ఏటా నవంబర్ నుంచి మార్చి వరకు విదేశీపక్షుల సందడి
వేలకిలోమీటర్లు పయనించి వచ్చి ఇక్కడ కనువిందు చేస్తున్న వైనం
పక్షి ప్రేమికుల పరవశం
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యాలు జీవవైవిద్యానికి కేరాఫ్ అడ్రస్. ఈ అటవీ ప్రాంతాల్లో కృష్ణా పరివాహకంతో పాటు ఎన్నో నదులు, సెలయేళ్లు, గుట్టలు, జంతుజాలాలతో పాటు అరుదైన పక్షులు సందడి చేస్తుంటాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని నల్లమల అభయారణ్యంతో పాటు రోళ్లపాడు అడవులకు ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వేలసంఖ్యలో విదేశీ పక్షులు వస్తుంటాయి. ఐరోపా, యూరప్, మధ్య అసియా, ఆఫ్రికా ఖండాల్లోని పలు దేశాలతో పాటు, మంచుకొండల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు చేరుకుని సందడి చేస్తుంటాయి.
వివిధ రకాల పక్షులు విభిన్న రంగులతో, వింత శబ్దాలతో పక్షి ప్రేమికులను, ప్రకృతి అభిమానులను రంజింపజేస్తుంటాయి. చలికాలమంతా ఇక్కడే ఉండి ఎండాకాలం రాగానే తిరిగి వెళ్లిపోతాయి. శ్రీశైలం అభయారణ్యంలో పనిచేసిన వన్యప్రాణి ఫొటోగ్రాఫర్, రిటైర్డు ఫారెస్టు రేంజి అధికారి మహమ్మద్ హయాత్, వణ్యప్రాణి ఫొటోగ్రాఫర్ హనుమంతరావు అరుదైన విదేశీ పక్షులను తమ కెమెరాల్లో బంధించి డాక్యుమెంటరీ రూపొందించారు. అరుదైన పక్షిజాతుల విశేషాలను వారు వెల్లడించారు.
ఉడతలగద్ద (పల్లీడ్ హ్యారియర్)
మాంసాహారి. చాలా అందమైన పక్షి. చిన్న పక్షులను, వాటి గుడ్లను తింటుంది. ఐరోపాలోని మంచుప్రాంతాల నుంచి వచ్చి చలికాలంలో నల్లమలలోని మైదానప్రాంతంలో ఉంటుంది.
వర్ణపడేగ (యూరేసియస్ స్పారోహాక్) : యర్)
ఇది ఐరోపా ఖండం నుంచి వస్తుంది. గడ్డి మైదానాల్లో ఉండే పక్షులను, పెద్దచెట్లలో దాగి ఉండే పక్షులను వేటాడి చంపుతుంది. ఇది ఎక్కువగా ఒంటరిగానే ఉంటుంది.
ఎర్రటోపీ జాలె డేగ (రెడ్ నెకెడ్ ఫాల్కన్):
ఇది చాలా అందంగా కనిపించే వలస పక్షి. గడ్డి మైదానాల్లో ఉండే ఈ పక్షి చిన్నచిన్న పక్షులను వేటాడి తింటుంది. ఇది ఆఫ్రికా ఖండం నుంచి వస్తుంది.
గొప్ప చిన్నచందుల్ (గ్రేటర్ షార్ట్ టోడ్ లార్క్)
ఐరోపా ఖండం నుంచి వేలసంఖ్యలో ఇక్కడకు వస్తుంటాయి. విదేశాల నుంచి వచ్చే పక్షులన్నీ గొప్ప చిన్నచందుల్ పక్షులను అనుసరించి ఇక్కడకు వస్తూ ఉంటాయి. వలస వచ్చే క్రమంలో గొప్ప చిన్నచందుల్ పక్షులను వేటాడి తింటుంటాయి. తిరిగి వెళ్లే సమయంలోను వాటిని తినేస్తుంటాయి.
మౌంటేగు పిల్లిగద్ద (మౌంటేగస్ హ్యారియర్)
ఇది కూడా యూరప్, మధ్య ఆసియాల్లోని మంచు ప్రదేశాల నుంచి వస్తుంది. చలికాలంలో వచ్చి గడ్డి మైదానాల్లో ఉండే చిన్న పక్షలును, వాటి గుడ్లను తింటుంది.


