వంతెనపై పచ్చ వంచన
వైఎస్సార్ సీపీ హయాంలో నిర్మాణానికి ముందుస్తు చర్యలు.. సింహభాగం పూర్తి రెండు పర్యాయాలు జరిగిన సంయుక్త తనిఖీలు చొరవ చూపిన అప్పటి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గుంటూరుకు నిధులు మళ్లింపు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు స్థానిక ఎమ్మెల్యే పాట్లు
నిధుల మళ్లింపు
నాడు భేష్
తొలి జాబితాలో పేరు లేదు
చంద్రబాబు ఎన్నికలకు ముందు మాట్లాడే మాటలకు, గెలిచాక ఆయన వైఖరికి పొంతన ఉండదని మరోమారు రుజువైంది. ఎమ్మెల్యేలు కూడా ఆయన తరహాలోనే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చీరాల ఫైరాఫీసు గేటు వద్ద ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ పై ఆర్‌ఓబీ (రోడ్డు ఓవర్ బ్రిడ్జి) నిర్మాణానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చెబుతున్న మాటలు కూడా టీడీపీ వైఖరికి నిదర్శనంగా నిలుస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.
చీరాల అర్బన్: స్థానికంగా మంజూరైన ఆర్‌ఓబీ నిధులు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాకే గుంటూరుకు తరలాయి. అప్పుడు ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యలు ఆ నిధులు గుంటూరు తరలిపోకుండా ఏం చర్యలు చేపట్టారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా మళ్లీ ఆర్‌ఓబీ మంజూరైట్లు తెలిసిందని, అందుకు సంబంధించిన పనులు ఎప్పటి నుంచి మొదలు పెడతారో తెలపాలని స్పీకర్ ద్వారా సంబంధిత మంత్రిని అడుగుతున్నట్లు ఎమ్మెల్యే కొండయ్య అసెంబ్లీలో మాట్లాడటం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడమేనని అంటున్నారు.
తాజా పరిస్థితి ఇదీ...
రైల్వే శాఖ తాజాగా ప్రకటించిన తొలి జాబితాలో చీరాల ఆర్‌ఓబీ పేరు లేదని ఆర్ అండ్ బీ అధికారులు చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది. జిల్లాలో అధికారిక గణాంకాల ప్రకారం 50 ఎల్‌సీలు (లెవల్ క్రాసింగ్‌లు)ఉన్నాయి. అందులో మొదటి విడతగా 24 లెవల్ క్రాసింగ్‌లకు సంబంధించిన ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ, ఎఫ్‌ఓబీల నిర్మాణాలు చేపట్టాలని రైల్వేశాఖ భావిస్తున్నట్లు స్థానిక అధికారులు చెప్తున్నారు.
కనీసం తనిఖీ జరిగిందా?
ఆర్‌ఓబీ నిర్మాణానికి ముందస్తుగా రైల్వే, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన జాయింట్ తనిఖీ జరగాలి. లోటుపాట్లు అధ్యయనం చేయాలి. తుది నివేదిక ఆధారంగా నిర్మాణ పనులు జరగాలి. అదంతా ఏమీ లేకుండానే అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆర్‌ఓబీ నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలపాలని కోరడం గమనార్హం.
ఎన్నికల అనంతరం చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన కొద్ది రోజులకే చీరాల ఆర్‌ఓబీ పై గుంటూరు టీడీపీ నేత కన్నుపడింది. ముందుగా పల్నాడు జిల్లాలోని ఓ ఆర్‌ఓబీకి సంబంధించిన నిధులను మళ్లింపునకు ఆ నేత ప్రయత్నించారు. ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో చీరాల ఆర్‌ఓబీ నిధుల మళ్లింపునకు గుంటూరు నేత ప్రయత్నాన్ని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అడ్డుకోలేదు. ఇప్పుడు ఆ నిధులు గుంటూరుకు తరలి వెళ్లాయని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబులు ఫైరాఫీసు గేటు వద్ద ఆర్‌ఓబీ ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ క్రమంలో బలరాం ప్రభుత్వ అధికారంతోపాటు తన వ్యక్తిగత పరిచయాలను కూడా వినియోగించారు. దీంతో ఒకటికి, రెండు పర్యాయాలు పలు శాఖల అధికారులతో సంయుక్త తనిఖీలు కూడా జరిపించారు. నిర్మాణ పనులకు సంబంధించిన ముందస్తు కార్యాచరణ దాదాపు పూర్తయింది. నిధులు మంజూరయ్యాయి. ఆ క్రమంలో ఎన్నికలు వచ్చాయి.
మాకు అందిన సమాచారం ప్రకారం బాపట్ల జిల్లాలో మొత్తం 50 రైల్వే లెవల్ క్రాసింగ్‌లున్నాయి. అందులో ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ, ఎఫ్‌ఓబీల కోసం ఆయా ప్రాంతాల స్థితిగతులను ప్రామాణికంగా తీసుకుని నిర్మాణాలు చేపడతారు. అందుకుగాను 24 లెవల్ క్రాసింగ్‌లను తొలి జాబితాలో పేర్కొన్నారు. ఆ జాబితాలో చీరాల ఆర్‌ఓబీ లేదు. రెండో జాబితాలో ఉండొచ్చని భావిస్తున్నాం. ఆ సమయంలో ముందస్తుగా రైల్వే, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ తదితర శాఖలకు సంబంధించిన ప్రతినిధులతో జాయింట్ ఇన్‌స్పెక్షన్ ఇప్పటికి జరగలేదు.
– ఎం. నళిని, డీఈ, ఆర్‌అండ్‌బీ, చీరాల
వంతెనపై పచ్చ వంచన


