సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం తీరం నుంచి ఈ నెల 12, 13 తేదీల్లో క్షిపణి పరీక్షకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా నోటీస్ టు ఎయిర్‌మెన్(నోటమ్) జారీ చేసినట్లు తెలిసింది. బంగాళాఖాతం వెంబడి 500 కి.మీ పరిధిలో 12వ తేదీ అర్ధరాత్రి 2 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 9 గంటల వరకు నోటమ్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్దిష్ట సమయాల్లో ఈ ప్రాంతం మీదుగా విమాన రాకపోకలపై నిషేధం విధించారు. డిసెంబర్ 24న విశాఖ కేంద్రంగా ఐఎన్‌ఎస్ అరిఘాత్ నుంచి అత్యంత శక్తిమంతమైన కే–4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. 3,500 కి.మీ దూరంలోని లక్ష్యాల్ని ఈ మిసైల్ ఛేదించింది. ఈ నేపథ్యంలో మరోసారి విశాఖ కేంద్రంగా క్షిపణి పరీక్ష నిర్వహించేందుకు భారత నౌకాదళం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఈసారి ఏ తరహా మిసైల్‌ను ప్రయోగిస్తున్నారన్న విషయంపై ఇంకా ప్రకటన వెలువడలేదు.
8, 9 తేదీల్లో పాక్ నోటమ్!
మరోవైపు శత్రుదేశం పాకిస్తాన్ కూడా ఈనెల 8, 9 తేదీల్లో ఉత్తర అరేబియా సముద్రంపై నోటమ్ జారీ చేసింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పాక్ నౌకాదళం విన్యాసాలు నిర్వహిస్తోంది. 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి 9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు నోటమ్ అమల్లో ఉంటుందని పాక్ పేర్కొంది.


