బూటు కాళ్లతో తొక్కారు.. లాఠీలతో అరికాళ్లపై కొట్టారు
దళిత విద్యార్థులను చిత్రహింసలు పెట్టడమే మీరు చేసే న్యాయమా?
పన్నెండు మంది కలిసి స్తంభాన్ని తొలగిస్తే నలుగురు దళిత బిడ్డలను స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టడమేంటి?
పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిన అప్పాపురం దళితవాడ వాసులు
ఎస్‌ఐను సస్పెండ్ చేయాలంటూ నాలుగు గంటల పాటు రాస్తారోకో
గుంటూరు జిల్లా: ‘బూటు కాళ్లతో మా పిల్లలను తొక్కుతారా? పన్నెండు మంది కలిసి పోల్ పీక్కెళితే అందులో నలుగురు దళిత బిడ్డలను మాత్రమే స్టేషన్‌కు పిలిపించి లాఠీలు విరిగేలా అరికాళ్లపై కొట్టడమేంటి?’ అంటూ అప్పాపురం దళితవాడ ప్రజలు పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిచి చెప్పే కనీస జ్ఞానం కూడా లేదా? లాఠీలతో కొట్టి అక్కడే నడిపిస్తారా’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురానికి చెందిన పన్నెండు మంది విద్యార్థులు వాలీబాల్ నెట్ కట్టుకునేందుకు సోమవారం ఓ వీధిలో ఉన్న టెలిఫోన్ స్తంభాన్ని(పోల్) తొలగించి, తీసుకెళ్లారు. ఆ సమయంలో స్తంభానికి చుట్టి ఉన్న విద్యుత్‌వైర్లు కదిలి ఇళ్లలో ఉన్న విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయంటూ ఓ మహిళ కాకుమాను పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం వారిలో నలుగురు యువకులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కొట్టారని ఆరోపిస్తూ అదే రోజు రాత్రి తల్లిదండ్రులు స్టేషను వద్దకు వెళ్లి పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నాలుగు గంటల పాటు రాస్తారోకో
‘మా పిల్లలను బూటు కాళ్లతో తొక్కి, లాఠీలు విరిగేలా అరికాళ్లపై కొట్టిన ఎస్‌ఐ ఏక్‌నాథ్‌ను సస్పెండ్ చేయాలి. కులం పేరుతో దూషించిన ఏఎస్‌ఐ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం అప్పాపురం దళితవాడ వాసులు బాధిత విద్యార్థులు, యువకులతో కలిసి మెయిన్ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. పన్నెండు మందిలో అగ్రవర్ణాల పిల్లలు కూడా ఉన్నారని, కానీ వాళ్లను వదిలేసి దళిత బిడ్డలనే స్టేషన్‌కు పిలిపించి దాడి చేయడం ఏంటని ప్రశి్నంచారు. చదువుకునే పిల్లలను ఇలా విచక్షణారహితంగా కొట్టడం ఏమిటంటూ తల్లిదండ్రులు నిప్పులు చెరిగారు.
బాధిత యువకులు, విద్యార్థులు స్టేషన్‌లో సీసీ కెమెరాల్లేని గదిలోకి తీసుకువెళ్లి పోలీసులు అమానుషంగా దాడి చేశారని వాపోయారు. స్టీల్ రాడ్లతో సైతం కొట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో వందల మంది మహిళలు, స్థానికులు రాస్తారోకోలో పాల్గొనడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దళితసంఘ నాయకుడు చార్వాక దళితులకు మద్దతు పలికి, రాస్తారోకోలో పాల్గొన్నారు. దళిత బిడ్డలపై అబద్ధాలతో ఫిర్యాదు చేసిన మహిళతో పాటు కులం పేరుతో తమను, తమ పిల్లలను దూషించిన ఎస్‌ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ చార్వాక దళితవాడ ప్రజలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో చివరికి వారు శాంతించారు. కాగా, పోలీసుల దాషీ్టకానికి బలైన దళిత విద్యార్థులకు వైఎస్సార్‌సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ అండగా నిలిచారు. బుధవారం మధ్యాహ్నం అప్పాపురం దళితవాడలో పర్యటించిన ఆయన బాధిత విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనను ఇంతటితో వదిలేది లేదని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదలబోమని హెచ్చరించారు.


