మంత్రి నారాయణ, టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌ను నిలదీస్తున్న రైతులు
రాజధాని భూసమీకరణపై వడ్డమాను గ్రామసభలో రైతుల నిలదీత
గతంలో రోడ్డున పడినా పట్టించుకోలేదంటూ మంత్రి నారాయణపై ఆగ్రహం.. మూడేళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేయకపోతే మా పరిస్థితి ఏంటి?
లేదంటే ఎకరాకు రూ.5 లక్షలు పరిహారమిస్తారా?
ప్రభుత్వం నుంచి హక్కులు సాధించుకునేలా అగ్రిమెంట్ చేయండి.. ఎకరాకు రూ.60 వేల కౌలు, రిటర్నబుల్ ప్లాట్ల సైజ్ పెంచాలని పట్టు
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ: ‘‘మిమ్మల్ని నమ్మి భూములు ఎలా ఇవ్వాలి? భవిష్యత్తులో మాకు అన్యాయం జరిగితే పరిస్థితి ఏంటి? మీరు హామీలిచ్చి వెళ్లిపోతారు. తర్వాత దిక్కెవరు?’’ అని రాజధాని అమరావతి రెండో విడత భూ సమీకరణలో వడ్డమాను గ్రామ రైతులు మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌లను నిలదీశారు. భూములు తీసుకున్న మూడేళ్లలో అభివృద్ధి చేసివ్వకపోతే ఎకరాకు రూ.5 లక్షల చొప్పున ఏటా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బుధవారం తుళ్లూరు మండలం వడ్డమాను, అమరావతి మండలం యండ్రాయి గ్రామాల్లో సభలు నిర్వహించారు. ‘‘గతంలో ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాలు అందజేయగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. రోడ్డున పడినా పట్టించుకోలేదు. ప్రభుత్వం చేయలేకపోతే ఏంటి? అనేదానిపై సరైన జవాబు చెప్పాలి’’ అని వడ్డమానులో మంత్రి నారాయణను రైతులు ప్రశ్నించారు. రైతు ఆళ్ల బసవ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి? మూడు కాదు నాలుగేళ్లు తీసుకోండి. అనుకున్న సమయంలో ప్లాట్లు అభివృద్ధి చేయలేకపోతే మేం కోర్టులకు వెళ్లి లేదా ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించుకునేలా ప్రభుత్వం అగ్రిమెంట్ చేయాలి’’ అని కోరారు.
⇒ ల్యాండ్ పూలింగ్ కాంపిటెంట్ అథారిటీ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించి గ్రామస్థులతో మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశంలో భూములు ఇచ్చేందుకు సమ్మతిస్తూ వడ్డమాను రైతులు మైనేని సత్యనారాయణ, సాయితరుణ్, వడ్లమూడి శ్రీలక్ష్మిలు ఫారం–1ను అందజేశారు. సీఎం సూచనతో పూలింగ్‌లో భూములిచ్చే రైతు కుటుంబాలకు రూ.లక్షన్నర రుణమాఫీ ప్రకటిస్తున్నట్లు నారాయణ తెలిపారు. కౌలు పెంచేందుకు సీఎం అంగీకరించారని చెప్పారు. వడ్డమానులో 1,768 ఎకరాల పూలింగ్ ప్రారంభించిగా ముగ్గురు రైతులు ఫారం–1 ఇచ్చారన్నారు. గతంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన, ఇతర కారణాలతో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. అమరావతిలో పనులు మూడేళ్లలో పూర్తవుతాయని, రైతులకిచ్చే ప్లాట్‌లలో ముందు 2 వరుసల రోడ్లు నిర్మింస్తామన్నారు. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఎ.భార్గవ్ తేజ పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అగ్రిమెంట్‌పై మీకు అభ్యంతరం ఏమిటి?
వడ్డమాను రైతు చిట్టా సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ‘‘ఇదివరకు మెట్టకు 1,250, జరీబుకు 1,450 గజాలు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వానికి సరిపడా భూములున్నాయి కనుక 1,450 గజాలు ఇవ్వాలి’’ అని కోరారు. ఎకరాకు రూ.60 వేల కౌలు ఇవ్వాలని, భూ సమీకరణ చట్టం రైతులకు అనుకూలంగా లేదని, ప్లాట్ల అభివృద్ధిపై అగ్రిమెంట్ చేసివ్వడానికి ప్రభుత్వానికి అభ్యంతరమేంటి? అని రైతులు సూటిగా ప్రశ్నించారు. అగ్రిమెంట్ చేసేది లేదంటూ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ పదేపదే చెప్పడంతో పాటు ‘‘మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లతో కోర్టుకు వెళ్లొచ్చు’’ అని సమాధానమిచ్చారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చేయలేదనే గడువు పెంచి ఇప్పుడు రైతులకు పరిహారం ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.


