌లైయింగ్ డిసీజ్) కారణంగా ఇలా జరుగుతుందేమో పరిశీలించడం అవసరం. అంటే స్థూలకాయం (ఒబేసిటీ), ప్రీ డయాబెటిస్ లేదా డయాబెటిస్ వంటివి కారణాలు కావచ్చని అనుమానించాలి.
ఇలా అనుమానించడం ద్వారా కారణాలను విశ్లేషించి వాటికి అవసరమైన చికిత్స తీసుకోవడం మరీ ముఖ్యం. తద్వారా ప్రీ–డయాబెటిస్ కండిషన్ గనక బయటపడితే డాక్టర్‌లు పాటించమని చెప్పే కొన్ని ఆరోగ్య సూచనలతో డయాబెటిస్‌ను చాలాకాలం పాటు నివారించవచ్చు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటికి చికిత్స అందించడం ద్వారా సమస్య మరింత ముదరకుండా జాగ్రత్తపడటంతో పాటు అండర్‌లైయింగ్ డిసీజ్ తగ్గిపోవడం వల్ల ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ కూడా నయమవుతుంది.
డాక్టర్ బి. విజయశ్రీ సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కాస్మటాలజిస్ట్.
(చదవండి: Exercise During Period: పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయొచ్చా?)


